-అప్పుడు జయదేవ్.. ఇప్పుడు సత్యనారాయణ
-చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లిన అమరరాజా బ్యాటరీ
-ఇప్పుడు విశాఖలూ వ్యాపారాలు చేయనని తెగేసి చెప్పిన వైసీపీ ఎంపీ సత్యనారాయణ
-సొంత ఎంపీ రక్షణకే దిక్కులేకపోతే మిగిలిన వారి సంగతేమిటి?
-రౌడీమూకల అడ్డాలో ఇక పెట్టుబడులు పెట్టేదెవరు?
-గంజాయివనంలో విదేశీ పెట్టుబడులపై ఇక ఆశలు వదలుకోవడమేనా?
-ఇక మిగిలిన కంపెనీలూ హైదరాబాద్‌కే తరలిపోతాయా?
-కడప, చిత్తూరు రౌడీల గుప్పిట్లో విశాఖ
-సెటిల్మెంటులో బిజీగా మారిన ఓ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే
-అమిత్‌షా ఆందోళన తర్వాత కూడా చర్యలు తీసుకోరా?
-సీఎంఓ కనుసన్నలోనే భూ వ్యవహారాలంటూ విపక్షాల ఆరోపణలు
-విశాఖ విషాదానికి అంతమెప్పుడు?
-భయం గుప్పిట్లో విశాఖ జనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొద్దినెలల క్రితం తమపై వేధింపులు భరించలేక అమరరాజా బ్యాటరీస్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లింది. అసలు ఆ కంపెనీ తమ రాష్ర్టానికి అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు బేఫర్వాగా
సెలవిచ్చారు. హైదరాబాద్ తరలివెళ్లిన ఆ కంపెనీని తెలంగాణ పాలకులు గుండెల్లో పెట్టుకుని ఆహ్వానించారు. అలా తెలంగాణ తరలించిన ఆ 9400 కోట్ల ప్లాంట్ యజమాని, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్!
ఇప్పుడు విశాఖకు చెందిన మరో వ్యాపారి కమ్ పొలిటీషియన్.. విశాఖలో బిచాణా ఎత్తేసి, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటానని బహిరంగంగానే ప్రకటించారు. అలా ప్రకటించిన వ్యక్తి అనామకుడు,
అల్లాటప్పావాడేమీ కాదు. సాక్షాత్తూ అధికార వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ.
ఒకరు టీడీపీ, మరొకరు వైసీపీ ఎంపీలయినప్పటికీ.. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కూడా అయినప్పటికీ.. ఇద్దరూ జమిలిగా అధికార పార్టీ బాధితులే కావడం విశేషం. టీడీపీ ఎంపీ జయదేవ్ వైసీపీ సర్కారు వేధింపులకు తాళలేక, బయట రాష్ర్టానికి వెళ్లే పరిస్థితి సృష్టిస్తే.. సొంత పార్టీ వర్గాల బెదిరింపులు తట్టుకోలేక, తనంతట తాను పక్క రాష్ర్టానికి వెళ్లాల్సిన పరిస్థిని సొంత పార్టీ ఎంపీకి సృష్టించడమే ఇక్కడ విశేషం. ఇప్పటికే కమ్మ సామాజికవర్గాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు. విశాఖ వైసీపీ ఎంపీ ప్రకటన నిజం చేశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రశాంతతకు మారుపేరైన విశాఖ ఇప్పుడు గంజాయితో తూగుతోంది. రౌడీమూకలు, ప్యాక్షనిస్టుల కత్తులతో బెంబేలెత్తుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఆరోపించారు. అయినా సర్కారులో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్ర రాజధానిగా మారనున్న విశాఖకు, వేలకోట్లు పెట్టుబడుల రూపంలో పరవళ్లెతుతున్నాయంటూ , సర్కారు ఆర్భాటంగా ప్రకటనలు హోరెత్తిస్తోంది.
కేంద్ర హోం మంత్రి అంతటి వాడే, విశాఖలో శాంతిభద్రతలు లేవని ఆరోపించారు. ఆయన చెప్పిన కొద్దిరోజులకే.. అధికారపార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన వైనం దేశాన్ని ఆకట్టుకుంది. ఈ పరిస్థితిలో
‘విషాదపట్నం’గా మారిన విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారన్నది విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం.
కడప, చిత్తూరు జిల్లాల నుంచి తిష్టవేసిన సెటిల్మెంట్ గ్యాంగులు డజన్ల కొద్దీ విశాఖ శివార్లలో స్వైరవిహారం చేస్తున్నాయి. స్వయంగా ఒక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని ఆయన కుమారుడి ఇంట్లోనే చెరపట్టి, డబ్బులు కొట్టేసిన తెంపరితనం విశాఖవాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ప్రశాంతతను కోరుకుంటూ, దశాబ్దాల నుంచి దానిని ఆస్వాదిస్తున్న విశాఖ జనానికి ఈ రౌడీమూకలు, సెటిల్మెంట్ల గ్యాంగులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు. అక్కడికి అడ్డపంచెలతో వాలిపోతున్న సీమ ముఠాలను చూసి విశాఖ వణికిపోతోంది. ముందు భూములు కబ్జా చేయడం, సీమ ముఠా అక్కడికి వెళ్లి బైఠాయించడం సాధారణమయిపోయింది. తర్వాత భూ యజమానులతో సెటిల్మెంట్ చేసుకుని వారిని వెళ్లగొడుతున్న సంస్కృతి.. గత నాలుగేళ్లుగా విశాఖలో విచ్చలవిడిగా, విజయవంతంగా సాగుతోంది. నిర్నిరోధంగా సాగుతున్న ఈ వ్యవహారాలకు అధికారపార్టీ ఆశీస్సులు, సీఎంఓ ప్రోత్సాహం ఉందంటూ విపక్షాలు కూడా విరుచుకుపడుతున్నా, చర్యలు శూన్యం.
గతంలో ఒక కలెక్టరు, మరో జాయింట్ కలెక్టరు హయాంలో అయితే భూములు విచ్చలవిడిగా దోపిడీ జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. సీఎంఓ ఆశీస్సులున్న ఓ జాయింట్ కలెక్టర్ కనుసన్నలలోనే భూ వ్యవహారాలు చక్కదిద్దేవారన్న ప్రచారం జోరుగా సాగింది. సీఎంఓలోని ఓ అధికారి ఏరికోరి తనకు కావలసిన ఆ అధికారిని విశాఖకు జాయింట్ కలెక్టర్‌గా నియమించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.
ఇప్పుడు కమిషనరేట్ సమీపంలోని భూమి వ్యవహారంలోనే విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారంటున్న వార్తలు గుప్పుమంటున్నాయి. సహజంగానే విశాఖలో ఉన్న గంజాయి బ్యాచ్‌కు, కడప-చిత్తూరు ప్యాక్షనిస్టులు తోడయ్యేసరిగి.. తమ పరిస్థితి విషాదంగా మారిందన్నది విశాఖవాసులు వేదన.
కాగా పాలకులకు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, విశాఖలోనే తిష్టవేసి భూముల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే తన బదులు కుమారుడికి సీటు ఖరారు చేసుకున్నారు. దానితో ఆయన అక్కడి వ్యవహారాలు కొడుక్కి అప్పచెప్పి, పూర్తిగా విఖాఖ భూముల సెటిల్మెంట్లపై దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ రూరల్ ఏరియాలో భూముల అమ్మకాలు-కొనుగోళ్లు సదరు ఎమ్మెల్యే కనుసన్నలలోనే నడుస్తున్నాయన్న చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే జరుగుతుండటం విశేషం. సీఎంఓ స్వయంగా విశాఖ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తోందని, ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల నియామకాలు కూడా సీఎంఓ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కావలసిన రెడ్డి, లేదా దళిత క్రైస్తవ అధికారులను అవసరం తమకు ఉపయోగం ఉన్న చోట నియమిస్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నిజం ‘జగన్నాధు’డికికెరుక?