– విద్యార్థుల బాధ్యత టీచర్లది
– టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి… విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దాలి
– సీఎంగా ఉన్నా… నేనూ నిత్య విద్యార్థినే
– మెగా డీఎస్సీ నియామకాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
– టీచర్ల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ఎన్నో సంస్కరణలు తెచ్చాం
– రాష్ట్రం నెంబర్-1గా ఉండాలి… టీచర్లు సహకరించాలి
గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందజేత
విజయవాడ: దేశంలోనే ఉత్తమ విద్యార్థులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలని, కేవలం పాఠాలే కాకుండా విద్యార్థుల్లో స్పూర్తి నింపి, వారిలోని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు బయటకు తీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
మన భవిష్యత్ మన చేతిలోనే ఉందన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులను టీచర్లు అందిపుచ్చుకొని పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా విద్యాబోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని, ఉద్యోగుల ఆకాంక్షలు తప్పక నెరవేరుస్తామని… అలాగే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని సీఎం స్పష్టం చేశారు.
విజయవాడ ఏ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ను పరిశీలించారు. ప్రభుత్వ బడులు, కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందేలా తీర్చిదిద్దాలని, ఇంటర్మీడియట్ నుంచే పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ముఖ్యమంత్రి సూచించారు.
ఉపాధ్యాయుల రుణం తీర్చుకోలేం
నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గురుపూజోత్సవం కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నానని చంద్రబాబు అన్నారు. తల్లిదండ్రుల తర్వాత మనం ‘గౌరవించేది ఉపాధ్యాయులనే. చరిత్ర మరువలేని వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్… టీచర్ గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశ రాష్ట్రపతిగా ఎంపికయ్యారని చంద్రబాబు అన్నారు. విద్య లక్ష్యం సంపాదన కాదు…విద్యా వివేకం, విమర్శనాశక్తిని అందించాలన్న సర్వేపల్లి గారి మాటలు మనకు ఆదర్శం కావాలని సూచించారు.
టీచర్లను ఎప్పటికీ మర్చిపోలేమని… తనకు చిన్నతనంలో చదువు చెప్పిన భక్తవత్సలం మాస్టారు ఇంకా గుర్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి. ఆ గురువు స్పూర్తితోనే నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ… ప్రజలకు ఎలా ఉపయోగించాలనే ఆలోచన చేస్తూ ఉంటానని సీఎం వివరించారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా మనం టీచర్స్ డే జరుపుకోలేకపోయామని… టీచర్స్ డే సందర్భంగా 175 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు.
పిల్లలకు ఆస్తులు కాదు..విద్యా బుద్దులు చెప్పించాలి
పిల్లలకు ఆస్తులు ఇవ్వడంకంటే మంచి చదువు చెప్పిస్తే ప్రయోజకులు అవుతారని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యార్థుల భవిష్యత్ టీచర్ల చేతిలోనే ఉంటుందని… వారంతా టెక్నాలజీని అందిపుచ్చుకుని నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. ఐటీపై పట్టు సాధిస్తే విద్యార్థులకు ఏఐ సాయంతో ఎంతో నేర్పించే అవకాశం ఉందని వెల్లడించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ లోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ప్రతి పాఠశాలలో ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసి పాఠశాల పాత స్టూడెంట్ తో పాటు తల్లిదండ్రులను అందులో భాగస్వామ్యం చేయాలని సీఎం చెప్పారు.
టీచర్ల ఆత్మ గౌరవం పెంచేలా విద్యా రంగంలో సంస్కరణలు
మొదట్నుంచీ తాను విద్యారంగంలో సంస్కరణలకు పాధాన్యత ఇచ్చానని, నియామకాల విషయంలో నిర్లక్ష్యం చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ నియామకాలపై చేశానని చెప్పారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా డీఎస్సీ నియామకాలు చేపట్టిన విద్యాశాఖను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.
మెగా టీచర్స్ మీటింగ్స్ నిర్వహించామని… ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే విధానం అమలు చేస్తున్నామని… ఒకప్పుడు టీచర్ల బదిలీలు జడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవని… టీచర్ల గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాను తొలిసారి సీఎం అయినప్పటి విషయాలను గుర్తు చేశారు.
మహిళల ఉన్నతికి బాటలు
అలాగే మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామన్నారు. ఆర్టీసీ కండెక్టర్లుగా మహిళలను నియమించామని సీఎం చెప్పారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మగవారి కంటే ఎక్కువ ఆడవారే సంపాదిస్తున్నారని.. ఇది తనకు చాలా సంతోషం కలిగిస్తోందని సీఎం చెప్పారు. తల్లికి వందనం పథకానికి రూ. 10 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
జీఎస్టీ సంస్కరణలతో వెలుగులు
2019-24 మధ్య మన రాష్ట్రానికి విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయం అందించారని అన్నారు. ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని.. వీటి వల్ల వినియోగదారులకు భారీ వెసులుబాటు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని… కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకుతీసుకెళుతున్నామని సీఎం చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి మన దేశం వెళుతుందని… ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలని, మన దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా కోరికని… దీనికి టీచర్లంతా సహకరించాలని చంద్రబాబు కోరారు.
గతానికి భిన్నంగా జరిగిన టీచర్స్ డే వేడుకలు
ఈ ఏడాది టీచర్స్ డే వేడుగలు ఆద్యంతం ఆహ్లాదంగా… సరదా సంభాషణలతో సాగింది. టీచర్లను సీఎం చంద్రబాబు-మంత్రి లోకేష్ నవ్వులతో ముంచెత్తారు. తండ్రిగా చంద్రబాబు తనను ఎలా చదివించారో సభలో మంత్రి లోకేష్ ప్రస్తావించారు. తాను చదువుకునే రోజుల్లో కొన్ని అంశాల్లో వెనుకబడితే… నేడు మంత్రిగా ఉన్న నారాయణను పిలిపించి బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారని మంత్రి లోకేష్ నవ్వుతూ చెప్పారు.
దీంతో సభ ఆహ్లాదంగా మారింది. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా లోకేష్ గురించి నవ్వుతూ ప్రస్తావించారు. లోకేష్ కు చదువుకు చెప్పించిన ఘనత తన భార్యదేనంటూ క్రెడిట్ భువనేశ్వరికి కట్టబెట్టారు. స్టూటెండుగా తన చిన్ననాటి అనుభవాలను మంత్రి లోకేష్ పంచుకున్నారు. తనది రౌడీ బ్యాచ్, తాను బ్యాక్ బెంచ్ స్టూడెంటైనా… ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నానని చెప్పిన లోకేష్. ఇక టెక్నాలజీ పరంగా లోకేష్ ముందున్నా… తనతో పోటీ పడలేరంటూ సీఎం ఛలోక్తులు విసిరారు.
ఇక తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఐటీ రామయ్యతో తనకు ఎదురైన అనుభవాలు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు కోసం తాను రికమెండ్చేస్తే ఐఐటీ రామయ్య తిరస్కరించేవారని, అయినా ఐఐటీ రామయ్యపై తనకు కోపం రాలేదని, గౌరవం పెరిగిందని చంద్రబాబు చెప్పారు. తనకు ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఆఫర్ చేస్తే రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో ఆ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించానని నాటి సంగతులను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.