Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతల స్వీకరణ

టీటీడీ కార్యనిర్వహణాధికారిగా జే. శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు.
నూత‌న ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో జెఈఓ గౌతమి, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఇ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం రావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం
శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం రావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని, నూతన ఈవో జే.శ్యామలరావు అన్నారు. ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తాను పనినే దైవంగా విశ్వసిస్తానన్నారు. ప్రపంచం నలుమూలల నుండి హిందువులు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం దర్శనార్థం వస్తుంటారని, వారికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

టీటీడీలో మంచి పరిపాలన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం తిరుమల, ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు జవాబు దారి తనంతో పాటు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, స్వామి వారి దర్శనార్ధం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి పై సీఎంకు ఒక విజన్ ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు.

కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE