Suryaa.co.in

Andhra Pradesh

పోలవరాన్ని సర్వనాశనం చేసి తిరిగి టిడిపిపై నింద వేయడం సిగ్గుచేటు

-కాంట్రాక్టర్ ను మార్చి పోలవరాన్ని నాశనం చేసిన రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి
-వైఎస్ విగ్రహం పెట్టేందుకు జగన్ రెడ్డి దగ్గర డబ్బులున్నాయి.. కాని నిర్వాసితులను ఆదుకునేందుకు డబ్బులు లేవా? కేంద్రం ఇవ్వాలా?
-ఆంబోతు రాంబాబు ఎన్ని రంకెలేసినా ప్రజలు నమ్మరు
-టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు

ప్రస్తుతం సైట్ లో ఉన్న కాంట్రాక్టర్ పని తీరు సంతృప్తికరంగా ఉంది. మార్చాల్సిన అవసరం లేదు. 2009లో వైఎస్ కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. ఇప్పుడూ అదే పరిస్థితి తలెత్తితే ప్రమాదమని ఆగస్టు 13, 2019న పీపీఏ 10వ మీటింగ్ మినిట్స్ లో పేర్కొంది. అయినా జగన్ రెడ్డి కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాతో రిజర్వ్ టెండరింగ్ కి పాల్పడి కాంట్రాక్టర్ ను మార్చారు.

జగన్ రెడ్డి అసమర్ధతతో డ్యాం సైట్ లో 15 నెలల పాటు కాంట్రాక్టర్ లేకపోవడంతో 2020 ఆగస్టు – అక్టోబర్ లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా పునరావాసం పేరుతో దాదాపు రూ.100 కోట్ల అవినీతి జరిగిందని కూడా ఐఐటి తన నివేదికలో పేర్కొనడం అంబటికి తెలియదా? జగన్ రెడ్డి ఆస్తులను కాపాడుకోవడానికి పక్క రాష్ట్రంతో కుమ్మక్కై బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఎత్తు తగ్గించి బ్యారేజీగా మారుస్తున్నారు.

నిర్వాసితులకు ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని పాదయాత్రలో హామీనిచ్చి, తరువాత రూ. 10 లక్షలు ఇస్తానని మాట మార్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఒక్క కొత్త ఇల్లు కట్టలేదు. పైపెచ్చు రూ.10 లక్షల హామీనే ఇవ్వలేదని సెప్టెంబర్ 19, 2022న అంబటి రాంబాబు అసెంబ్లీ లో సమాధానమిచ్చారు.

41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు సెప్టెంబర్ నెలాఖరులోగా పరిహారం ఇస్తాం. 45.72 కాంటూరు గ్రామాలకు పరిహారంపై కేంద్రంతో మాట్లాడతా.. వెయ్యి, 2వేల కోట్లైతే ఏదోలా సర్దుకునేవాడిని ఏకంగా రూ.20వేల కోట్లు కాబట్టి కేంద్ర సహాయం తప్పక తీసుకోవాల్సిందే పెద్ద మనసుతో అర్ధం చేసుకోండని ఆగస్టు 27, 2022న జగన్ రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల పర్యటనలో ఇలా చిలకపలుకులు పలికారు.

సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి పోలవరం కట్టేది నేను కాదు.. కేంద్రం. పునరావాసం వాళ్లతో ముడిపడి ఉందని ఆగస్టు 07, 2023న అన్నారు. అంటే దీనిని బట్టి నిర్వాసితులకు న్యాయం చేయనని చెప్పకనే చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాం పెట్టేందుకు రూ.248 కోట్లు ఖర్చు చేస్తామని జనవరి 09, 2023న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాని నిర్వాసితులకు ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి జగన్ రెడ్డికి చేతులు రావడం లేదా?

టీడీపీ 5 ఏళ్లల్లో ఒక్క పోలవరం ప్రాజెక్టుకు రూ.11,537 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పనులు పూర్తి చేసింది. జగన్ రెడ్డి 4 ఏళ్లల్లో రూ.4,611 కోట్లు ఖర్చు చేసి 4 శాతం పనులు పూర్తి చేశారు. నాడు కేంద్రం నుంచి ప్రశంసలు వస్తే నేడు చివాట్లు వస్తున్నాయి. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 62 జలవనరుల ప్రాజెక్ట్ లను చేపట్టి 2014-19 మధ్య రూ.68,293 కోట్లు ఖర్చు చేశారు. బడ్జెట్ లో 9.63 శాతం నిధులను సాగు నీటి రంగానికి వినియోగించారు. జగన్ రెడ్డి 2019-23 వరకు రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్ లో కేవలం 2.35 శాతం నిధులను వెచ్చించారు.

LEAVE A RESPONSE