సీఎంని అభినందించకుండా ఎలా ఉంటాం?
ఉద్యోగులకు మేలు జరిగినప్పుడు పొగడడంలో తప్పు లేదు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
ఉద్యోగులకు సీఎం జగన్ మంచి చేస్తుంటే అభినందించకుండా ఎలా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి, సీఎంకు కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తొత్తులుగా ఉన్నారని కొందరు విమర్శించడం తగదన్నారు.
ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు స్వాగతించకుండా ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేయాలని ప్రశ్నించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఇబ్బందులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది కాబట్టి అభినందిస్తున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఇళ్లల్లో సీఎం ఫొటో పెట్టుకుంటామని చెబుతున్నారని, ఎందుకంటే 20 ఏళ్లుగా పరిష్కారం కాని వారి సమస్యను సీఎం జగన్ పరిష్కరించారన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాల నేతలను విమర్శించడం సరికాదని, రాజకీయ పార్టీలు చెప్పినట్టు ఉద్యోగ సంఘాలు నడుచుకోవని, ఉద్యోగులకు మేలు జరిగినప్పుడు పొగడడంలో తప్పులేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని, దానిపై చంద్రబాబును అడిగితే తాము మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పారని గుర్తుచేశారు.
మేనిఫెస్టోకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై గత ప్రభుత్వం ఇచ్చిన విలువ ఎలాంటిదో దీనినిబట్టి గ్రహించాలని కోరారు. కొత్త పీఆర్సీ కమిషన్ కోసం చలో అసెంబ్లీ, చలో రాజధాని కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అవేమీ లేకుండానే సీఎం తనంత తానుగా 12వ పీఆర్సీ కమిషన్ నియమిస్తామని చెప్పడం అభినందించదగ్గ విషయమన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను సెప్టెంబర్ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు.