రెండు కళ్లు చాలవు తాజమహల్ అందాన్ని చూడటానికి. మనకి అందాలు చూపించేది మన కళ్లే. ముఖారవిందానికి నయనారవిందం తోడైతే.. ఆ అందాన్ని వర్ణించడం ఒక్క కవులకే సాధ్యం. ఒక్క చూపే కాదు.. మనిషికి చెక్కుచెదరని అందాన్నిచ్చేది కళ్లే. ఎంతోమంది కవులు రచయిత(త్రు) తమ రచనల్లో కళ్ళ అందాన్ని అద్భుతంగా వర్ణించారు.
కళ్లు తదేకంగా చూస్తాయి అన్వేషిస్తాయి. నేను మొదటగా ఇష్టపడిన అమ్మాయిని.. ఆమె కళ్లని చూసే. మత్తెక్కించే అందం కళ్ళలో కనిపిస్తుంది. ఆరాధనా భావం కళ్లల్లోనే అగుపడుతుంది. సావిత్రి, సాధన, శ్రీదేవి, భానుప్రియ, శ్యామా వంటి నటీమణుల అందాన్ని.. కళ్ళే.. పెంచాయి. మూగమనసులు సినిమాలో కొన్ని సన్నివేశాలలో సావిత్రి, నాగేశ్వరరావు కళ్ళతోనే మాట్లాడుకుంటారు.
కళ్లతోనే భావాలు సమర్ధవంతంగా పలికించగల మహానటి సావిత్రి. శ్యామా, భానుప్రియ లవి మంచి expressive eyes. శ్రీదేవి నవ్వులోనే కాదు.. ఏడుపు దుఃఖంలో కూడా ఆమె కళ్ళు అందంగా కనపడతాయి. కృష్ణంరాజు లో పగ రగిలిందంటే.. ఆ కళ్ళు.. అగ్నిగోళాలే.. రగిలే జ్వాలలే. ఒక్కసారి కళ్లు భయపెడతాయి కూడా. కళ్లు తీక్షణంగా చూస్తే తట్టుకోలేం. నీవి ఎక్స్ రే కళ్ళు.. ఒళ్ళంతా కళ్ళే.. చూసి చూసి కళ్లు కాయలు కాచాయి.. వేయికళ్లతో ఎదురు చూస్తుంటాను.. వంటివి మనం కామన్ గా అనే / వినే మాటలు.
సినిమా పాటల్లో కూడా కళ్ళది అగ్రస్థానంమే. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే.. అని అక్కినేని వాణిశ్రీ పాడుకున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని వాణిశ్రీ ఎన్టీఆర్ ని ఊరించింది. నీ కళ్ళు చెబుతున్నాయి.. అంటూ అక్కినేని శ్రీదేవి కలిసి వేసిన చిందులు, చేసిన డాన్స్ లు మరిచిపోలేం.
అవేకళ్లు సినిమాలో కళ్లకే ప్రాధాన్యత. కళ్ళు వర్షిస్తాయి కూడా. బాధ నొప్పి ఐనా, విరహం వేదన ఐనా కన్నీళ్లు కార్చేవి కళ్లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కళ్లను మనం ఎప్పటికప్పుడు తగినవిధంగా సరియైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కళ్ళే ప్రపంచం సర్వస్వం.
– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని),
ధర్మపురి రోడ్ విజయనగరం,
ఫోన్ 99855 61852….