Suryaa.co.in

Editorial

జగమొండి.. జగనన్న!

– బాబు అరెస్టుతో నెరవేరిన జగన్ కల
– పంతం నెరవేర్చుకున్న సీఎం జగన్
– తాను జైలుకు వెళ్లేందుకు చంద్రబాబే కారణమన్న ఆగ్రహం
– నాడు తనపై ఇంప్లీడ్ పిటిషన్ వేసిన అశోక్‌గజపతి రాజు, ఎర్రన్నాయుడు
– సీఎం అయిన తర్వాత ప్రత్యర్ధులపై ప్రత్యేక దృష్టి
– సింహాచలం ఆలయంపై అశోక్ పెత్తనానికి కతె్తర
– అశోక్ కుటుంబంలో చీలిక తేవడంలో సక్సెస్
– కోర్టుకు వెళ్లి హక్కులు సాధించుకున్న అశోక్‌గజపతి
– అవినీతి కేసులో అచ్చెన్నాయుడును అరెస్టు చేసి జైల్లో వేయించిన జగన్
– తన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకపాత్ర పోషించారని ఏబీ, సతీష్‌చంద్రపై ఆగ్రహం
– సీఎం అయిన తర్వాత ఏబీకి ఇప్పటిదాకా పోస్టింగ్ లేని ప్రతీకారం
– శరణువేడిన సతీష్‌చంద్రకు మాత్రం నార్త్ లాబీతో పోస్టింగ్
– తనపై తిరుగుబాటు చేసిన ఎంపి రాజుకు సీఐడీ షాక్ ట్రీట్‌మెంట్
– ఎంపీ రాజుపై లెక్కలేనన్ని కేసులు
– ఇప్పటిదాకా నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితిలో ఎంపీ రాజు
– స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం పేరుతో చంద్రబాబు ఆకస్మిక అరెస్ట్
-చంద్రబాబు వివాహ వార్షికోత్సవం రోజునే అరెస్ట్
– దానితో తీరిన జగన్ రాజకీయ లక్ష్యం
– జగన్ తర్వాత లక్ష్యం ఇక లోకేషేనా?
– స్కిల్ కేసులో అచ్చెన్నాయుడిపైనా ఉచ్చు?
– పట్టుదలలో జగమొండి జగన్
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎట్టకేలకూ ఏపీ సీఎం జగన్ అనుకున్నదే జరిగింది. టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడును ఎలాగైనా అరెస్టు చేయించాలన్న ఆయన పదేళ్ల కల ఆలస్యంగా నెరవేరింది. అది కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. సరిగ్గా చంద్రబాబు నాయుడు వివాహ వార్షికోత్సవం రోజునే ఆయనను అరెస్ట్ చేసి, జైలుకు పంపించటంతో జగన్ పట్టుదల నెరవేరినట్టయింది.

తాను జైలు పాలయ్యేందుకు కారకుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోపాటు , టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకరన్న ఆగ్రహంతో.. కొన్నేళ్ల నుంచి పగతో రగిలిపోతున్న జగన్.. పాత సర్కారులోని అక్రమాలను తవ్వితోడే పని ప్రారంభించారు. అది స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రూపంలో, జగన్‌కు కలసివచ్చింది. తనకు అత్యంత విశ్వాసపాత్రులు-వీర విధేయులైన పోలీసు అధికారులకు, విచారణ బాధ్యతలు అప్పగించిన జగన్.. ఎన్నికలకు మరికొద్దినెలల ముందే , ఫలితం రాబట్టంలో విజయం సాధించారు.

అమరావతి భూముల కొనుగోలు సహా, వివిధ రకాల అంశాలపై దృష్టి సారించిన జగన్ సర్కారుకు, అందులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైగా కోర్టుల్లో ఎదురుదెబ్బలే తగిలాయి. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా..బాబు అండ్ కోను అరెస్టు చేయించేందుకు జగన్, తన ముందున్న అన్ని మార్గాలూ అన్వేషించారు. అనేకరకాల శూలశోధనలు, పరిశోధనల తర్వాత చివరాఖరకు స్కిల్ డెలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందన్నది తేల్చారు. ఆ ప్రకారంగా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావుపై కేసు నమోదు చేశారు.

తనను 16 నెలల పాటు జైల్లో ఉంచారన్న విషయాన్ని తరచూ గుర్తు చేసుకునే జగన్.. అందుకు కారకులైన చంద్రబాబునాయుడు, అశోక్‌గజపతిరాజు, దివంగత ఎర్రన్నాయుడు కుటుంబంపై.. సీఎం అయిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ అక్రమార్కుల కేసులో, నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు పిటిషన్ వేశారు.

ఆ సందర్భంలో అశోక్‌గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో కేసు బలంగా బిగుసుకుపోయింది. ఆ తర్వాత సీబీఐ వేసిన అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయి, 16 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిల్‌పైనే ఉండటం ప్రస్తావనార్హం.

జగన్ సీఎం అయిన తర్వాత..కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతి రాజు అధీనంలోని, సింహాచలం దేవస్థానంపై దృష్టి సారించారు.

ఆయనను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ దేవాలయంపై ఆ కుటుంబ పెత్తనం లేకుండా చూశారు. పూసపాటి కుటుంబంలోనే ఒక మహిళను తెరపైకి తెచ్చి, ఆమెకు అధికారాలు అప్పగించారు. అయితే కోర్టు ద్వారా అశోక్ గజపతి తన హక్కు సాధించుకున్నారు. ఇప్పటికీ ఆయన జగన్ సర్కారుతో పోరాడుతూనే ఉన్నారు.

ఎర్రన్నాయుడు చనిపోయినప్పటికీ, ఆయన కుటుంబాన్ని మాత్రం జగన్ విడిచిపెట్టలేదు. బాబు హయాంలో కార్మిక మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు సోదరుడైన అచ్చెన్నాయుడును, కార్మికశాఖలో అక్రమాల కేసుకు సంబంధించి అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. ఆయన సోదరిపై కూడా చిట్స్‌కు సంబంధించిన కేసులు పెట్టారు.

తాను విపక్ష నేతగా ఉండగా, తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ చేర్పించడంలో కీలకపాత్ర పోషించారన్న ఆగ్రహం నాటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావు, నాటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రపై ఉండేది. ఆ మేరకు గత ఎన్నికల ముందు వారిద్దరిపై జగన్, విజయసాయిరెడ్డి బహిరంగ ఆరోపణలే చేశారు. అటు ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఈసీ ఏబీని ఆ స్థానం నుంచి మార్చివేసి, మరొకరని నియమించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ వైపు మళ్లించిన ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కలు చూపించారు. ఆయనపై కొనుగోలు కేసు పెట్టి, అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా తన ప్రతాపం చూపారు. అయితే ఏబీ కోర్టును ఆశ్రయించి పోస్టింగ్ పొందినా, మళ్లీ సస్పెండ్ చేశారు. ఆయనకు ఇప్పటికీ సగం వేతనం ఇవ్వకుండా, తన మార్కు రాజకీయం రుచిచూపిస్తున్నారు. అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ వైపు మళ్లించేందుకు కృషి చేసిన మరో ఐఏఎస్ సతీష్‌చంద్ర మాత్రం.. జగన్‌తో రాజీ పడటంతో, ఆయనకు చాలాకాలం తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. అందుకు ఉత్తరాది ఐఏఎస్ లాబీ కూడా సహకరించింది. అది వేరే విషయం. అంతే తనను శరణువేడిన వారి విషయంలో ఏ స్థాయిలో కనికరం చూపిస్తారో.. తనను వ్యతిరేకించిన వారిపై చివరి వరకూ పోరాడి, తన పంతం ఎలా నెగ్గించుకుంటారన్నది ఈ ఇద్దరి విషయంలో స్పష్టమవుతోంది.

తనపై తిరుగుబాటు చేసిన తన సొంత పార్టీ నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజుకు, ఆయన ఇప్పటికీ చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి అడిగినందుకే, తొలిరోజుల్లోనే ఆయనను సీఎంఓలోకి అనుమతించలేదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత తనపై తిరుగుబాటు చేసిన ఎంపీ రాజుకు తమిళనాడు ప్రభుత్వం నుంచి, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి రావలసిన బకాయిలను, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చెప్పి ఆపించారని ఎంపీ రాజు ఇప్పటికీ ఆరోపిస్తుంటారు.

తనపై శరపరంపరంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఎంపీ రాజుకు.. సీఐడీ షాక్ ట్రీట్‌మెంట్ ఇప్పించడం ద్వారా, తానేమిటో ఆయనకు చెప్పారు. తనను సీఐడీ పోలీసులు విచారణలో కాళ్లపై దారుణంగా కొట్టారంటూ ఆయన, స్వయంగా జడ్జికే ఫిర్యాదు చేసిన వైనం. తనను కొట్టిన అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ దిక్కూ దివాణం లేదు.

ఇప్పటికీ ఎంపీ రాజు తన నర్సాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి. చివరకు తన నియోజకవర్గంలో ప్రధాని కార్యక్రమం జరిగినా, దానిలో పాల్గొనలేని దుస్థితి రాజుది. దానికి కారణం.. రాజుపై తామరతంపరగా కేసులు నమోదు కావడమే. చివరకు హైదరాబాద్ వచ్చినా, ఆయన నివాసం వద్ద పోలీసుల నిఘా తప్పడం లేదు.

ఇక మిగిలిన చంద్రబాబునాయుడుపై ఆలస్యంగా అయినప్పటికీ, ప్రతీకారం తీర్చుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాల కేసు ఎఫ్‌ఐఆర్‌లో.. తొలుత పేరు లేని చంద్రబాబును, నంద్యాలలో ఉండగా అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో బలమైన వాదనలు వినిపించడంతో, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు.

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేసులు, న్యాయవ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండే చంద్రబాబునాయుడుకు.. తన రాజకీయ ప్రత్యర్ధి జగన్ వల్ల జైలుకు వెళ్లక తప్పలేదు.

గత కొంతకాలం నుంచీ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బాబు తనయుడు, టీడీపీ యువనేత లోకేష్‌కూ, స్కిల్‌డెవలప్‌మెంట్ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందని సీఐడీ చీఫ్‌తో చెప్పించారు. అంటే ఆ ప్రకారంగా జగన్ తర్వాతి లక్ష్యం, లోకేష్ అని స్పష్టమవుతోంది. బాబు అరెస్టు సమయంలో జగన్ లండన్ పర్యటనలో ఉండటం గమనార్హం.

అయితే..చంద్రబాబును అరెస్టు చేయించాలన్న తన లక్ష్యం నెరవేరినందున.. జగన్ ఇకపై పరిపాలనపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తారా? లేక టీడీపీ ఉత్తరాధికారి లోకేష్‌నూ అరెస్టు చేసేంతవరకూ, తన పంతాన్ని కొనసాగిస్తారా చూడాలి. తాజాగా చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ కేసులోనే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపైనా మరోసారి ఉచ్చు బిగుసుగునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE