– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అధికారం వైకాపాకు అనుకూలమన్నా అపప్రదను తొలగించుకోవాలని బిజెపి నాయకులు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వార్తా కథనాలను చూశామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పులను చేసిందని, ఆ తప్పులన్నింటినీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించాలని బిజెపి నేతలు నిర్ణయించినట్లుగా తెలిసిందన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
బిజెపి నాయకుడు సత్య కుమార్ చెప్పినట్లుగా పొత్తు కోసం వారు అడగాలి…వీరు అడగాలని కోరుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇల్లరికం చిత్రంలో పాట మాదిరిగా చేతులు కలిసిన చప్పట్లు… మనసులు కలిసిన ముచ్చట్లు అన్నట్లుగా మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నదే తన ఆకాంక్షని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కొందరి అభ్యంతరాల మధ్య నేను ఈ నిర్ణయాన్ని తెలియజేస్తున్నాను.
అభ్యంతరాలు పెట్టే వాళ్ళు కూడా ఈ రఘురామ కృష్ణంరాజు ఇంతగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రస్తుతానికి కూసింత అపార్థం చేసుకున్న, రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారని విశ్వాసంతో ఈ మాట చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాముల వారి విగ్రహ స్థాపన అనంతరం ఒకటి రెండు రోజులలోనే గుడ్ న్యూస్ వింటామని చెప్పారు. ఇప్పటివరకు నేను మనస్ఫూర్తిగా విశ్వసించినది ఏది ఫెయిల్ కాలేదు. ఇది కూడా ఫెయిల్ కాదని ఆయన పేర్కొన్నారు.
ఓ పి ఎస్ అమలుకు బిజెపి పాలిత ప్రభుత్వం నిర్ణయం
సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ అమలు చేయాలని మహారాష్ట్రలోని బిజెపి, శివసేన న్యూ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి, ఓ పి ఎస్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు, ఓ పి ఎస్ అమలుపై జగన్మోహన్ రెడ్డి తెలియక మాట్లాడారని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారన్నారు .
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, చత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్లలో గతంలోనే సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేశారు. ఇప్పుడు తాజాగా 2005 కు ముందున్న ఓ పి ఎస్ ను అమలు చేయాలని మహారాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. బిజెపి కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని నిర్ణయించడం ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో తెదేపా, జనసేన కూటమితో బిజెపి కలిసి ముందుకు వెళ్లనుండడంతో రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూటమికి మద్దతు ఇచ్చే దిశగా సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. బిజెపి, శివసేన కూటమి తీసుకున్న ఈ నిర్ణయం చక్కటి స్ఫూర్తినిస్తుందన్నారు.
భూ హక్కు చట్టం అమలుకు నిరాకరించిన ఎన్నో రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం సూచించిన భూహక్కు చట్టం అమలుకు ఎన్నో రాష్ట్రాలు అభ్యంతరాన్ని తెలియజేశాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం అమలేమి నిర్బంధం కాదు. భూ హక్కు చట్టం అమలు ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుకు నిరాకరించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, భూ హక్కు చట్టం అమలుకు ఒప్పుకోలేదు. కేవలం వ్యవసాయ భూములలో నెలకొన్న తగాదాలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. పెట్టుబడుల కోసం వరల్డ్ బ్యాంకు సూచించిన భూ హక్కు చట్టం, గృహాలు, ఇండ్ల స్థలాల కోసం ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటే, అతని ఇంటిని ఎవరైనా తహసిల్దారుని మంచిగా చేసుకుని పాసుబుక్ పొందగలిగితే, ఈ విషయంపై ఇంటి యజమాని ఒకవేళ రెండేళ్ల వ్యవధిలో ఫిర్యాదు చేయకపోతే, డాక్యుమెంట్ ఉన్నప్పటికీ, ఇల్లు అతనిది కాకుండా పోతుందన్నారు.
రాబోయే ప్రభుత్వం ఇటువంటి తప్పులను సరిదిద్దుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. అమరావతిలోని ఆర్ 5 జోన్లో ఇండ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయవద్దని నేను రాసిన లేఖ పై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. న్యాయస్థానంలో కే సు తేలే వరకు రుణాలు మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఈ కేసును త్వరగా విచారించాలని కోరగా, అమరావతి కేసుతో పాటే ఈ కేసును వింటామని చెప్పిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
మనిషి జీవితకాలం కంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ
మనిషి జీవిత కాలం కంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. నాలుగు మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండే అవకాశాన్ని, బ్రతికుండగానే మర్చి పోయే విధంగా చేసుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి. మనసులో కక్షలు పెట్టుకొని దొంగ కేసులు నమోదు చేయించి, హింసించి వేధించడం మానుకోవాలి. ఎక్కడ చూసినా తన ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని, పక్కవారి ఫ్లెక్సీలను తొలగించాలని చూడడం సరికాదు.
ఇతరుల ఫ్లెక్సీలను పీకమని చెప్పినప్పటికీ పోలీసులు పీకడం లేదని బాధపడే కంటే, పోలీసులకు ఇతరుల ఫ్లెక్సీలు పీకమని చెప్పకపోవడం మంచిదని జగన్మోహన్ రెడ్డికి రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. పండుగ రోజుల్లో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల, ఎంపీల, ముఖ్యమంత్రి ఫోటోలనే ఫ్లెక్సీలలో ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి, మీ ఫ్లెక్సీలను మీరే వేసుకోండి. ఇతరుల ఫ్లెక్సీలను పీకవద్దని ఇప్పటికే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, జగన్మోహన్ రెడ్డికి చెప్పే ఉంటారు. కెసిఆర్ ఇచ్చిన సూచనను జగన్మోహన్ రెడ్డి తప్పక పాటిస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి, వైకాపా ఓటు బ్యాంకుకు గండి కొట్టనుందని స్పష్టమవుతుంది . దీనితో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని గుర్తెరిగి నడుచుకుంటే మంచిది. తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అని బైబిల్ సూక్తిని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా అనుసరించాలన్నారు.
ప్రజలు ఓటు వేసే వరకు ఏ విషయాన్ని చెప్పటం లేదు
ప్రజలు బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసే వరకు ఏ విషయాన్ని చెప్పటం లేదని… ఈ విషయాన్ని ముందే తెలుసుకొమ్మని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డికి చెప్పినట్లు తెలిసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుస్తామని ఆశించిన కెసిఆర్ ను, కేవలం ప్రజలను కలవకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నారన్న కారణంగానే ప్రజలు ఓడించారు. తెలంగాణ సాధించడమే కాకుండా, ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిన, అహంకారంతో మసులుకున్నారనే కారణంగానే ఆయన్ని ఓడించారు. తాజా మాజీ సీఎం, కాబోయే మాజీ సీఎంకు ఏం చెప్పారోనని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు కనిపించాయి.
కెసిఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మూడు వారాలు గడిచిన తర్వాత ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు చేరుకొని ఆయన్ని పరామర్శించారు. తల్లిని కలవడానికి హైదరాబాదుకు వచ్చారా?, హైదరాబాదుకు వచ్చినందుకు తల్లిని కలిసారా అన్నది ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికే, జగన్మోహన్ రెడ్డిలో మాత్రం అలజడి మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డి తో షర్మిల కలిసి ఏం మాట్లాడారన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆరు నిమిషాల వ్యవధిలో వారిద్దరి మధ్యలో పెద్దగా సంభాషణ జరిగినట్టు లేదు. షర్మిల తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరగా… తప్పక వస్తానని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య పెద్దగా రాజకీయ సంభాషణలు జరిగినట్టు లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రోత్సహించడం దారుణం
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడాన్ని ప్రోత్సహించడం దారుణమని, ఈ విధానాన్ని సభ్య సమాజమే కాదు… అసభ్య సమాజం కూడా సమర్ధించదని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలంటూ రఘు రామ కృష్ణంరాజు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను అసభ్య, పరుష పదజాలంతో తిట్టించి ఆనందించడం జగన్మోహన్ రెడ్డికి చెల్లిందన్నారు. అసభ్య, పరుషపదజాలంతో వైకాపా నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇంత అసహ్యంగా బిహేవ్ చేయడం అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చెప్పారని ఒత్తిడిని తట్టుకోలేక మాట్లాడిన వారికి సర్వేలలో మార్కులు రావడంలేదని, తీసేస్తున్నారు. ఇంకా ఈ పద్ధతికి స్వస్తి చెప్పకుండా మహీధర్ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, ఇతరులను నొప్పించని మాగుంట శ్రీనివాసరెడ్డిని తిట్టడం దారుణం. అమరావతి సమీప ప్రాంతంలోని ఒక ఎంపీని తిట్టమంటే, తిడితేనే ఎంపీ సీటు ఉంటుందని చెప్పగా ఆయన అక్కర్లేదని చెప్పారట. గత నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను పార్టీలో చేరేటప్పుడు చంద్రబాబు నాయుడుని గట్టిగా తిట్టాలన్న అని జగన్మోహన్ రెడ్డి నాతో చెప్పారు. ఇతరులను తిట్టడం అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి నరనరాన జీర్ణించుకుపోయింది. ఇప్పుడు అది బహిర్గతం అయింది. ఈ విషయాన్ని నేను ఎప్పటినుంచో చెబుతూ వచ్చాను.
తిట్టేది ఎవరైనా తిట్టించేవారు జగన్మోహన్ రెడ్డి అని , స్క్రిప్ట్ జి వీడి దని పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి చక్కటి ప్రసంగాలను రాసిచ్చే జివిడి, అవసరమైన తిట్లను కూడా రాసి ఇస్తున్నారు. గతిలేకనో, మతిలేకనో కొంతమంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఇతరులను తిడుతున్నారు. వాళ్ల చీటీ చింపడానికో, నిజంగానే తిడితే సీటు ఇస్తారా అన్నది తెలియకపోయినా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంతలా దిగజారి రాజకీయం చేయడం దారుణమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజకీయాల్లో విష సంస్కృతిని ఇంకా విస్తృతంగా వ్యాప్తి చేయవద్దని జగన్మోహన్ రెడ్డిని ఆయన కోరారు. ఇప్పటికే ఉన్న దరిద్రం సరిపోతుందన్నారు. సజ్జలతో ఒక్క స్టేట్మెంట్ ఇప్పించి ఈ దరిద్రానికి స్వస్తి చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు.