Suryaa.co.in

Andhra Pradesh

జగన్.. తక్షణమే టెండర్ రద్దు చేయి… లేకపోతే జైలుకు మరోసారి వెళ్లడం ఖాయం

-ఏడేళ్లపాటు విద్యుత్ వినియోగదారులపై 26 వేల కోట్ల రూపాయల భారం
-కేంద్రం సూచించిన దాని కంటే 240 శాతం ఎక్కువ ధరలా ?… ఇదెక్కడి విడ్డూరం..!
-పేదవాడికి వెయ్యి, 2 వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నవారు అధికారంలోకి వచ్చాక వారి నుంచి లాగుతున్నది ఎంత?
-ఎన్నికల్లో చేసిన ఖర్చంతా వెళ్లదీసుకోవడానికి ఇటువంటి రెండు డీల్స్ చాలు
-ప్రజలారా… నోట్ల కోసం దయచేసి ఓట్లను అమ్ముకోవద్దు
-గత ప్రభుత్వ హయాంలో పేదలకు పల్లెటూర్లలో ఇళ్ల నిర్మాణం కోసం మూడు సెంట్లు… పట్టణాలలో రెండు సెంట్ల భూమి
-ప్రెస్టేజ్ గా ఫీలయ్యే జగన్ చేతనైతే పల్లెటూర్లలో నాలుగు, పట్టణాలలో మూడు సెంట్లు భూమి ఇవ్వాలి
-రాష్ట్రంలో భూమి లేదా? పేదలకు సెంటు భూమి ఇస్తాననడం ఏమిటి?
-బెయిల్ రద్దు చేసి, మళ్ళీ బెయిల్ ఇచ్చారా అని ప్రశ్నించిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం
-అవినాష్ రెడ్డి సీ బీ ఐ విచారణకు హాజరు అయినా, కాకపోయిన 19 వ తేదీన ఆయన అరెస్టు తధ్యం
-సీ బీ ఐ నాతో మాట్లాడిన మాట నిజమే నన్న అజయ్ కల్లాం
-వివేకానంద మరణ వార్త అందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందని నిర్ధారణయింది
-హత్యలో పాల్గొన్నవారు, లేదంటే పథక రచన చేసినవారే జగన్మోహన్ రెడ్డికి వివేకా మరణ వార్త చేరవేసి ఉండవచ్చు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

విద్యుత్ వినియోగదారులపై పెనుభారం మోపనున్న విద్యుత్ మీటర్ల టెండర్ ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే రద్దు చేయాలి. ఈ కాంట్రాక్టు ద్వారా, ఏడేళ్ల పాటు నెలకింతని 26 వేల కోట్ల రూపాయల నిర్వహణ భారాన్ని వసూలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన దాని కంటే 240% అధిక మొత్తానికి ఒక కంపెనీకి ఈ కాంట్రాక్టును కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది?. కేంద్ర ప్రభుత్వం మీటరుకు ఆరు వేల రూపాయలు మాత్రమేనని సూచించింది. ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా సరఫరా చేయని సంస్థ కురాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఇదే విషయం మీద రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం విచారణ జరిపిస్తే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. గురువారము నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నూతన విద్యుత్ మీటర్లను బిగిస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తామని చెప్పింది. అయితే, మీటర్లను కచ్చితంగా బిగించాల్సిందేనని మాత్రం చెప్పలేదు.

కాబట్టి, విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపనున్న నూతన మీటర్లను బిగించడం అవసరమా?, అనవసరమా?? అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. కేంద్రం సబ్సిడీ ఇచ్చినప్పటికీ, విద్యుత్ వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఏడేళ్ల పాటు డబ్బులు చెల్లిస్తూనే ఉండాలి. వెయ్యి రూపాయలకు ఓటును అమ్ముకునే సామాన్యులకు 100 రూపాయలు కూడా ముఖ్యమేనని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.

మరో ఆరు నెలల పాటు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి, ఏడేళ్ల కోసం విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సిగ్గుచేటు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రద్దు చేయవచ్చు… లేదంటే ధరలను తగ్గించమని కోరే అవకాశం ఉంది. కాంట్రాక్టును మంజూరు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి పై, కాంట్రాక్టు సంస్థ పై కూడా కేసులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ ను రద్దుచేయాలి. ప్రజలకు చెప్పి, రహస్యం అన్నది లేకుండా పారదర్శకంగా టెండర్లను నిర్వహించండి.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ, తక్కువ ధర సూచించినప్పుడు, ఎక్కువ ధరకు మీటర్లను కొనుగోలు చేసి విద్యుత్ వినియోగదారులపై నిర్వాహణ భారాన్ని మోపడం ఎందుకు?. ప్రభుత్వ చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట బజారుకీడ్చవద్దు. ప్రభుత్వ నిర్ణయాలతో మన పార్టీకి అప్రతిష్ట పాలవుతుంది . ఇంకా పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా ఈ ప్రభుత్వం తప్పు చేయకుండా చూడాల్సిన బాధ్యత నాకు ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల వల్ల, పార్టీ భవిష్యత్తు నాశనం అవుతోంది.

రేపు నేను ఈ పార్టీలో ఉండను. అయినా ప్రస్తుతం, పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా పార్టీ శ్రేయస్సు కోరి మంచి చెబుతున్నాను. మీటర్ ధర కంటే నిర్వహణ కోసమే ఎక్కువ డబ్బులు అడిగితే ఎలా?. ఇప్పటికే ఈ ప్రభుత్వం ప్రజలపై పదివేల కోట్ల రూపాయల భారాన్ని వేసింది. ఇప్పుడు ఇది మరొక భారం. ఎన్నికల్లో పేదలకు వెయ్యి, 2 వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వస్తున్న వారు ప్రజలకు ఇస్తున్నది ఎంత?

వారి వద్ద నుంచి లాగుతున్నది ఎంత?? అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో ఓట్లను ఎవ్వరూ అమ్ముకోవద్దు… ఓట్ల కొనుగోలు కోసం వచ్చే వారిని చెప్పులతో కొట్టండి అని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చే వారికి తాము వెచ్చించిన ఖర్చు రాబట్టడానికి ఇటువంటి రెండు డీల్స్ చాలు. ప్రజలపై పెను భారాన్ని మోపే ఈ టెండర్ ను రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమాలు తప్పకపోవచ్చునని ఆయన హెచ్చరించారు .

జగన్ వద్ద దమ్మిడీ లేదు… పేదలకు ఇచ్చే ప్లాట్ల లే ఔట్లో మౌలిక వసతుల కల్పన అన్నది అసాధ్యమే
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇస్తానని చెబుతున్న పాట్ల లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద దమ్మిడి కూడా లేదు. ఇప్పటికే పని చేసిన కాంట్రాక్టర్లకు 1,80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం పురమాయించిన పనిచేయడానికి ముందుకు వచ్చే వారే లేరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

పేదలకు ప్లాట్లు ఇచ్చినప్పటికీ, ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తనవంతుగా ఇచ్చే 1,80,000 రూపాయలు సరిపోవు. ఎవరు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు.. పేదల ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయ కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరగా, పలు షరతులను విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సవరణ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వదలిస్తే, సుప్రీం కోర్టు తీర్పు లోబడి హక్కులు సంక్రమిస్తాయని ఆ పట్టాలపై స్పష్టంగా రాయాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు థర్డ్ పార్టీ హక్కులు సంక్రమించవని పేర్కొంది. పెళ్లి చేసుకున్నప్పటికీ, కాపురం చేసుకోవడానికి వీలు లేదు అన్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఇది రైతులకు పాక్షిక విజయం. ఒక విధంగా చెప్పాలంటే , జగన్మోహన్ రెడ్డి ది కూడా అంతే విజయం.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి దినపత్రిక వక్రీకరించి రాయడం సిగ్గుచేటు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లెటూర్లలో పేదల ఇంటి నిర్మాణానికి మూడు సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల భూమి కేటాయించారు. రాష్ట్రం లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారుడికి కేటాయించని జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుంది. పేదల సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందని అంటే నమ్మడానికి మనమేమైనా బుజ్జి నాన్నలమా?, అంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భాషలో వెర్రి పప్పలమా?? అని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో 2.90 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. అయినా, ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారుడికి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పల్లెటూర్లలో ఇళ్ళ నిర్మాణానికి మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్ల భూమిని కేటాయించారు. నగరాలలో పేదల కోసం భారీ టవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

చంద్రబాబు నాయుడు విజన్ ను అనుసరించాల్సిన జగన్మోహన్ రెడ్డి, అనుసరించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రెస్టేజ్ ఎక్కువ, ఆ ప్రెస్టేజ్ కోసమైనా పేదల ఇళ్ల నిర్మాణం కోసం పల్లెటూర్లలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు భూమిని చంద్రబాబు నాయుడు కేటాయిస్తే, జగన్మోహన్ రెడ్డి పల్లెటూర్లలో నాలుగు సెంట్లు, పట్టణాలలో మూడు సెంట్ల భూమిని కేటాయించవచ్చు కదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

రాష్ట్రంలో భూమికి ఏమైనా కొరత ఉన్నదా?. గత నాలుగేళ్లలో ఐదు ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినట్లుగా పార్లమెంటులోనే చెప్పారు. పేదలకు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణం చేశామని వాడు, వీడు పొగిడారని పొంగిపోవడం వంటి సినిమా స్టంట్ లు ఎందుకని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పల్లెటూర్లలో మూడు, పట్టణాలలో రెండు సెంట్లు భూమి ఇవ్వాలి. అంతేకానీ సెంటు భూమి ఇచ్చి వారి బ్రతుకులు బండలు చేయడం ఎందుకని ఫైర్ అయ్యారు.

తెలంగాణ హైకోర్టు తీర్పుతో అవాక్కైనా సుప్రీం కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. జూన్ 30వ తేదీలోగా వైఎస్ వివేక హత్య కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, జూలై రెండవ తేదీన 50 వేల పూచికత్తుతో ఎర్ర గంగిరెడ్డి కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును డాక్టర్ వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు . ఈ విషయాన్ని విన్న వెంటనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అవాక్కయింది. బెయిల్ రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనమే బెయిలు మంజూరు చేసిందా? అని సునీత తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దానికి ఆయన అవునని సమాధానం చెప్పడంతో త్రిసభ్య ధర్మాసనం ఆశ్చర్యపోయిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రేపు వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా?, అరెస్టు చేయకుండా ఉండే అవకాశం ఉందా??
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ని సిబిఐ పోలీసులు 19వ తేదీ (రేపు ) అరెస్టు చేస్తారా?, అరెస్టు చేయకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా?? అని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. 19వ తేదీన అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు అయిన, కాకపోయినా ఆయన్ని అరెస్టు చేయడం తధ్యంగా కనిపిస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో తాను పిటిషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నట్లుగా మెన్షన్ చేశారు.

అవినాష్ రెడ్డి అభ్యర్థనను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. బుధవారం పరిగణలోకి తీసుకుపోకపోవడం వల్ల, శుక్రవారంనాడు కూడా లిస్టు అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితిలోనూ లేవు. పై వారంలో వచ్చిన ప్రయోజనం ఉండదు. ఇప్పటికే అవినాష్ రెడ్డి అడిగిన నాలుగు రోజుల సమయాన్ని సిబిఐ ఇచ్చింది. స్టాచురిటీ బెయిల్ పై ఉన్న వ్యక్తి, బెయిల్ రద్దు చేసి జైలులో వేయడం జరిగింది. ఇక 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన తర్వాత, ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉంటారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో మెన్షన్ చేయగా, కేసు స్వీకరించేందుకు నిరాకరిస్తూ, వెకేషన్ బెంచ్ ను ఆశ్రయిస్తే ఆశ్రయించమని సూచించారు. ఒక బెంచ్ లో కేసు పెండింగ్ లో ఉండగా, జూన్ 5వ తేదీ తీర్పు చెబుతానని న్యాయమూర్తి స్పష్టంగా ప్రకటించిన తర్వాత, తిరిగి తగుదునమ్మా అంటూ హైకోర్టును ఆశ్రయించడానికి వీలు లేదు. సుప్రీం కోర్టు ద్వారా, హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాలన్న అవినాష్ రెడ్డి ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇప్పటివరకు న్యాయవాదులను అడ్డం పెట్టుకొని మాయాజాలం చేయడం ద్వారా ఎంతో సమయాన్ని గెయిన్ చేశారు.

నిజాన్ని అంగీకరించిన నిజాయితీపరుడైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం , తనతో సిబిఐ అధికారులు మాట్లాడిన మాట నిజమేనని ఒప్పుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఎలా చనిపోయారన్నది చెప్పలేదు. సమయం గుర్తు లేదని అజయ్ కల్లాం చెప్పినప్పటికీ, తెల్లవారుజామునే చెప్పారన్నది నిజం. ఎందుకంటే ఎన్నికలకు ముందు నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం జగన్మోహన్ రెడ్డి ఉదయం నాలుగు గంటల నుంచి 6 గంటల మధ్య సమావేశాలను నిర్వహించేవారు.

ప్రజల కోసమే తాను పుట్టానని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నప్పటికీ, ప్రజలెవరూ కూడా అలా భావించడం లేదు. వైయస్ వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటుతో హత్య చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశాన్ని యధావిధిగా కొనసాగించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం తెలిసింది. పార్టీ నాయకులు, ఇతరులతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డిని భారతీ రెడ్డి పిలుస్తున్నారని చెప్పగానే పైకి వెళ్లి వచ్చిన ఆయన, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినట్లుగా సమావేశంలో పాల్గొన్న సభ్యులతో చెప్పారు.

అయినా, ప్రజలంటే పిచ్చి ప్రేమ, ప్రజల కోసమే పుట్టానని, ప్రజాసేవ చేయాలని తాపత్రయపడుతూ బాబాయి గుండె, గొడ్డలి పోటుతో మరణించారని తెలిసినప్పటికీ, ప్రజా సంక్షేమం కోసం సమావేశాన్ని యధావిధిగా కొనసాగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా తన భార్య మరణించిన విషయం తెలిసినప్పటికీ, కోర్టులో వాదనలను వినిపిస్తున్న ఆయన తన క్లైంట్ కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో కేసును వాదించి ఇంటికి వెళ్లి బాధపడ్డారట. ప్రజా సంక్షేమం కోసమే పరితపించే జగన్మోహన్ రెడ్డిని సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పోల్చడం తప్పేమీ కాదని అనుకుంటున్నానని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ అన్ని విషయాలను తెలుసుకోవడానికి తమకు కస్టడీ కావాలని కోరింది. ఇందులో విస్తృత కుట్ర కుంభకోణం ఉందేమో నన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి కి ముందే తెలిసిందంటే, గొడ్డలితో హత్య చేసిన వాడైనా చెప్పి ఉండాలి. లేకపోతే చేయించినవాడైనా చెప్పి ఉండాలి. మూడో వ్యక్తి చెప్పే అవకాశం లేదు. నిజాయితీపరుడైన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పరిస్థితుల దృష్ట్యా నిజం చెప్పకపోయినా, అబద్ధాన్ని మాత్రం చెప్పరు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు అన్నది తేలాల్సి ఉంది.

తన బాబాయిని చివరి చూపు చూడడానికి పులివెందుల వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక విమానము, హెలికాప్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ , తాను త్వరగా వెళితే మాత్రం చనిపోయిన వ్యక్తి లేచి వస్తారా అన్న తాత్విక ధోరణితో తాపీగా కారులోనే వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి ని హంతకులు ఎలా చంపారో కళ్లకు కట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి వివరించారంటే, ఆయనకు వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్తను చెప్పిన వ్యక్తి తెలిపారా?, లేకపోతే పులివెందులకు వెళ్లిన తర్వాత తెలుసుకున్నారా అన్న సందేహం కలగడం సహజమే.

అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కంగారు పడిన తీరు, టిడిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కోరి, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ రాష్ట్ర ప్రభుత్వమే విచారిస్తుందని మాట మార్చడం… వైఎస్ సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారిస్తున్నప్పుడు, విచారణ అధికారి పై కేసు నమోదు చేసిన తీరు పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE