-విపక్షాల విన్నపాన్ని విస్మరించడం అన్యాయం
-అమితా, జగన్ జేబు సంస్థగా మారిన సీబీఐ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ కడప : దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తుగొలిపే పలు సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయని మరీ ముఖ్యంగా భారత పార్లమెంటు అత్యున్నత పాత్ర కలిగిన నూతన పార్లమెంటు భవనాన్ని దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము లేకుండా ప్రారంభించడాన్ని విస్మయంతో పాటు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన సీబీఐ అమితా, జగన్ జేబు సంస్థలుగా మారాయని ఘాటుగా విమర్శించారు.
శనివారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆ బిల్లుకు ఆమోదముద్ర. కావాలంటే రాష్ట్రపతి మాత్రమే ఆమోదముద్ర వేయగలదు అలాంటి రాష్ట్రపతికి విలువ ఇవ్వకపోవడం క్షమించరాని నేరంగా ఆయన వర్ణించారు.
ద్రౌవదిముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేసిన రోజుల్లో గిరిజన మహిళకు ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే అత్యున్నత పదవికి ఎంపిక చేసిందని ఆమె చట్టసభలు, విలువలు తెలిసిన వ్యక్తిగా అభివర్ణించి గొప్పలు చెప్పిన బీజేపీ సర్కార్ నేదు ఆమెను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని. 21 రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ విషయాన్ని బీజేపీ దృష్టికి తెచ్చినా వారు పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్దంగా ముందుకు వెళు తున్నారని విమర్శించారు.
అదే ఈపాటికి ప్రణబ్ ముఖర్జీ. వెంకట్రామన్ లాంటి వారిని అహ్వానించకుండా ఉండి ఉంటే ప్రతిఒక్కరు గొంతెత్తి విమర్శించేవారని ఆమె గిరిజన మహిళ కాబట్టే ఎవరూ విమర్శించలేదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాత్రమే జరిగే అన్యాయాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మోదీని బలపరచడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు.
మరి వారు రాజకీయంగా భయపడుతున్నారో ఇతరత్రా వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి పాటుపడుతున్నారో వారికే తెలియాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సీపీఐ, ఈడీ, ఇన్కమ్లట్యాక్స్, గవర్నర్ల వ్యవస్థను రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డగోలుగా తమ ఇష్టానుసారం వాడుకుంటుందన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను ఇలా వాడుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ప్రస్తుతం సీబీఐను చూసి ప్రజలు నవ్వుకునే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అందుకు నిదర్శనమే వైఎస్ అవినాష్‌రెడ్డి కేసును ఆయన ఉదహరించారు.
కేంద్ర మంత్రి అమితా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో సీబీఐను తమ జేబు సంస్థగా చేసుకొని ప్రజలలో చులకన భావన అయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ను 9 గంటల పాటు విచారించిన సీబీఐ ఉపముఖ్యమంత్రి సిసోడియాను రెండుమాసాలుగా జైలులోనే పెట్టారని మరి అవినాష్‌రెడ్డి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో వంద కోట్లకు జరిగిన అవినీతిని బూచిగా చూపించారు.
మరి మన రాష్ట్రంలో నెలకు వందకోట్ల ఇసుకరంగా, మట్టిదందా లాంటివి జరుగుతూనే ఉన్నా ఈ విషయాలు సీబీఐకు పట్టవా అని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో సీబీఐ వారి పనితీరును చూస్తుంటే ప్రజలకు విస్మయాన్ని కలిగించిందని కర్నూలుకు వచ్చిన సీబీఐ గెస్టుహౌస్ లో కూర్చుని జుట్టుపీక్కోవడం తప్ప మరొకటి ఏమీ చేయలేకపోయిందన్నారు. అదే కర్నూలులో జర్నలిస్టుల మీద దారుణంగా షెట్టర్లు మూసి మరీ దాడులు చేస్తే ప్రశ్నించే వారే కరువయ్యారన్నారు. లోకల్ పోలీసులు చేతులెత్తేయడం, లోకల్ సీజను బండబూతులు తిట్టడం ఒక్క వైసీపీకే చెల్లిందన్నారు. జరిగిన సంఘటనను ఎస్సీ, ఏఎస్సీలకు వినతిపత్రం ద్వారా తెలిపినా చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యారని ఘాటుగా విమర్శించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు గానీ తన కుటుంబానికి గానీ ఏమాత్రం ప్రమేయం లేదని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. కానీ ఈ విషయంలో ఆయన కాకుండా ఆయన సలహాదారుడు, సజ్జల రామకృష్ణ ప్రకటనలపై ప్రకటనలు గుప్పిస్తున్నారని ఈ విషయంపై సీఎం ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యవస్థలను కుంగదీస్తూ ప్రతిపక్ష పార్టీలను లెక్కచేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకి తిలోదకాలిస్తున్న జగన్మోహన్రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఈ విషయంపై త్వరలో చర్చావేదికలు నిర్వహిస్తామని చర్చా కార్యక్రమంలో మేధావులను, నిప్పణులను భాగస్వాములను చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దమననీతిని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాసురేష్ తదితరులు పాల్గొన్నారు.