Suryaa.co.in

Editorial

‘వ్యవస్థల మేనేజర్’ ఎవరో.. అర్ధమైందా రాజా?

– 15 రోజుల నుంచి జైల్లోనే చంద్రబాబు
– ఏసీబీ కోర్టు, హైకోర్టులో అన్ని పిటిషన్లు కొట్టివేత
– సుప్రీంకోర్టుకెళ్లిన బాబు లాయర్లు
– సీబీఐ కోర్టు విచారణలో జగన్‌కు హాజరీ మినహాయింపు
– ఎన్‌ఐఏ కేసు విచారణకూ హాజరుకాని వైనం
– ఇప్పటిదాకా సుప్రీంలో బెంచిమీదకు రాని ఏబీ కేసు
– వ్యవస్థల మేనేజ్‌మెంట్’ విమర్శలపై రాజకీయ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొనగాడని వైఎస్ నుంచి.. ఆయన తనయుడు జగన్ వరకూ చేసే ప్రధాన ఆరోపణ. వ్యవస్థలు మేనేజ్ చేసినందుకే ఆయనకు చాలా కేసుల్లో స్టే వచ్చాయన్నది, తరచూ వారి నోటి నుంచి వినిపించిన విమర్శలు. ‘నువ్వు నిజాయితీపరుడివైతే స్టేలు తెచ్చుకోవడం ఎందుక’న్నది, గతంలో ఓసారి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్న. తానైతే ఎలాంటి స్టేలు తెచ్చుకోనన్నది సత్తిబాబు గత శపథం. చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. నిజాలకు ఎవరూ తెరకట్టలేరు. ఎందుకంటే అది వర్తమానం-భవష్యత్తుకు సజీవ సాక్ష్యం కాబట్టి!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అరెస్టయి, ఇప్పటికి 15 రోజులయింది. ఈ పక్షం రోజుల్లో కూడా వైసీపేయులు, ఆయనపై ఇంకా ‘వ్యవస్థల మేనేజర్’గా ముద్ర వేయడమే ఆశ్చర్యం. అది కూడా చంద్రబాబు వేసిన క్వాష్ – బెయిల్-హౌస్ అరెస్టు పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్లను.. కింది కోర్టు నుంచి హైకోర్టు వరకూ కొట్టివేసిన తర్వాత కూడా! అందుకే మరి ఆశ్చర్యం!?

ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందంటూ చేస్తున్న ప్రకటనలు.. చూచువారలకు చూడముచ్చట. బాబు పిటిషన్ కొట్టేసిన జడ్జిలపై తెదేపాయులు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, కన్నీరు కార్చడం వింతలో వింత. జస్టిస్ రమణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించవద్దంటూ, స్వయంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసిన వారే.. హైకోర్టు జడ్జిలకు వ్యతిరేకంగా ట్రోలింగులు చేసిన వారే.. ఇప్పుడు న్యాయమూర్తులపై అదే సోషల్‌మీడియాలో వస్తున్న విమర్శలపై బాధపడిపోవడం.. కామెడీలో కామెడీన్నర వ్యవహారం.

అసలు చంద్రబాబునాయుడు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలకు తెరలేపిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. కొన్ని సందర్భాల్లో బాబుపై వేసిన పిటిషన్‌ను వైఎస్ ఉపసంహరించుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అది వేరే ముచ్చట. వ్యవస్థలను మేనేజ్ చేయడమంటే సామాన్యులకు అర్ధం కాకపోయినా.. చదువుకున్న వాళ్లు, బుర్ర-బుద్ధి ఉన్నవాళ్లకు అర్ధమయ్యేదేమిటంటే.. న్యాయవ్యవస్థను మేనేజ్ చేయడమన్నమాట. ఆ ముక్క ఇప్పటిదాకా ఎవరూ నేరుగా చెప్పకుండా, చంద్రబాబుపై వ్యవస్థల మేనేజర్‌గా ముద్ర వేస్తూ వస్తున్నారు. అదీ వ్యవస్థల మేనేజర్ పదానికి అర్ధం అదన్నమాట. తప్పు లేదు. ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి విమర్శలు వారివి. ఎవరి మైండ్ గేమ్ వారిది.

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణను గుప్పెట్లో పెట్టుకుని, చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థను మేనేజ్‌చేశారన్నది, అప్పుడు కాంగ్రెస్-ఇప్పుడు వైసీపీ నేతలు చేసే విమర్శలు. గత మూడేళ్ల కాలంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల వెనుక, ఆ బాంధవ్యమే ఉందన్నది వైసీపీ సోషల్‌మీడియా సైన్యం చేసిన ట్రోలింగ్ తాత్పర్యం, ప్రతిపదార్ధం!

అదేదో నేరుగా చేస్తే బాగానే ఉంటుంది. అదీ లేదు. ఎందుకంటే.. నేరుగా ట్రోలింగ్ చేస్తే శిక్షలు పడతాయన్న భయం. అందుకే వాటిని కూడా విదేశాల నుంచి విడుదల చేసేవారు. పంచ్ ప్రభాకర్ అనే సుశిక్షితుడైన వైసీపీ సైనికుడు.. ఆవిధంగా ‘న్యాయవ్యవస్థకు చాలా సేవలు’ చేశారనుకోండి. అది వేరే విషయం!

కానీ తమ సోషల్‌మీడియా సైన్యం ద్వారా ఆ అర్ధం వచ్చేలా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్వీరమణ అనే ఒకప్పటి కృష్ణా జిల్లా లాయర్, టీడీపీకి అప్పట్లో సేవలందించారన్నది రహస్యేమీ కాదు. బహిరంగమే. అందుకే ఆ పార్టీ నాయకత్వం ఆయనకు రాజ్యసభ సీటు బదులు న్యాయవ్యవస్థకు పంపించింది.

ఆ రకంగా టీడీపీ నాయకత్వం రమణకు బదులుగా, కంభంపాటి రామ్మోహన్‌రావును రాజ్యసభకు పంపింది. ఈ మాట ఎవరో చెప్పింది కాదు. అప్పట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చెప్పిన ముచ్చట. ఎలాగూ రమణకు హైకోర్టు జడ్జి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, పార్టీ కోసం కష్టపడుతున్న కంభంపాటికి, ఎంపి అవకాశం ఇవ్వాలని తామే ప్రతిపాదించామని తుమ్మల సెలవిచ్చారు.

ఆ వేదికపై పుస్తక రచయిత కంభంపాటితోపాటు.. అప్పటి రాజ్యసభ ఎంపీ అభ్యర్ధి ఎంపిక కసరత్తులో, భాగస్వాములు కూడా అందుకు సాక్షి. ఆ తర్వాత హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ రమణ.. క్రమంగా ఢిల్లీ వరకూ ఎదిగి, చివరాఖరకు ప్రధాన న్యాయమూర్తి హోదాలో, తన ఉద్యోగ జీవితాన్ని ముగించారు. ఇందులో దాచుకోదగ్గ రాజకోట రహస్యాలేమీ లేదు.

ఆ మాటకొస్తే ఒక పార్టీ సాయంతో హైకోర్టులో చేరి, అక్కడి నుంచి సుప్రీంకోర్టు సీజేగా మారిన లాయర్ జస్టిస్ రమణ ఒక్కరే అనుకుంటే, కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. దేశంలో ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, హైకోర్టు సీజేలు, హైకోర్టు న్యాయమూర్తులైన వారిలో 90 శాతం జస్టిస్ రమణ మాదిరిగా.. ఏదో ఒక అధికార పార్టీకి సేవలందించి, ఆ స్థాయికి చేరిన వారే. ఇందులో ఎలాంటి మొహమాటం-దాపరికం లేదు. సంబంధిత రాష్ట్రాల్లో అధికార పార్టీలు సిఫార్సు చేయకపోతే.. వారికి అడ్వకేట్ జనరల్-జడ్జిలయ్యే అవకాశం-అర్హత ఉండదన్నది మనం మనుషులం అన్నంత నిజం. జరుగుతున్న ప్రక్రియ కూడా అదే. అందుకే చాలామంది సీనియర్ లాయర్లు.. ఏ బెంచ్‌కు ఏ జడ్జి వస్తున్నారు? ఆయన గతంలో ఎక్కడి నుంచి వచ్చారని శూలశోధన చేస్తుంటారు.

అందుకే ఆయా అధికారపార్టీలు తమకోసం పనిచేసిన లాయర్ల పేర్లు, అడ్వకేట్ జనరల్ పదవులకు హైకోర్టుకు సిఫార్సు చేస్తుంటాయి. అది అప్పటి లాయర్-ఇప్పటి మాజీ సీజే రమణతోనే మొదలైన సంప్రదాయం కాదు. ఇదంతా బహిరంగ రహస్యమే. కాకపోతే సాధారణ ప్రజలకు మాత్రమే తెలియని నిజాలు. ఒకప్పుడు జడ్జిలు, న్యాయవ్యవస్థ గురించి మాట్లాడాలంటేనే వణికిపోయే పరిస్థితి.

చివరాఖరకు పత్రికలు కూడా కోర్టు వ్యవహారాలపై ఆచితూచి రాసేవి. ఇప్పుడు సోషల్‌మీడియా రాకతో అన్ని వ్యవస్థల పనితీరు, బహిర్గతమయిపోయింది. ఏకంగా చర్చలే పెట్టేస్తున్న వైచిత్రి. ఇప్పుడు జడ్జీలను జడ్జీలే నియమించుకునే కొలీజియం వ్యవస్థను, సాక్షాత్తూ కేంద్ర న్యాయశాఖమంత్రే తప్పు పట్టిన పరిస్థితి.

సీన్ కట్ చేస్తే.. ఏపీలో ఎన్నికలు జరిగి, జగన్ సీఎం కావడం-చంద్రబాబు ఓడిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్లపాటు జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో, 90 శాతం ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ సర్కారుకు ప్రతికూల తీర్పులే ఎదురయ్యాయి.

ఆ సమయంలో వైసీపీ సోషల్‌మీడియా సైన్యం, తమ అభిమాన నేత జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలను ఓ పట్టుపట్టింది. చివరకు ఇతర కులాలకు చెందిన జడ్జిలను సైతం, కమ్మ వారిగా ప్రచారం చేసింది. చివరకు హైకోర్టును టీడీపీ ఆఫీసుగా అభివర్ణించే తెంపరితనం వరకూ వెళ్లింది. వారికి వ్యతిరేకంగా దేశ -విదేశాల నుంచి ‘ట్రోలింగ్ వార్’కు తెరలేపింది.

అందుకు ఆగ్రహించిన హైకోర్టు, వారిపై చర్యలు తీసుకోవాలని ఘనత వహించిన సీఐడీని ఆదేశించింది. కానీ సీఐడీ సార్లు తమ వల్లకాదని చేతులెత్తేయడంతో, ఆ విచారణ పనిని సీబీఐకి అప్పచెప్పింది. ఆ కేసుకు ఇప్పటివరకూ అతీగతీ లేదు. జడ్జిలను తిట్టిపోసిన వీరసైనికులు ఇంకా బయట, విదేశాల్లో లక్షణంగా తిరుగుతూనే ఉన్నారు. ఆ కేసు ఏమైందని ప్రశ్నించే తీరిక అటు హైకోర్టుకు గానీ, విచారణను తేల్చాలన్న తొందర అటు సీబీఐ సార్లకు గానీ ఉన్నట్లు కనిపించడం లేదు. అది వేరే ముచ్చట. ఈ ఎపిసోడ్‌లో వ్యవస్థల మేనేజర్ ఎవరన్నది మిలియన్ డాలర్ల సందేహం!

ఈలోగా కాలం-కథ మారింది. తాను ఏ జస్టిస్ రమణనయితే సీజేగా నియమించవద్దని, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారో.. అదే జగనన్న, విజయవాడ నోవాటెల్‌కు వచ్చిన అదే సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రమణతో, గంటలపాటు సతీసమేతంగా భేటీ వేయడం అప్పట్లో భలే వింతగా భావించారు. ఒకప్పుడు అదే జస్టిస్ రమణ సీజే హోదాలో తిరుమల వస్తే, పట్టించుకోని జగనన్న.. తర్వాత విజయవాడలో ఆయనకున సన్మానం చేసి, గండపెండేరం-గజమాలలతో.. జగ్గయ్యపేట నుంచి బెజవాడ బెంజి సర్కిల్ వరకూ జస్టిస్ రమణ ఫ్లెక్సీలను నింపేయడం చూడముచ్చట.

ఇదంతా వ్యవస్థను మేనేజ్ చేశారని ఏ చంద్రబాబునైతే విమర్శించారో, అదే చంద్రబాబు సిఫార్సుతో.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన జస్టిస్ రమణపై ఫిర్యాదు చేసిన, అనంతర పరిణామాలని విస్మరించకూడదు. అయితే.. అప్పట్లో వారిద్దరి భేటీపై తెలుగుతమ్ముళ్లు కారాలు మిరియాలు నూరారు. తనను బహిరంగంగా వ్యతిరేకించిన జగన్‌తో రమణ అన్నేసి గంటలు ఎలా భేటీ అవుతారని ఉడుక్కున్నారు కూడా! జగనన్న క్షేమం కాంక్షించే ఒక దేవస్థానం జెఈఓ మధ్యవర్తిగా, వారిద్దరి భేటీ జరిగిందన్న ప్రచారమూ జరిగింది. నిజం ‘జగన్నాధుడి‘కెరుక? అది వేరే ముచ్చట అనుకోండి.

ఆ మధ్య కాలంలోనే బాబు జమానాలో నిఘా దళపతిగా చేసిన, సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కేసు సుప్రీంకోర్టులో నడిచింది. జస్టిస్ రమణ పైన ఉన్నారు కాబట్టి, ఏబీవీ కేసు తేలిపోతుందన్న భ్రమలు వినిపించిన రోజులవి. వైసీపేయుల ట్రోలింగ్ కూడా అదే భావనలో నడించింది. మరోసారి ఆయనకు, ఊరట లభిస్తుందన్న భ్రమలు కనిపించాయి. కానీ జస్టిస్ రమణ ఆ హోదాలో రిటైరయినంత వరకూ, ఏబీవీ కేసు తేలలేదు. ఇప్పటికీ నానుతూనే ఉంది. అసలు బెంచ్ మీదకే వచ్చే పరిస్థితి లేదు. మరి వ్యవస్థలు ఎవరు మేనేజ్ చేస్తున్నారన్నది, మెడపై తల ఉన్న వారికి వచ్చే సందేహం. అంటే తన కోసం బలైపోయిన ఏబీవీని.. వైసీపీ ప్రవచిత ‘ వ్యవస్థల మేనేజర్’ చంద్రబాబు , కాపాడలేకపోయారన్న మాటే కదా?

ఇక గతంలో అక్రమాస్తుల కేసులో, 16 నెలలు జైల్లో ఉన్న జగనన్న సీఎం అయిన తర్వాత.. సీబీఐ కోర్టు విచారణకు వెళ్లడం మానేశారు. తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, ప్రజాధనం-రక్షణ దృష్ట్యా ప్రతి శుక్రవారం హైదరాబాద్ విచారణకు రాలేనని, జగన్ కోర్టును అభ్యర్ధించారు. కావాలంటే తన లాయర్ వస్తారన్న ఆఫర్‌ను, అటు సీబీఐ కోర్టు కూడా పెద్ద మనసుతో అంగీకరించింది.

ఆ ప్రకారంగా అప్పటినుంచి ఇప్పటికి బెయిల్ వచ్చిన ఈ పదేళ్లలో, సీఎం అయిన తర్వాత జగన్ సీబీఐ కోర్టుకు శుక్రవారం హాజరవుతున్నది లేదు. కోర్టు కూడా మీరు కచ్చితంగా హాజరుకావలసిందే అని ఆదేశించిందీ లేదు. ఇక ఆయన విదేశీ పర్యటనలకు సైతం.. కోర్టు ఎక్కడా మోకాలడ్డకుండా, విశాల హృదయంతో అనుమతిస్తూనే ఉంది. ఈ విషయంలో వైసీపీ నేతల ఆరోపణల ప్రకారమే చూస్తే.. వ్యవస్థలను మేనేజ్ చేస్తారన్న చంద్రబాబు అందులో విఫలమయి, జగన్ విజయం సాధించినట్లే లెక్క అన్నది మేధావుల ఉవాచ.

ఇక ఎన్నికల ముందు విశాఖయిర్‌పోర్టులో నాటి విపక్ష నేత, నేటి సీఎం జగనన్నపై కోడికత్తితో జరిగిన దాడి కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ కోర్టు కూడా, జగనన్నను కోర్టుకు రప్పించలేపోతోంది. అటు నిందితుడైన శ్రీను మాత్రం క్రమశిక్షణ కలిగిన విద్యార్ధిలా వాయిదాలకు హాజరవుతూనే ఉన్నారు. అప్పుడంటే ఎన్‌ఐఏ కోర్టు విజయవాడలో లేదు. కాబట్టి రక్షణ -ప్రజాధనం కోణంలో జగనన్న అంతదూరం వెళ్లలేరన్న వాదన జరిగింది.

అయితే ఇప్పుడు ఎంచక్కా కోర్టును బెజవాడలోనే పెట్టారు. కాబట్టి, జగనన్న దర్జాగా హాజరయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా జగనన్న ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకానేలేదు. కాకపోతే అడ్వకేట్ కమిషనర్‌ను పంపించాలని కోరారు. అది ఇంకా సహజంగానే పెండింగ్‌లో ఉంది. ఈ విషయంలో కూడా ‘వ్యవస్థల మేనేజర్’గా ముద్ర పడ్డ చంద్రబాబు, ఫెయిలయినట్లే లెక్క.

సీన్ కట్ చేస్తే.. చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 15 రోజుల క్రితం అరెస్టు రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆ ఘటన తర్వాత టీడీపీ నేతలతో సహా చాలామంది.. చంద్రబాబు గంటలో విడుదలవుతారని భ్రమించారు. ‘వ్యవస్థల మేనేజర్’కు ఇవన్నీ పెద్ద లెక్కకావని భావించారు. కానీ ఇప్పటికి ఆయన జైలుకు వెళ్లి 15 రోజులయింది. దిక్కూ దివాణం లేదు.

ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు వరకూ, అన్నీ ఎదురుదెబ్బలే. ఇప్పుడు బాబు బంతి సుప్రీంకోర్టుకు చేరింది. అలా అప్పుడు వైఎస్-ఇప్పుడు జగన్ అండ్ కో ముద్ర వేసిన ‘వ్యవస్థల మేనేజర్’.. ఇప్పుడు బయటకు వచ్చేందుకు, కోర్టు వైపు దిక్కులు చూస్తూ అవస్థలు పడుతున్న వైచిత్రి.

దీన్నిబట్టి.. వ్యవస్థలను మేనేజ్ చేస్తుందెవరు? అసలైన వ్యవస్థల మేనేజర్ ఎవరు? వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు.. చంద్రబాబు వ్యవస్థల మేనేజర్ అయితే, ఏసీలో ఉండాల్సిన ఆయన 15 రోజులు జైల్లో దోమలు కుట్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? క్వాష్, బెయిల్ పిటిషన్లు వేసుకోవలసిన అగత్యం ఎందుకొస్తుందన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఇప్పుడు వ్యవస్థల మేనేజర్ ఎవరో… అర్ధమైందా రాజా?

LEAVE A RESPONSE