Suryaa.co.in

Andhra Pradesh

ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదన్న మాట రాకూడదు

-వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌
-రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం ఆదేశం
-రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ప్రభుత్వం అలర్టైంది. రాష్ట్రంలో వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని సేకరించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే హార్వెస్టింగ్‌ చేసి ధాన్యం ఎక్కడా ఉన్నా సేకరించాలని ఆదేశించారు. వర్షాల బారి నుంచి పంటను కాపాడేందుకు చర్యలను మరింత ముమ్మరంగా చేయలన్నారు.

కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చులకింద ప్రతి కలెక్టర్‌కూ ఒక కోటి రూపాయలు కేటాయించారు. అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవాలని విత్తనాలు పంపిణీచేయాలని సీఎం ఆదేశించారు.

రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా.. లేక ఫిర్యాదులు ఉన్నా.. వాటిని నివేదించడానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారులు చర్యలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE