– మీ ఆస్తులకు తెలంగాణ.. అవసరాలకు ఆంధ్రానా..?
— అమరావతి అవినీతి సామ్రాజ్యం కోసం ఉత్తరాంధ్రపై విషం కక్కుతారా?.
-బరువు పెరిగారంటే బాబుకు ఇంటికన్నా జైలే మేలు కదా..?
– ఆయనకొచ్చే ఇంటి భోజనంపై అనుమానాలున్నాయి
– ఆ ఆహారాన్ని ముందుగా లోకేశ్‌తో తినిపించాకే.. బాబుకు పంపాలి
– జైలు అధికారులకు ఇది నా వ్యక్తిగత రిక్వెస్ట్
– ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా రామోజీ తీరు:
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనలతో పాటు విశాఖపట్నంలో పలు సమీక్షలకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనిపై దాదాపు రెండుమూడు రోజులుగా కొన్ని పత్రికలు భిన్న కథనాల్ని కూడా రాస్తున్నాయి. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహిత మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్ని చూస్తుంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతంపై అవి ఏరకంగా విషం చిమ్ముతున్నాయో అర్ధమౌతుంది.
రామోజీరావు పెట్టిన ఈనాడు పుట్టినస్థలం విశాఖపట్నం. ఆయన వ్యాపార సామ్రాజ్యానికి పుట్టినిల్లుగా ఉన్న ఈ ప్రాంతంపై మరీ ఇంత విషం చిమ్ముతారా..? అని ఆయన్ను ప్రశ్నిస్తున్నాను. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా ఉత్తరాంధ్ర, విశాఖ ప్రజలపై రామోజీరావు చూపుతున్న అక్కసుకు కారణమేంటని నిలదీస్తున్నాను. రామోజీరావు, వారి నాయకుడు చంద్రబాబు కలిసి అమరావతి కలల రాజధానిని తయారు చేసుకున్నారని అందరికీ తెలిసింది. ఇప్పుడు విశాఖ రాజధాని అంటే, అమరావతిపై తాము పెట్టిన పెట్టుబడికి ఎక్కడ నష్టం జరుగుతుందేమోననే భయాందోళన వారిలో కనిపిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఉత్తరాంధ్రపై పనిగట్టుకుని పగ పెంచుకున్నారని తెలుస్తోంది.
లోకల్, నాన్‌లోకల్ మధ్య యుద్ధమిదిః
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు అభివృద్ధి వికేంద్రీకరణే మార్గమని భావించి ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సామర్లకోట సభలో ప్రస్తావించిన అంశాలపైనా సర్వత్రా హర్షం వెలిబుచ్చారు. ఆయన మాటలకు ఉత్తరాంధ్ర ప్రజలంతా మద్ధతిస్తూ చర్చించుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర రాజధాని ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 యాజమాన్యాలన్నీ ఈ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తులేనని చెప్పాలి. ఇది యథార్థం. వారంతా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబాలకు చెందినవారు. వీరంతా ఎన్‌ఆర్‌ఏ (నాన్ రెసిడెన్స్ ఆంధ్రా వాసులు)లు. అందుకే, వారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాజధాని రావడానికి ఇష్టపడటంలేదు. ఇది లోకల్, నాన్‌లోకల్ వ్యక్తుల మధ్య జరుగుతున్న యుద్ధంగా దీన్ని భావించాలని ప్రజలను కోరుతున్నాను. ఆంధ్రా అభివృద్ధి, సంక్షేమాన్ని జీర్ణించుకోలేని రాష్ట్రేతరులు విషప్రచారాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.
పొలిటికల్ టూరిస్టులు చంద్రబాబు, పవన్‌లుః
2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చాక.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా వరుసగా ఒక వారంపాటు ఆంధ్రాలో ఉన్న సందర్భాలున్నాయా..? అని అడుగుతున్నాను. తన రాజకీయానికి తాను తెలంగాణ నుంచి ఒక పొలిటికల్ టూరిస్టు మాదిరిగానే ఆయన ఆంధ్రాకొచ్చి మూడు నాలుగురోజులు ఊదరగొట్టి పోవడం నిజం కాదా..? మరి, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ పట్టుమని పది రోజులు ఇక్కడ ఉన్నాడా..? గాజువాక ప్రాంతంలో కిందటి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు.. తాను ఓడినా గెలిచినా ఈ ప్రాంతం విడిచి వెళ్లనని .. ఇక్కడ్నే నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానన్న పెద్దమనిషి ఏం చేశాడు..?. నెలరోజుల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు ఎన్నిసార్లు తిరుగుతాడనేది అందరికీ తెలిసిందే కదా..?
రాజకీయాలకు ఆంధ్రా.. రెసిడెన్సీకి తెలంగాణః
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు పురందేశ్వరి గురించి కామన్ లక్షణంగా చెప్పుకోవాలంటే.. వీళ్లు రాజకీయంగా పోటీచేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం కావాలి గానీ.. నివాసానికి మాత్రం తెలంగాణ కావాలంట. ఇక, రామోజీరావు ఎప్పుడైనా కోర్టులకు హాజరుకావాలంటే తప్ప తనకు జన్మనిచ్చిన ఆంధ్రాప్రాంతానికి ఏనాడూ వచ్చిందిలేదు.
ఏబీఎన్ రాధాకృష్ణ గురించి చెప్పాలంటే, ఆయనకు ఆంధ్రప్రాంతంతో ఎలాంటి సంబంధాల్లేకున్నా చంద్రబాబుపై గురుభక్తి చూపిస్తుంటాడు. ఆనాడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీ లాక్కునే క్రమంలో రాధాకృష్ణ ఏం చేసి లాభపడ్డాడో అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో సీనియర్ రాజకీయ దిగ్గజమైన కొణిజేటి రోశయ్య గారు మాట్లాడుతూ.. ఇదే రాధాకృష్ణ సైకిల్ తొక్కుకుంటూ సచివాలయానికి రావడం.. మధ్యలో సైకిల్ చైన్ ఊడిపోతే.. తగిలించుకుని, చేతికంటిన గ్రీజ్ ఆయిల్ మరకల్ని తన ఛాంబర్‌కొచ్చి వాషింగ్‌బేసిన్‌లో శుభ్రం చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. మరి, అలాంటి సైకిల్ తొక్కిన రాధాకృష్ణ ఈనాటికి రూ.కోట్లకు పడగలెత్తి ఆంధ్రప్రాంతంపై ‘అవినీతి అనకొండ’ అవతారంతో ఏవిధంగా విషం కక్కుతున్నాడో ప్రజలు గమనించాలి.
గీతం అక్రమార్జనలు కనిపించవా..?
రుషికొండ గురించి పచ్చమీడియా కథనాలు రాసేటప్పుడు.. ఆ పక్కనే ఉన్న గీతం యూనివర్శిటీలో 40 ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేస్తే .. మేం అధికారంలోకి రాగానే దాదాపు 27 ఎకరాలు స్వాధీనం చేసుకుంటే.. మిగతా భూమిలో నిర్మించిన కట్టడాలకు సంబంధించి కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. ఈ అరాచకాలు టీడీపీ నేతలకు, పచ్చమీడియాకు కనిపించవా..? దాదాపు రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా కొల్లగొడితే వీరంతా ఎందుకు నోరుమెదపరని ప్రశ్నిస్తున్నాను.
రాష్ట్ర అభివృద్ధికి జగన్‌గారి కృషి ఇదిః
అమరావతి ప్రాంత అభివృద్ధి, అక్కడ భూముల ధరల పెంపుపైనే చంద్రబాబు అండ్ కో ఆలోచనలుంటాయి. అందుకే, వారు మిగతా ప్రాంతాలపై విషం చిమ్మే ప్రయత్నాల్లో నిత్యం పనిచేస్తుంటారు. కుట్ర రాజకీయాలకు పూనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించినా.. దానిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నేటికి నాలుగున్నరేళ్లల్లో దాదాపు రెండేళ్లు కోవిడ్‌తో పోరాటం చేయాల్సి వచ్చింది.
ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్న పరిస్థితి. సవ్యంగా పరిపాలన సాగేందుకు రెండున్నరేళ్లల్లోనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ, ఈ రాష్ట్రంలోని పేదవాడికి ఎలాంటి ఇబ్బందిలేకుండా.. ఏ ప్రాంతానికీ నష్టం కలగకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లామనేది అందరికీ తెలిసిందే.
విషప్రచారాన్ని ప్రజలు నమ్మరు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే విశాఖప్రాంతంలో మీ పార్టీ నాయకులే భూముల్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయికదా..? దొంగలపార్టీ టీడీపీ అని అందరూ చెప్పుకుంటుంటే.. వారేమో, తాము ఉత్తరాంధ్రను ఉద్దరించే మహానుభావుల్లా కలరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందా..? ఈ ప్రాంతంపై ప్రేమ ఉన్నట్లు నటించినంత మాత్రానా నమ్మడానికి ఇక్కడున్న ప్రజలంత పిచ్చోళ్లు కాదని వారు తెలుసుకోవాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వీరంతా దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నారు.
కేవలం, అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వీరు ఆంధ్రాప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం ఇస్తే రూ. కోటాను కోట్లు అవినీతి కుంభకోణాలకు పాల్పడిన సంగతిని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. రూ.కోట్లల్లో కూడబెట్టిన ఆస్తులకు తెలంగాణను కేంద్రంగా చేసుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణల్లాంటి దుర్మార్గుల విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని కోరుతున్నాను.
బాబు బరువు పెరిగితే రాద్ధాంతమా..?
అవినీతికి పాల్పడి రూ.కోట్లు మింగేసిన దొంగలా ఆధారాలతో పట్టుబడి జైలుకెళ్లాడు చంద్రబాబు. ఆయన్ను జైలులోపలకు తీసుకెళ్లేటప్పుడే వారి బరువు, ఆరోగ్యం అన్నీ పరిశీలిస్తారు. అలాంటిది, నేటికి చంద్రబాబు బరువు కిలో పెరిగిందంట. అంటే, ఆయన్ను ఇంట్లో బాగా చూసుకుంటున్నట్టా..? జైల్లో బాగా చూసుకుంటున్నట్టా..? ఆయన ఆరోగ్యంపై ఎవరికీ లేని అనుమానాలు వారి కుటుంబ సభ్యులకే ఎందుకొస్తున్నాయనేది మా అనుమానం.
బాబుకు పంపే ఆహారాన్ని చెక్ చేయడం మంచిదిః
చంద్రబాబుకు స్కిన్ అలెర్జీ వస్తే మా ప్రభుత్వానికి, జగన్‌గారికి ఏం సంబంధం?. రాజమండ్రి జైల్లో పరిస్థితులన్నీ బాగున్నాయని.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. మరోపక్కనేమో.. బాబు కుటుంబ సభ్యుల ఆందోళన చేస్తున్నక్రమంలో … వారు ఆయనకు పంపే ఆహారంలో ఏమైనా తేడా ఉందనేది నా అనుమానం. అందుకే, బాబుకు పంపే ఆహారాన్ని ప్రతీ రోజూ ముందుగా లోకేశ్‌కి తినిపించి చూశాకనే అనుమతించాలని జైలు అధికారుల్ని నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.