– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తన స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో సుమారు 97 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప ఎన్నికలలో BJP MLA లు గెలుపొందిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో…ఏం అభివృద్ధి చేశారో తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు. BJP నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే BJP నేతలకు కులాలు, మతాలు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు ఏమైనా చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, KCR కిట్, ఆసరా పెన్షన్ ల పంపిణీ, రైతుబందు క్రింద రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో కులవృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాను ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు… తనను గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి లో పోటీ పడాలి తప్ప….నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలకు ఏం మేలు జరగదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి KCR శ్రీరామరక్ష అన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నారని, మునుగోడ్ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.