– బీసీ కార్డుతో బీజేపీపై జగన్ పరోక్ష యుద్ధం
– బీసీ బాణంతో బీజేపీపై విల్లు ఎక్కుపెట్టిన జగన్?
– బీసీలకు బీజేపీ మొండి చేయిపై వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శనాస్త్రాలు
– ఓబీసీ కేంద్రమంత్రులంతా పనికిమాలిన వారన్న విమర్శ
– వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ధర్నా చేస్తామని కృష్ణయ్య హెచ్చరిక
– బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతునిచ్చిదంటూ ప్రశంస
– కాంగ్రెస్ భుజంపై బీజేపీ వైపు తుపాకీ పెట్టిన జగన్
– ముందుజాగత్త్రతో జగన్ బీజేపీపై బీసీ కార్డు సంధిస్తున్నారా?
– జగన్ అనుమతి లేకుండా కృష్ణయ్య మాట్లాడం సాధ్యమేనా?
– కృష్ణయ్యది సొంత అభిప్రాయమైతే మరి పార్టీ ఖండించదేం?
– అంటే వైసీపీ మౌనం సంపూర్ణాంగీకారమేనా?
– కృష్ణయ్య పెత్తందార్ల ప్రతినిధి అని బీజేపీ నేత నాగోతు ఫైర్
– అది జగన్ స్క్రిప్టే నన్న నాగోతు
– కులాల పేరుతో బీజేపీని బెదిరించలేరని స్పష్టీకరణ
– దమ్ముంటే సీఎంగా బీసీని ప్రకటించాలన్న తెలంగాణ బీజేపీ నేత మేకల సారంగపాణి
– కృష్ణయ్య ఇప్పుడు రెడ్ల పార్టీ ప్రతినిధి అంటూ ఫైర్
– బీసీ బాణంపై వైసీపీ-బీజేపీ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత వైసీపీ దళపతి, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వైఖరి మారుతోందా? అందుకే బీసీ కార్డుతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహానికి తెరలేపారా? ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలు అంచనా వేసి, ముందస్తు రక్షణవ్యూహం రచిస్తున్నారా? అందులో భాగంగానే బీజేపీ-ప్రధాని మోదీపై, తన పార్టీ ఎంపీతో బీసీ బాణం సంధించారా?
బీసీ కార్డుతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అందుకే వ్యూహాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు డిమాండ్‌ను తెలివిగా తెరపైకి తీసుకువచ్చారా? కేంద్రంలో ఉన్న 27 మంది బీసీ మంత్రులంతా పనికిరానివాళ్లన్న కృష్ణయ్య విమర్శ వెనుక, బీజేపీని బీసీలకు దూరంచేసే వ్యూహం ఉందా? ఇదంతా జగనన్న బీజేపీకి పంపించిన ముందస్తు హెచ్చరిక సంకేతాలా?.. వైసీపీ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య తాజాగా మోదీ-బీజేపీపై జమిలిగా సంధించిన బీసీ అస్త్రాలు ఆ సంకేతాలే ఇస్తున్నాయా?
‘‘కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీలపై చిన్నచూపు చూస్తోంది. పేరుకు మాత్రమే బీసీ అయిన మోదీని ప్రధానిని చేశారు. క్యాబినెట్‌లో ఉన్న 27 మంది బీసీ మంత్రులు పనికిమాలిన వాళ్లే. 75 కోట్ల బీసీలకు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? రెండు లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వకపోతే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ధర్నా చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తాం. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మద్దతునిచ్చారు’’
– ఇవన్నీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడో, లేక ఏ బీఆర్‌ఎస్ నాయకుడో, లేదా ఏ జనతాదళ్ నాయకుడు చేసిన హెచ్చరికలనుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఇవి అచ్చంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆశీస్సులు పుష్కలంగా ఉన్న, వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య మీడియా ముఖంగా చేసిన హెచ్చరికలు! నిజంగా నిఝం!!
సహజంగా వైసీపీ ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా, సొంతగా గళం విప్పే అవకాశం ఉండదు. మరి ఆ ప్రకారంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యం-అసమర్ధతను కడిగిపారేసిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు, వైసీపీ దళపతి జగన్ అనుమతితోనే చేసినట్లు భావించాలని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పోనీ అది కృష్ణయ్య వ్యక్తిగత అభిప్రాయమైతే, ఆ విషయం కూడా వైసీపీ నాయకత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. అంటే.. జగనన్న మనోగతమే కృష్ణయ్య వెల్లడించారని సుస్పష్టం. సహజంగా ఇలాంటి విధాన నిర్ణయాలు విజయసాయిరెడ్డి లేదా, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటిస్తుంటారు. జాతీయ స్థాయిలో పార్టీ నేతలు ఏది మాట్లాడాలన్నా అందుకు విజయసాయిరెడ్డి అనుమతి కావాలి.
కానీ ఎంపి కృష్ణయ్య వాటి గురించి మాట్లాడటమే.. ఇప్పుడు, అటు వైసీపీ-ఇటు బీజేపీలోనూ ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రధానంగా కృష్ణయ్య వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లో సీరియస్ చర్చ జరుగుతోంది. బీసీ అయిన మోదీని పేరుకే ప్రధానిని చేశారన్న కృష్ణయ్య వ్యాఖ్యలపై, బీజేపీ సీనియర్లు మండిపడుతున్నారు.
జాతీయ భావాలతో పుట్టిన బీజేపీకి, కులాలు ఆపాదించటం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేయడం, వైసీపీకి రాజకీయ పార్టీగా ఉన్న హక్కే తప్ప.. అందులో ప్రధానిని తెరపైకి తీసుకురావడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కుల ప్రయోజనాలు ఆశించి రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదని, దేశ ప్రజల ప్రయోజనాల కోణంలోనే పార్టీ-ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని గుర్తు చేస్తున్నారు. దేశంలో బీజేపీలో ఉన్నంతమంది బీసీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దేశంలో మరే పార్టీకి లేరని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు స్పష్టం చేశారు.
వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యల వెనుక, ఏపీ సీఎం-వైసీపీ దళపతి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలున్నాయన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో జరగబోయే పరిణామాలకు జగన్, ఇప్పటినుంచే వ్యూహాలు తయారుచేసుకున్నట్లు కృష్ణయ్య వ్యాఖ్యలు స్పష్ట ం చేస్తున్నాయని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ చేతిలో తన జుట్టు ఉండకుండా, ఇప్పటినుంచే జగన్ ఎత్తుగడలు వేస్తున్నారని, అందులో భాగంగానే బీసీ బాణం ఎక్కుపెట్టినట్లు అర్ధమవుతోందని కమలదళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కుల బాణం సంధిస్తే బీజేపీ ఇరుకునపడటం ఖాయమని, అందుకే తెలివిగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అంశాన్ని జగన్ తెలివిగా తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. పైగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. బీసీలను ఏకం చేస్తామన్న హెచ్చరికలు, తమ పార్టీ నాయకత్వానికి పరోక్ష హెచ్చరిక సంకేతంగానే బీజేపీ నేతలు భావిస్తున్నారు.
‘‘ జగన్ అనుమతి లేకుండా ఏ ఒక్క ఎంపీ గానీ, ఏ ఒక్క మంత్రి గానీ మాట్లాడే ధైర్యం చేయరన్నది అందరికీ తెలుసు. తాడేపల్లి లేదా సెక్రటేరియేట్ నుంచి వచ్చిన స్క్రిప్టునే అంతా ఫాలోకావాలి. ఒక ఎంపి నేరుగా మోదీ పేరు ప్రస్తావించి, పేరుకే ఆయనను ప్రధానిని చేశారన్న విమర్శించే ధైర్యం చేయడం అసంభవం.
దేశంలోని బీసీలకు బీజేపీ ఏమీ చేయలేదని బహిరంగంగా విమర్శించడానికి కూడా అధినేత జగన్ అనుమతి కావాలి. ఒక ప్రాంతీయ పార్టీలో పార్టీ అధ్యక్షుల అనుమతి లేనిదే, ఎవరూ మాట్లాడరన్నది మెడమీద తల ఉన్న అందరికీ తెలుసు. పైగా 50 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కూడా అనుమతించిందని చెప్పడమంటే, అది కాంగ్రెస్ భుజంపై తుపాకి పెట్టి బీజేపీని పేల్చే, జగన్ వ్యూహాత్మక ఎత్తుగడగానే కనిపిస్తోంది. ఓ వైపు కేంద్రం నుంచి అన్ని రకాల సాయం.. ఎప్పుడంటే అప్పుడు మోదీ-అమిత్‌షా అపాయింట్‌మెంట్లు పొందుతూ, అప్పులకు అనుమతులు సాధిస్తూ, మళ్లీ మా పార్టీపై బీసీ బాణం సంధించడం బట్టి, జగన్ ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నారో తెలుస్తోంద’ని ఓ బీసీ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
పైగా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న వైసీపీ.. కేంద్రంలో 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులిస్తే, జగన్ కేవలం 10 మంది బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని బీజేపీ నేత నాగోతు గుర్తు చేస్తున్నారు. ‘ ప్రధాని, బీజేపీపై ఆరోపణలు చేసిన కృష్ణయ్య ఇప్పుడు బీసీ నేత కాదు. పెత్తందార్ల ప్రతినిధి. బీసీలకు బీజేపీ ఏం చేసిందో ఎంబీసీలను అడిగి తెలుసుకుంటే మంచిది.
జగన్ ఇచ్చిన స్క్రిప్టును చదివి మోదీని విమర్శించడం సరైంది కాదు. కృష్ణయ్య ఎంబీసీల గురించి ఎందుకు ఉద్యమాలు చేయర’ని నాగోతు ప్రశ్నించారు. బీజేపీని కులాల పేరు చెప్పి బెదిరించాలనుకుంటే అది కుదరదని నాగోతు స్పష్టం చేశారు.
కాగా కృష్ణయ్యకు ధైర్యం ఉంటే సీఎం పదవి లేదా పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చి.. అప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాలని, తెలంగాణ బీజేపీ బీసీ నేతలు సవాల్ చేయడం చర్చనీయాంశమయింది. పైగా కాంగ్రెస్ మద్దతు గురించి మాట్లాడటం బట్టి.. జగన్మోహన్‌రెడ్డి ముందుచూపు, భవిష్యత్తు రాజకీయ వ్యూహమేమిటో స్పష్టమవుతోందని బీజేపీ బీసీ నేతలు విశ్లేషిస్తున్నారు.
‘మాకు బీసీ నేతగా కృష్ణయ్య అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. కానీ ఆయన ఇప్పుడు రెడ్ల పార్టీలో ఉన్న అగ్రకుల ప్రతినిధి మాత్రమే. కృష్ణయ్య ఇప్పుడు బీసీల ప్రతినిధి కాదు. వైసీపీ ప్రతినిధి. జగన్ చెప్పినట్లు చేసే వారు బీసీ నేత ఎలా అవుతారు? బీసీలకు మోదీ చేసినంత ఏ ప్రధాని చేశారో చెప్పండి.
కృష్ణయ్యకు ధైర్యం ఉంటే వైసీపీ సీఎం లేదా పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేయాలి. అప్పుడే ఆయనకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది. ఒక బీసీ అయి ఉండి, బీసీ అయిన ప్రధానిని విమర్శించడంతోపాటు, 27 మంది కేంద్రమంత్రులను పనికిరానివాళ్లన్న కృష్ణయ్య ఆరోపణ ఆయన అహంకారానికి పరాకాష్ఠ,. అంతమంది కేంద్రమంత్రులు పనికిరానివాళ్లయితే, కృష్ణయ్య ఒక్కడే పనికివచ్చేవాడా? ఆయన పనితనం ఏమిటో ప్రతి బీసీకీ తె లుసు. కాంగ్రెస్‌తో అవగాహన కోసమే, బీజేపీపై బీసీ కార్డుతో యుద్ధం చేస్తున్నారని అందరికీ తెలుసు’’ అని హైదరాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి వ్యాఖ్యానించారు. రెడ్ల పార్టీలో ఉంటూ బీసీల కోసం పోరాడటం హాస్యాస్పదమన్నారు.
మరోవైపు.. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన, అటు వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇదంతా తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అనుమతితోనే జరుగుతోందని బీజేపీ నాయకత్వం భావిస్తే.. తమ అధినేతనే వ్యూహాత్మకంగా తమను బీసీల ముందు దోషిగా నిలబెడుతున్నారని బీజేపీ నాయకత్వం గ్రహిస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నది వారి అసలు ఆందోళన.
అసలే బీజేపీతో ఓవైపు దోస్తీ కోసం టీడీపీ ప్రయత్నిస్తుంటే.. అలాంటి సమయంలో, బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న విమర్శలు, రాజకీయంగా ఎవరికి లాభమని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.