Suryaa.co.in

Editorial

జగన్‌-బాబు… కేసుల కొట్లాట!

– బాబు-జగన్‌ కేసులపై టీడీపీ-వైసీపీ సోషల్‌మీడియా వార్‌
– గ్రాఫిక్స్‌తో రెండు పార్టీల యుద్ధం
– జగన్‌పై కేసులు వివరిస్తూ టీడీపీ గ్రాఫిక్స్‌
– తప్పు చేయకపోతే పిటిషన్లు ఎందుకని బాబుపై వైసీపీ దాడి
– బాబు పిటిషన్లపై విజయసాయి ఎద్దేవా
– పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారంటూ జగన్‌పై టీడీపీ గ్రాఫిక్స్‌ దాడి
– జగన్‌ సచ్చీలుడైతే అన్ని పిటిషన్లు ఎందుకని నిలదీత
– ఆ వివరాలు బయటపెట్టిన టీడీపీ సోషల్‌మీడియా సైన్యం
– కోడికత్తి కేసులో ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్న
– సీబీఐ కోర్టుకు మినహాయింపు ఎందుకు తెచ్చుకున్నారని ఫైర్‌
– జగన్‌పై ఎత్తేసిన కేసులను మళ్లీ తెరపైకి తెచ్చిన టీడీపీ
– కోవిడ్‌లో గప్‌చుప్‌గా ఎందుకు క్లోజ్‌ చేశారన్న ప్రశ్నల వర్షం
– సోషల్‌మీడియాలో మార్మోగుతున్న టీడీపీ-వైసీపీ సోషల్‌మీడియా వార్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇది కేసుల కాలం. ఇంకా చెప్పాలంటే పిటిషన్ల కాలం. ఇంకా గట్టిగా చెప్పాలంటే బెయిళ్ల కాలం. అందుకే సోషల్‌మీడియా నిండా అవే వార్తలు, అవే వ్యంగ్యాస్ర్తాలు. దాడి-ఎదురుదాడులు. మాటలమంటలు!

ఏపీలో సోషల్‌మీడియా వేదికగా.. టీడీపీ-వైసీపీ మధ్య జరుగుతున్న కేసుల కొట్లాట ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్‌-మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఉన్న కేసులు ప్రస్తావిస్తూ, వైసీపీ-టీడీపీ సోషల్‌మీడియాలో సంధిస్తున్న విమర్శలు- వ్యంగ్యాస్తాలు- ప్రశ్నాస్ర్తాలు వేడి పుట్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరువురికి చెందిన పాత కేసులు, ఇప్పటిదాకా నమోదైన కేసులు, వేసిన పిటిషన్ల లెక్కలు తేల్చడం ద్వారా.. ఎవరు నిందితులన్న ప్రశ్నను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం గమనార్హం. అందులో భాగంగా, జగన్‌ కేసులకు సంబంధించిన పాత పేపర్‌ క్లిప్పింగులు కూడా తెరపైకి తెస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘వ్యవస్థల మేనేజర్‌’ఎవరో.. అర్ధమైందా రాజా?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వేసిన.. బెయిల్‌-క్వాష్‌ పిటిషన్లను వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నిజంగా బాబు నిజాయితీపరుడైతే వాటిని కోర్టులో ఎదుర్కోకుండా, పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? వరస పిటిషన్లతో న్యాయమూర్తులను ఎందుకు విసిగిస్తున్నారంటూ, వైసీపీ సోషల్‌మీడియా సైన్యం విరుచుకుపడుతోంది. ఆ మేరకు చంద్రబాబు ఫొటోలతో గ్రాఫిక్స్‌ రూపొందించింది.

మరోవైపు వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా, బాబు వేసిన పిటిషన్లపై వరస వెంట వరస ట్వీట్లు సంధిస్తున్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో దానిని నిరూపించుకోవాలేతప్ప, పిటిషన్లు వేయడం ఎందుకని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమేనని స్పష్టం చేశారు. మంత్రి అంబటి రాంబాబు సహా, వైసీపీ ప్రముఖులంతా దాదాపు అవే ప్రశ్నలు వేశారు. తాజాగా వైసీపీ అధికార ఖాతాలో కూడా అదే ప్రశ్న సంధించారు.

వైసీపీ నేతల దాడిపై, ఎదురుదాడికి దిగిన టీడీపీ సోషల్‌మీడియా.. జగన్‌ కేసులను గ్రాపిక్స్‌లో ఉంచి, జనంలోకి వదలడం ఆసక్తికరంగా మారింది. విజయసాయి చెప్పినట్లు, చట్టం ముందు అంతా సమానమైతే.. జగన్‌-నువ్వు అరెస్టయినప్పుడు మరి సోనియాగాంధీ-చంద్రబాబునాయుడు-కిరణ్‌కుమార్‌రెడ్డి మీద ఎందుకు నిందలు వేశారు? అప్పుడు చట్టం అందరికీ సమానమేనని ఎందుకు చెప్పలేదు’ అని లాపాయింట్లు తెరపైకి తెచ్చారు.

‘‘జగన్‌పై ఉన్న కేసులు 38. వేసిన డిశ్చార్జి పిటిషన్లు 54. జగన్‌ వేసిన స్టే పిటిషన్లు 158. జగన్‌పై ఉన్న సెక్షన్లు 35. అందులో 11 సీబీఐ, 7 ఈడీ కేసులు. ఇన్ని కేసులున్న జగన్‌ కూడా కేసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, ఎదురుదాడికి దిగారు.

సీబీఐ కేసులో ప్రతి శుక్రవారం హాజరుకాకుండా, కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకాని జగన్‌ కూడా కేసుల గురించి నీతులు చెప్పడం, దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ముందు జగన్‌ను ఆ రెండు కోర్టులకు హాజరై అప్పుడు ఇతరులకు నీతులు చెప్పండి’అంటూ టీడీపీ సోషల్‌మీడియా సైన్యం వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ఇది కూడా చదవండి: 3,30,500 కోట్ల ప్రజాసంపదను దిగమింగిన ధన పిశాచి జగన్‌రెడ్డి

సీబీఐ అధికారులు ఎంపి అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళితే, కర్నూలు కలుగులో దాక్కున్న మీకు.. నంద్యాల రోడ్డు నుంచి హుందాగా విజయవాడ కోర్టుకు వచ్చిన చంద్రబాబుకు పొలికేంటి’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇక గతంలో జగన్‌పై నమోదైన 11 కేసులను.. కరోనా సమయంలో చడీచప్పుడు లేకుండా ఎందుకు తొలగించారంటూ, టీడీపీ ఎదురుదాడికి దిగింది. వాటిని హైకోర్టు సుమోటోగా తీసుకున్న వైనాన్ని గుర్తుచేసింది. పులివెందుల, నరసరావుపేట, చిలకలూరిపేట, నందిగామలో నమోదైన కేసులు.. హైకోర్టు సుమోటో విచారణ పరిథిలో లేనివీ ఉండటాన్ని, టీడీపీ ప్రస్తావించింది. వాటికి సంబంధించిన, అప్పటి పేపర్‌ క్లిప్పింగులను వెలుగులోకి తీసుకువచ్చింది.

తాజాగా టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత డాక్టర్‌ నిమ్మల రామానాయుడు.. ఏకంగా జగన్‌పై ఉన్న కేసులను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా, మ్యాక్‌ అసెంబ్లీ పెట్టిమరీ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అందులో సీబీఐ, ఈడీ కేసుల వివరాలు వెల్లడించారు. ఆర్ధిక నేర స్తుడైన జగన్‌, తన ప్రత్యర్థులందరినీ ఆ కళ్లతోనే చూస్తుంటారని విరుచుకుపడ్డారు. తాను దొంగ కాబట్టి, అందరినీ దొంగ అనుకుంటారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

అయితే ఈ సందర్భంగా టీడీపీ.. సీఐడీ విచారణ ప్రక్రియపై చే స్తున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. జగన్‌ను సీబీఐ 5 సార్లు విచారణకు పిలిచిన తర్వాతనే అరెస్టు చేసింది. అంతకుముందు రాజగోపాల్‌, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మిని అరెస్టు చేసింది. క్విడ్‌ ప్రోకో కింద జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లు బయటపెట్టింది. వారిని విచారించింది. ఏయే అకౌంట్ల ద్వారా జగన్‌ కంపెనీల్లో రూటింగ్‌ అయ్యాయన్న వివరాలను, సీబీఐ-ఈడీ కోర్టుకు సమర్పించాయి. ఆ తర్వాతనే ఆయా కంపెనీల ఖాతాలను సీజ్‌ చేశాయి.

అయితే స్కిల్‌ కేసులో చంద్రబాబును ముద్దాయిగా అరెస్టు చేసిన సీఐడీ..చంద్రబాబుకు ముట్టిందని ఆరోపిస్తున్న సొమ్ము, ఆయన అకౌంట్లకు వెళ్లాయన్న వియాన్ని, ఇప్పటిదాకా నిరూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోనీ ఏయే కంపెనీలకు మళ్లించారన్న వివరాలు కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు.

నిధులు మళ్లించారని ఆరోపిస్తున్న సీఐడీ.. వాటిని చంద్రబాబు గానీ, ఆయన కంపెనీలకు గానీ ఎప్పుడు? ఎక్కడ? ఎంత మళ్లించారన్న వివరాలు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచకపోవడంపై, విస్మయం వ్యక్తమవుతోంది. టీడీతీపీ సోషల్‌మీడియా కూడా ఇదే ప్రశ్నను వైసీపీపై సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దొరికినదొంగ జగన్‌కు- తెల్లకాగితం లాంటి చంద్రబాబుకు పోలిక ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

LEAVE A RESPONSE