– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
దళితుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను నట్టేట ముంచారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1972వ సంవత్సరంలో రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేశారు. ఆర్థిక స్వాలంబన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షలాదిమంది నిరుపేద దళిత కుటుంబాలను ఆదుకున్నారు. పలు కార్యక్రమాల ద్వారా యువకులను ఆదుకోవడం జరిగింది.
వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీంతో స్వయం శక్తితో నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడగలిగారు. ఇలాంటి తోడ్పాటును అందించిన ఘనత ఎస్సీ కార్పొరేషన్ కు ఉంది. ఎస్సీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎస్సీ కార్పొరేషన్ కు తాళాలు వేసేశారు. ఇది నిజమా కాదా వైసిపి నాయకులు సమాధానం చెప్పాలి. వైసీపీ పాలనలో దళితులకు ఏం ప్రయోజనం చేకూరిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
ఈ ప్రభుత్వంలో దళితులు దోపిడీకి గురవుతున్నారు. దళితుల సొమ్ము స్వాహా చేయడం ఎంతవరకు సమంజసం? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దళారుల వద్ద ఉండిపోయిన రూ.67 కోట్లు రాబట్టడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టిడిపి హయాంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ఇచ్చిన నిధులు ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ ఎఫ్ కె ఎస్ డి పి ఇవి రెండు ఎస్సి కి సంబంధించిన జాతీయ సంస్థలతో 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రెండు కార్పొరేషన్ల నుంచి స్వచ్ఛ సంకల్పం పేరుతో నిధులను తెచ్చి ఈ ఆటోలు, క్లీనింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, ఇన్నోవా కార్లు, ఇతియోస్ కార్లు తెచ్చి ఇవ్వడానికి ప్రణాళికలు రూపకల్పన చేశాం. నాటి నుంచి దళితులకి అనేక సంక్షేమ పథకాలు అందించాం. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ కు తాళాలు వేశారు.
టిడిపి హయాంలో కార్పొరేషన్ పథకాలకు ఇచ్చిన సొమ్ము కూడా వదలకుండా దోచుకుంటున్నారు. లో కార్పొరేషన్ కు పవర్ ఆటోలు, మెకనైజ్డ్ డ్రైయిన్ క్లీనింగ్ మెషిన్లు, ఇన్నోవాలు, ఇతియోస్ వాహనాలు సరఫరా చేస్తామని అడ్వాన్సులు తీసుకున్న డీలర్లను నేడు వైసీపీ ప్రభుత్వం కాపాడుతోంది. తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ డీలర్ అనిల్ కుమార్ రెడ్డి 7,500 పవర్ ఆటోలు సరఫరా చేస్తామని చెప్పి 77.91 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇందులో 7,500 ఆటోలు సరఫరా చేయాల్సిన అనిల్ కుమార్ రెడ్డి 2,500 ఆటోలు మాత్రమే సరఫరా చేశాడు. ఇంకా 19.92 కోట్లు అతని వద్దే అడ్వాన్సు ఉండిపోయింది.
280 మెకనైజేషన్ క్లీనింగ్ మిషన్లు సరఫరా చేయాల్సివుండగా 209 మిషన్లు మాత్రమే సరఫరా చేశారు. 9కోట్ల 45 లక్షల రూపాయలు ఇంకా అడ్వాన్స్ అతని దగ్గర నిలిచిపోయింది. 660 ట్రాక్టర్లు సరఫరా చేస్తామని చెప్పి 450 ట్రాక్టర్లుమాత్రమే సరఫరా చేశారు. రూ.12 కోట్ల 30 లక్షల అడ్వాన్స్ ఇతని వద్దే ఉండిపోయింది. ఒక్క అనిల్ కుమార్ రెడ్డి వద్ద 41 కోట్ల 68 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపేణా అతని వద్ద నిలిచిపోయింది. ఈగల్ సరఫరా ఎక్విప్ మెంట్,కావలి వారి వద్ద రూ.21.76 కోట్లు ఉంది. రాధామాధవ్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటిడ్ వారి వద్ద రూ.23.05 కోట్లు ఉంది. ఎంట్రాన్ ఆటో మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు 17 యాంత్రికీకరణ పరికరాలు ఇవ్వాల్సి వుండగా కొన్నిమాత్రమే ఇచ్చారు. వారి వద్ద రూ.2.93 కోట్లు ఉంది. మొత్తం ముగ్గురు డీలర్ల వద్ద రూ.67.67 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ సొమ్ము ఉంది.
ఈ సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఎందుకు రికవరీ చేయడం లేదు? అధికారులు వారికి నోటీసులు పంపుతున్నా డీలర్లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలు ఎందుకు కాపాడుతున్నారు? నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని వారిపై ఆరోపణలు ఉన్నా కాపాడాల్సిన అవసరం ఏంటి? వీరి వెనుక ఉన్న ఆ అదృశ్య అధికారి ఎవరు? దళితుల సొమ్మంటే మీకు లెక్కలేనితనంగా మారింది. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు. దళితుల సొమ్మంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. డీలర్ల వద్ద రూ.67 వేల కోట్ల దళితుల సొమ్ముంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. డీలర్లను కాపాడుతున్న ఆ అదృశ్యం అధికారి ఎవరు?
మా ప్రభుత్వ హయాంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలు కొనుగోలుకు టెండర్లు పిలిచాం. 2017-18, 2018-19 లో జాతీయ సఫాయి కర్మచారీ ఆర్ధిక అభివృద్ధి సంస్థ, జాతీయ ఎస్సీ ఆర్ధిక అభివృద్ధి సంస్థ నిధులు కేటాయించాం. 13 జిల్లాలలో 13 ఈ-ఆటో సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పూణేకు చెందిన కెనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఆథరైజేషన్ తో తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం.
సరఫరాదారుల తరపున డీలర్ అనిల్ కుమార్ రెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. 7,500 పవర్ ఆటులు సరఫరా చేస్తామని రూ.77.91 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నారు. కానీ, అనిల్ కుమార్ రెడ్డి 2,550 వాహనాలు మాత్రమే సరఫరా చేశారు. వీటి విలువ రూ.57.98 కోట్లు. రూ.19.92 కోట్లు అడ్వాన్సు ఇంకా డీలర్ వద్దే ఉంది. 280 మెకనైజ్డ్ డ్రైయిన్ క్లీనింగ్ మెషిన్లు సరఫరా కోసం ఈగల్ సరఫరా ఎక్విప్ మెంట్,కావలి పేరుతో రూ.23.72 కోట్లు అడ్వాన్సు తీసుకున్నారు. కానీ, 209 మెషిన్లు మాత్రమే సరఫరా చేశారు. ఇందులో రూ.9.45 కోట్లు డీలర్ వద్దే ఉంది. ఇదే కంపెనీ 660 ట్రాక్టర్లు సరఫరా చేస్తామని రూ.38.87 కోట్లు అడ్వన్సు తీసుకుంది. కానీ కేవలం 451 ట్రాక్టర్లు మాత్రమే సరఫరా చేసింది. ఇందులో డీలర్ వద్ద రూ.12.31 కోట్లు ఉన్నాయి. ఒక్క అనిల్ కుమార్ రెడ్డి వద్దే రూ.41.68 కోట్లు నిలిచిపోయాయి.
రాధామాధవ్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటిడ్ 1647 ఇన్నోవాలు, ఇతియోస్ వాహనాలు సరఫరా చేస్తామని రూ221.64 కోట్లు అడ్వాన్సు తీసుకున్నారు. కానీ, కేవలం రూ.198.59 కోట్లు విలువ చేసే 1,417 వాహనాలు మాత్రమే సరఫరా చేశారు. అడ్వాన్సులో రూ.23.05 కోట్లు డీలర్ వద్దనే నిలిచిపోయింది.
ఎంట్రాన్ ఆటో మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ 15 మెకనైజ్డ్ డ్రైయిన్ క్లీనింగ్ మెషిన్లు సరఫరా చేస్తామని రూ.3.52 కోట్లు తీసుకుంది. కేవలం 6 మెషిన్లు మాత్రమే సరఫరా చేసింది. డీలర్ వద్ద రూ.2.93 కోట్లు ఉంది.
ఇంతపెద్దమొత్తంలో డీలర్లు వద్ద ఎస్సీ కార్పొరేషన్ సొమ్ము ఉంటే వైసీపీ ప్రభుత్వం సొమ్ము ఎందుకు రికవరీ చేయడం లేదో తెలియాలి. తెలుగుదేశం హయాంలో ఏదైనా చిన్న తప్పిదం జరిగినా వైసీపీ నాయకులు గందరగోళం చేసేవారు. వైసీపీ నాయకులు కంపెనీవారితో కుమ్మక్కై పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఊరుకున్నారంటే దానికి అదే అర్థం. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల నెలలైనా చేసిందేమీ లేదు. సోషల్ వెల్ఫేర్ కు ఇద్దరు మంత్రులు మారారు, ప్రయోజనం శూన్యం. సీఎం పేషీ నుంచే అవినీతి నడుస్తోంది. అనిల్ కుమార్ రెడ్డికి సపోర్టుగా లాబియింగ్ చేస్తున్నారు. నిజం నిగ్గు తేల్చాలి.
ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ వాస్తవాలపై దృష్టి సారించాలి. నోరు తెరచి మాట్లాడి నిజాలు నిగ్గు తేల్చాలి. దళితుల సొమ్ము రాబట్టడానికి మీరందరూ ఏకం కావాలి. దోషులను దండించాలి. సొమ్మంతా రికవరి చేయాలి. తెలుగుదేశం హయాంలో చెల్లించిన డబ్బులతో పనులు చేయించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. సీఎం పేషీ నుంచి ఒత్తడి రావడంతోనే అభివృద్ధి కార్యక్రమాలు ఆగాయి. మంత్రులు ఉండి ప్రయోజనమేంటి? వారు తేల్చాలి. ప్రభుత్వాలు మారినా మొదలు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తేల్చి చెప్పారు.