-బోయ/వాల్మీకుల వ్యతిరేక ప్రభుత్వమిది
-బోయల రిజర్వేషన్ పై కమిటీ ఏర్పాటుతో జగన్ రెడ్డి స్వీయ మరణశాసనం లిఖించుకున్నారు
– శాసనమండలి సభ్యులు బి.టి.నాయుడు
బోయ/వాల్మీకుల రిజర్వేషన్ల పట్ల గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వస్తే.. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులివ్వడం ముమ్మాటికీ కాలయాపన చేయడమే. బోయ/వాల్మీకులను దగా చేయడమే. బెంతొరియా, వాల్మీకి/బోయలపై అధ్యయనానికి శామ్యూల్ ఆనందకుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం ముమ్మాటికీ వారిని వంచించడమే. గత ప్రభుత్వ హయాంలోనే ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ నివేదిక మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ తీర్మానం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించాల్సింది పోయి కమిటీల ఏర్పాటు మోసం చేయడం కాదా?
అడ్డగోలుగా భూములు దోచుకోవడానికి, కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఎలాంటి విచారణ కమిటీలు ఏర్పాటు చేయకుండా కట్టబెడతారు. కానీ.. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బోయ వాల్మీకులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కమిటీల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గం.
బోయ, వాల్మీకులను సామాజికంగా, ఆర్ధికంగా ప్రోత్సహించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. బోయల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తంగా రూ.164 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. బోయల్ని ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది. తాజాగా 15 జాతుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అందులో వాల్మీకి/బోయలను ఎస్టీల్లో చేర్చే అంశంపై జగన్ రెడ్డి కనీసం నోరెత్తకపోవడం దగా చేయడం కాదా?
కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన సమయంలో కమిషన్ ఏర్పాటు ద్వారా కాలయాపన చేయడం బోయల భవిష్యత్తుకు మరణ శాసనం రాయడమే. జగన్ రెడ్డి తక్షణమే కమిషన్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకోవాలి. కేంద్రంపై ఒత్తిడి చేసి ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింపజేయాలి. లేకుంటే.. రాష్ట్రంలోని బోయలంతా ఏకమై జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరణశాసనం లిఖించడం ఖాయం.