– గల్లీలో కుస్తీ..ఢిల్లీతో ఇద్దరి దోస్తీ
– కేంద్రాన్ని విమర్శించని జగన్-బాబు
– అన్ని బిల్లులకూ రెండు పార్టీలూ ఓకే
– ఆంధ్రా అడిగినప్పుడల్లా కేంద్రం అప్పులు
– కేంద్రం పెట్రోరేట్లు పెంచినా, వైసీపీని దునుమాడే టీడీపీ
– కేంద్ర హామీలు నెరవేర్చకపోయినా వైసీపీ-టీడీపీ విధేయత
– రైల్వేజోన్, హోదా ఇవ్వకపోయినా మౌనరాగం
– పార్లమెంటు భవన ప్రారంభానికి రావాలంటూ జగన్ పిలుపు
– మోదీకి శుభాకాంక్షలు చెబుతూ చ ంద్రబాబు ట్వీట్
– ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా అవి ‘కమలవన పుష్పాలే’నా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనగనగా ఒక ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రానికి ఇద్దరు నాయకులు. ఒకాయన పేరు జగన్మోహన్‌రెడ్డి. ఆయన సీఎం. మరొకాయన పేరు చంద్రబాబునాయుడు. విపక్ష నేత, మాజీ సీఎం. ఇద్దరివీ భిన్న ధృవాలు. కత్తి తీసి ఒకరు, కత్తి తీయకుండా మరొకరు దూసుకుంటారు. జగన్మోహన్‌రెడ్డి సర్కారును ఉతికి ఆరేసి, చాకిరేవు పెట్టడంలో విపక్ష నేత చంద్రబాబు బిజీ. తనను సతాయిస్తున్న టీడీపీ నేతలను వీలైనన్ని ఎక్కువ కేసుల్లో ఇరుకించి, ఎలా జైలుకు పంపించాలా అన్న ఆలోచనలతో జగన్మోహన్‌రెడ్డి వీర బిజీ.
ఇలా రాష్ట్రంలో కత్తులు దూసుకునే ఈ ఇద్దరికీ విచిత్రంగా.. పైన ఢిల్లీలో ఉండే మోదీ అంటే భయభక్తులు. గల్లీలో కొట్టుకున్నా ఢిల్లీలో ఇద్దరూ పెద్దాయనకు ఏదో ఒక రూపంలో విధేయులే. ఇద్దరూ ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం, పరితపిస్తుంటారు. ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఇక్కడ ఇద్దరూ కొట్టుకున్నా, మోదీకి మద్దతునిచ్చే యవ్వారంలో మాత్రం, ఏకకాలంలో విధేయత ప్రదర్శిస్తుంటారు. మరి అదృష్టమంటే మోదీదే కదా? పెట్టి పుట్టాలన్నది తెలుగు సామెత. ఆంధ్రాలో మోదీ అదృష్టం చూస్తే అలాగేననిపిస్తుంటుంది!
అలాగని మోదీ సాబేమీ చంద్రబాబును దగ్గరకు రానీయరు. ఆయనతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ‘అక్క ఆర్భాటమే తప్ప బావబతికుంది లేద’న్నట్లు.. తెలుగుదేశాధీశుడి తపనే తప్ప, నరేంద్రుడి వాత్సల్యం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా.. కాదనకుండా ఆమోదిస్తున్న టీడీపీ విధేయత వల్ల, ఇప్పటికిప్పుడు కనిపించే లాభం సున్నా. అయినా పట్టువదలని విక్రమార్కత్వం టీడీపీది. ఎవరి ఆశ వారిది!
కేంద్రం ఏం చేసినా బీజేపీని బదులు, వైసీపీని ఉతికేసే స్టైలు టీడీపీది. కేంద్రం పెట్రోలు రేట్లు పెంచితే, జగన్ సర్కారు వ్యాట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసే విచిత్ర-విధేయ రాజకీయం. జగన్ వల్లే రేట్లు పెరిగాయన్న వింత వాదన. విభజన హామీలు నెరవేర్చని బీజేపీని విమర్శించడం మానేసి, వాటిని సాధించలేని వైసీపీని దునుమాడే నయా రాజకీయం. ఇలా కేంద్రం ఏం చేసినా, జాగ్రత్తగా దాని జోలికి పోకుండా.. వైసీపీపై మాత్రమే తుపాకీ పెట్టే సంకట స్థితి టీడీపీది.
జగన్మోహన్‌రెడ్డి యవ్వారం అలా కాదు. మోదీని ఎప్పుడంటే అప్పుడు కలిసొస్తారు. తమ్ముడి కేసు నోటీసు వచ్చిన వెంటనే, ఢిల్లీ పెద్దలను వీజీగా కలుస్తారు. ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వని ‘అసలాయన’ అమిత్‌షా కూడా, అర్ధరాత్రయినా సరే జగనన్నతో భేటీ వేస్తారు. ఖజానా ఖాళీ అయినప్పుడల్లా, విత్తమంత్రి నిర్మలమ్మ.. నిర్మల హృదయంతో వందలు, వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చేస్తుంటారు.
ఈ ఇచ్చి పుచ్చుకోవడాల మధ్యలో ఏ అంబానీకో, ఏ అదానీకో, ఇంకో గుజరాతీ ఘనాపాఠీకో.. ఏపీలో భారీ ప్రాజెక్టులు వచ్చేస్తుంటాయి. టీటీడీలో తమకు కావలసిన ఉత్తరాది వారు, మెంబర్లయిపోతుంటారు. తమకు ఆప్తులైన వారు, ఏపీలో అధికార పార్టీ రాజ్యసభ సభ్యులుగా పరకాయ ప్రవేశం చేస్తుంటారు. ఆ విధంగా మోదీ భాయ్-జగనన్న కలసి ముందుకు వెళుతున్నారన్నమాట!
నాలుగేళ్ల క్రితం వరకూ చంద్రబాబు, వ్యవస్థలు మేనేజ్ చేయడంలో మొనగాడన్న విమర్శలు ఉండేవి. వైఎస్ నుంచి జగన్ అండ్ కో వరకూ, అవే విమర్శలను శరపరంపరగా సంధించేవారు. కానీ ఇప్పుడు విచిత్రంగా జగన్-ఆయన పరివారానికి సంబంధించి, పైకోర్టులో కేసుల నెంబరింగులు కోరుకున్నప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు జగన్ సీబీఐ కోర్టుకు, ప్రతి వారం హాజరుకాకుండా మినహాయింపు వచ్చేసింది.
ఎన్‌ఐఏ కోర్టుకు స్వయంగా హాజరుకాకపోయినా, ఫర్వాలేదన్నట్లుగా అనుకూల వాతావరణం వచ్చేసింది. ఇక్కడ సర్కారుకు రోజూ డజను షాంపులతో తలంటి పోసే జడ్జిలను, మిగిలిన రాష్ట్రాలకు బలవంతంగా బయటకు పంపించేంత బలం పెరిగింది. విమానయాన శాఖలో, తమ వారికి ఎక్కడంటే అక్కడ పోస్టింగులు వచ్చేస్తుంటాయి. సీఎస్‌లకు ఎన్నాళ్లు కొనసాగింపు కోరితే, కేంద్రం ఆనందంగా అన్ని నెలలు ఇచ్చేస్తుంటుంది. అంటే ఈ విషయంలో కూడా ‘పైవారి’ సాయంతో, పెద్ద విజయాలు సాధిస్తున్నట్లే లెక్క.
మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉన్న వైసీపీపై కత్తులు దూయదా అంటే.. ఎందుకు దూయదూ…? దూస్తుంది! సత్యకుమార్, సీఎం రమేష్, సుజనాచౌదరి, పురందీశ్వరి, ఆదినారాయణరెడ్డి వంటి వేళ్లపై లెక్కబెట్టేంతమంది నేతలు.. జగనన్న సర్కారుపై కారాలు మిరియాలు నూరుతుంటారు. లంకా దినకర్ లాంటి వాళ్లు.. కేంద్రం నుంచి ఎన్ని అప్పులు తీసుకువచ్చిందన్న లెక్కలతో వ్యాసాలు రాస్తే, నాగోతు రమేష్ నాయుడులాంటి నేతలు, రోజువారీ ఘటనలకు నిరసనగా ట్వీట్లు ట్వీటుతుంటారు. అలా రోజులు వెళ్లదీస్తుంటారంతే!
మధ్యలో కేంద్రమంత్రులొచ్చి..‘‘ జగనన్న సర్కారు పని అయిపోయింది. ఆయనకు పాలన తెలీదు. అప్పులతో పాలిస్తున్నారు. మేం ఇచ్చే డబ్బులకు ఆయన స్టిక్కర్లు వేసుకుంటున్నాడు. మేం త్వరలో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మీడియా పేరంటంలో గర్జిస్తుంటారు. సూటిగా చెప్పాలంటే.. ‘‘మేం లేస్తే మనుషులం కాద’’న్నంత గంభీరంగా గర్జిస్తారు. సరదాగా తమలపాకు యుద్ధం చేస్తుంటారు.
శిబిరంలోని మిగిలిన కమలదళం.. వైసీపీని మొహమాటానికి ఓ పది తిట్లు తిట్టి, మిగిలిన తొంభై తెలుగుదేశాన్ని తిడుతుంటారు. ఇదొక రకమైన లవ్వు ‘పువ్వా’ట! అర్ధం చేసుకోవాలంటే కొంచెం బుర్ర వాడాలంతే!
ఇప్పుడు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభం కానుంది. దానికి భారత రాష్ట్రపతిని పిలవకుండానే, ప్రధాని మోదీ ఒక్కరే ప్రారంభిస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించినందుకు నిరసన ప్రకటించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యుపీఏ పక్షాలతో సహా, 19 విపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఆ మేరకు సంతకాలు చేశాయి. అందులో తెలుగు పార్టీలయిన వైసీపీ, టీడీపీ, బీఆర్‌ఎస్ లేవు. ఎందుకంటే అవి యుపీఏ భాగస్వామ్య పక్షాలు కాదు కాబట్టి!
ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి తన వైసీపీ పక్షాన దేశంలోని బీజేపీయేతర పక్షాలకు ఒక సందేశం పంపించారు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి అంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్డీఏ సభ్యుడు కాదు. అలాగని యుపీఏలోనూ లేరు. కానీ పార్లమెంటు పేరంటానికి అందరినీ రమ్మని పిలిచారు. గ్రేట్! నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా చేయాల్సిన ఆ పనిని.. జగనన్న, త్రికరణ శుద్ధితో చేయడం విశేషమే. ఇది పువ్వు పార్టీ నాయకద్వయం పెదవులపై, చిరునవ్వులు పూయించడమే.
విచిత్రంగా ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా.. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చేస్తున్న, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. తన పార్టీ ప్రతినిధిగా కనకమేడల రవీంద్రను పంపుతున్నట్లు ప్రకటించారు. అంటే ఇక ఆంధ్రాలో బీజేపీకి విపక్షమన్నది లేదని.. అటు జగనన్న-ఇటు చంద్రన్న తమ విధేయ చర్యలతో చాటి చెప్పినట్టయింది. మోదీకి ఇంతకంటే సంతోషకరమైన సందర్భం, ఇంకొకటి ఏముంటుంది?
నిజానికి ఏపీలో బీజేపీకి మొలతాడు కట్టే మొనగాడు, ఈ శతాబ్దంలోనయినా దొరుకుతాడో లేదో చెప్పడం కష్టం. వచ్చిన మొనగాడిని విజయవంతంగా పంపించేశారు. ఆదినారాయణ రెడ్డి లాంటి యోధులకు తప్ప, మిగిలిన ఏ ఒక్కరికీ రెండో స్థానం వచ్చే యోగం లేదు.
బీజేపీ సొంతగా పోటీ చేస్తే 175 స్థానాల్లో హీనపక్షం 171 స్థానాల్లో ధరావత్తు దక్కడం కష్టం. నోటా కూడా ఆ స్థానం చూసి సిగ్గుపడాల్సిందే. హాస్యనటులైన బ్రహ్మానందం, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం వారసులకు మాత్రం కొదువలేని పార్టీలో.. కొండవీటి సింహాలే కరవయ్యారన్నది కమలనాధుల ఉవాచ.
ఎందుకంటే ఈ నాలుగేళ్లలో కేంద్రం ఏపీకి చేసిందేమీ లేదు. విశాఖ జోన్‌కు మొండిచేయి-విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో ఉత్తరాంధ్ర ప్రజల్లో దోషిగా నిలబడింది. హోదాను అటకెక్కించి, విభజన హామీలు 10 వేల కోట్లతో శాశ్వతంగా అటకెక్కించేసింది. కేంద్ర ప్రోత్సాహంతోనే జగన్, అమరావతి గొంతు నులుముతున్నారన్న జనాగ్రహం దానికి అదనం. ఈ భావన ఆంధ్రాలో కంటే, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రావారిలోనే ఎక్కువగా ఉండటం విశేషం.
రాష్ట్రం అడిగినప్పుడల్లా అప్పులు ఇచ్చి-ఇప్పించి, రేపటి తరాన్ని కూడా అప్పులపాలు చేసేందుకు.. కేంద్రమే కారణమవుతోందన్న విద్యాధికులు-మేధావుల ఆగ్రహం. కలసి వెరసి ఆంధ్రాకు, మోదీ చేసిందేమీ లేదన్న బలమైన భావన. అంటే జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో, దానికి సమానమైన.. లేదా అంతకుమించిన వ్యతిరేకత, కేంద్ర సర్కారుపై ఉందన్నది విశ్లేషకుల అంచనా. నిజం నరేంద్రుడికెరుక?!
మరి ఇంత తెలిసినా.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబు, బీజేపీ దన్ను కోసం ఎందుకు పరితపిస్తున్నారు? ఒకవేళ బీజేపీతో పొత్తులో జత కట్టినప్పటికీ.. అభ్యర్ధులను కూడా టీడీపీనే ఇవ్వాల్సిన దుస్థితిలో, బీజేపీ ప్రాపకం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? రాష్ట్రానికి బీజేపీ ఏం చేయకపోగా, అమరావతిని చంపేసిందన్న భావనతో ఉన్న జనాభిప్రాయానికి భిన్నంగా, చంద్రబాబు ఎందుకు అడుగులేస్తున్నారు? కారణమేమిటి?
కారణం.. జాతీయ పార్టీల దన్ను కోసం అన్నది వచ్చే జవాబు! ఏదో ఒక జాతీయ పార్టీ తోడు లేకపోతే, జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అన్నది బలమైన భావన. అధికారంలో ఉన్న బీజేపీ తోడు ఉంటే, జగన్‌ను సులభంగా ఎదుర్కోవచ్చన్నది మరో ఆలోచన. ఎన్నికల్లో బయట నుంచి ఆదుకునే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా, ఆర్ధిక వ్యవహారాలు సాఫీగా సాగిపోయే అవకాశాలెక్కువ. కేంద్రాన్ని పల్లెత్తు విమర్శించకుండా.. మౌనవ్రతం పాటించడానికి ఇవే అసలైన కారణాలన్నది, మనం మనుషులం అన్నంత నిజం!
కానీ బీజేపీ దరి చేరని పరిస్థితి. కమ్యూనిస్టులు తోడు నిలిచేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కమలం వైపు చూస్తున్న వైచిత్రి ఎన్నాళ్లో చూడాలి. నిజానికి ఇప్పటి పరిస్థితిలో జనసేన-కమ్యూనిస్టులతోనే, కలసి కదనరంగంలోకి దిగాలన్నది మెజారిటీ తమ్ముళ్ల వాదన. కమలంతో కలిస్తే, దరిచేరిన ముస్లింల ఓట్లు దూరమవుతాయన్నది వారి మరో ఆందోళన.
ఈ ప్రకారం చూస్తే.. రేపు ఎన్నికల్లో ఎవరు గెలిచినా, చివరాఖరకు మోదీకి విధేయులుగానే ఉంటారు-ఉండాలి. కాబట్టి… ఆ సమరాంగణంలో ఎవరి వైపూ మొగ్గుకుండా, ఉత్తి పుణ్యానికి ఫలితం దక్కించుకునే అదృష్టం, ‘పువ్వు పార్టీ’కే దక్కనుంది. ఈలోగా రెండు పార్టీల జుట్లు తన చేతిలో పెట్టుకుని, కాగల కార్యం తానే తీరుస్తుందన్నమాట.
ఈపాటి దానికి.. ప్రత్యేకంగా ఏపీలో సొంత పార్టీ పటిష్టత-విస్తృతి గురించి, సమయం కేటాయించడం వృధా అన్నది, పువ్వు పార్టీ అసలు ఆలోచన. దానికోసం ఏపీ-ఢిల్లీ తిరగడం, ఖర్చులు దండన్నది ఇంకో అభిప్రాయం కావచ్చు. ఎలాగూ ఆంధ్రాలో వికసించేది లేదు. అక్కడ వికసించేవన్నీ తన తోటలోకి వచ్చి తీరాల్సిందే.
‘ఆపాటి దానికి ఏపీలో ప్రత్యేకించి వ్యూహాలు పన్నడం, దానికోసం సమయం కేటాయించడం పనికిమాలిన పని’ అన్న అభిప్రాయం కూడా, పువ్వు పార్టీ పెద్దమనుషుల నిర్లప్తతకు కారణం కావచ్చు. అయితే అంతలావు జాతీయ పార్టీకి.. ఒక రాష్ట్రంలో దిక్కు లేదన్న నామర్దా రాకుండా ఉండేందుకే, ఇలా అప్పుడప్పుడు అరుపులు-కేకలతో ‘పువ్వాట’ను రంగస్థలంపై రక్తికట్టిస్తున్నట్లు అర్ధం కావడం లేదూ?!