Suryaa.co.in

National

కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్లకు ఐటీ నోటీసు

-కళ్లు తేలేసిన విద్యార్ధి
-పాన్ కార్డు,ఆధార్ కార్డు లింక్స్ తో జాగ్రత్త
(శివ శంకర్. చలువాది)

కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల్ల లావాదేవీలు జరిపినందుకు గానూ రూ.46 కోట్లకు ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఆదాయ పన్ను నోటీసులు జారీ చేశారు. కాలేజీలో చదువుకునే తనకు అన్ని కోట్ల పన్ను ఎలా వచ్చిందో తెలియక సదరు విద్యార్ధి బిత్తరపోయాడు.

ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్‌ దండోతియా (25) అనే విద్యార్థి స్థానికంగా ఓ కాలేజీలో పీజీ చదువుతున్నాడు. ఇటీవల ప్రమోద్‌కు ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు వచ్చింది. దాంతో షాకైన ప్రమోద్‌ భయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇన్ని కోట్ల రూపాయల పన్ను తనకు ఎందుకు వచ్చిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ప్రమోద్‌ పాన్‌ కార్డుతో ఓ కంపెనీ రిజిస్టర్‌ అయిందని వెల్లడిస్తూ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వచ్చాయని గుర్తించాడు. సదరు కంపెనీ 2021 నుంచి ముంబై, ఢిల్లీలో పని చేస్తూ ఉన్నట్లు వెల్లడించాడు.

తనకు ఎలాంటి కంపెనీలు లేవని, ఇన్ని కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయో తనకు తెలియదంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తన పాన్‌ కార్డును దుర్వినియోగం చేసి ఎవరో కంపెనీ రిజిస్టర్‌ చేసుకున్నారని, ఆ లావాదేవీలు ఎవరు చేశారో తనకు తెలియదని మీడియాకు చెప్పుకొచ్చాడు. ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందిన వెంటనే సంబంధిత శాఖకు వెళ్లినట్లు తెలిపాడు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి చేరుకుని మరోసారి ఫిర్యాదు చేశారు.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) షియాజ్ KM మాట్లాడుతూ.. తన బ్యాంక్ ఖాతా నుండి రూ. 46 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ ప్రమోద్‌ అనే యువకుడి నుంచి ఫిర్యాదు అందింది. అతని పాన్ కార్డ్ ఎవరో దుర్వినియోగం చేశారు. పాన్‌ కార్డు ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుని, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు తెలిపారు. పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని నివారించడానికి క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలు తమ క్రెడిట్ స్కోర్‌ను తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలని సూచించారు.

తద్వారా తమ బ్యాంక్‌తో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే గుర్తించడానికి వీలుంటుంది. పాన్ కార్డ్ ఫోటోకాపీలను ఇతరులతో పంచుకోవడం నివారించాలి. అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. అలాగే ఫారమ్ 26AS ట్రాకింగ్ చేయడం ద్వారా కూడా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించవచ్చని ఆయన సూచించారు.

LEAVE A RESPONSE