– సెక్యూరిటీపై ‘జగన్నా’టకం
– ఎవరు భద్రత కల్పించారు? ఎవరు ఫ్యాక్షన్ కక్ష చూపించారు?
– నాడు నెలరోజుల్లోనే బాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గింపు
– ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణీకుల మాదిరి బస్సులో
– వీఐపీ యాక్సెస్ తొలగించిన జగన్ సర్కారు
– బాబు కాన్వాయ్‌కు పైలెట్ వాహనం కట్
– లోకేష్‌కు భద్రత సగానికి సగం కుదించిన జగన్ సర్కారు
– నాడు బాబు వాడిన సఫారీ కారే ఇప్పుడు జగన్‌కు
– జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే
– ప్రతిపక్ష నేత హోదా కూడా లేని వైనం
– అయినా అత్యాశ డిమాండ్లు
– బాబు భద్రతపై వైఎస్ జమానా నుంచి వేధింపులే
– అంబాసిడర్ మార్చమని కోరినా వైఎస్ బేఖాతర్
– అదే సంస్కృతి కొనసాగించిన జగన్
– రోశయ్య హయాంలో బాబుకు సఫారీ కారు
(మార్తి సుబ్రహ్మణ్యం)
కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్న ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన మాజీ సీఎం జగన్‌కు.. సీఎం చంద్రబాబుతో సమానంగా సెక్యూరిటీ కావాలట.. విపక్షనేతకు ఇచ్చిన సఫారీ కారు సారుకు నచ్చలేదట. మరి అదే కారు, విపక్షనేతగా ఉన్న చంద్రబాబు వాడారు కదా అని ప్రశ్నిస్తే.. అదంతా నాకు తెలవదబ్బా.. నాకు కాస్ట్లీకారు కావల్సిందే అన్న మొండితనం. పైగా సారుకు భద్రత తగ్గించారని వైకాపేయుల కాకిగోల. జగన్‌పై కక్ష సాధింపుచర్యలంటూ టన్నుల కొద్దీ కన్నీరు.
ఇప్పుడు 11 మంది ఎమ్యేలున్న జగన్ ఐదేళ్ల పాలనలో.. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్షనేత చంద్రబాబు.. ఆయన కుటుంబసభ్యులకు భద్రత ఎంత తగ్గించారు? చివరకు బాబును ఎయిర్‌పోర్టులో భద్రత పేరుతో ఎంత వేధించారో పరిశీలిస్తే… ఎవరిది ఫ్యాక్షన్ మనస్తత్వం? ఎవరిని ప్రజాస్వామ్యయుత మనస్తత్వమన్నది తేలిపోతుంది. అదేమిటో ఓసారి చూద్దాం.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌రెడ్డికి ఇవాల్సిన జడ్ ప్లస్ కేటగిరి భద్రతను, ఎస్ఆర్‌సీ 2024సి నిబంధనల మేరకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం, జగన్ విషయంలో తు.చ తప్పకుండా అమలు చేస్తోంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులు షర్మిళ, తల్లి విజయమ్మ కి కూడా భద్రత కల్పిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి వివక్షా లేదు. తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ఇప్పటికీ పోలీసు చెక్ పోస్టులను, భద్రతా సిబ్బందిని మనం చూస్తున్నాం.
కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే, అసెంబ్లీ సమావేశాలకు ముందే భద్రత తగ్గించింది జగన్ ప్రభుత్వం. జడ్ కేటగిరీ ఉన్న లోకేష్ కు 5 ప్లస్ 5 నుంచి… 2 ప్లస్ 2 గన్ మెన్ల కు భద్రత తగ్గించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు అప్పటివరకు కల్పిస్తున్న భద్రతను పూర్తిగా తొలగించింది.
చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్లే పైలట్ వాహనాన్ని ప్రభుత్వం తీసేసింది. దీంతో పాటు కాన్వాయ్ వెనకాల వచ్చే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ముందు వెళ్తున్న ఎనిమిది వాహనాల్లో ఏదైనా సమస్య తలెత్తినా… వెనుకాల నుంచి గుర్తుతెలియని వాహనాలు ఏమైనా ఫాలో అయితే, అప్రమత్తం చేసే ఎస్కార్టు వాహనాన్ని కూడా నాటి జగన్ ప్రభుత్వం తొలగించింది.
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ వెళితే, ఎయిర్ పోర్టులో చంద్రబాబు ని చేతులు పైకెత్తమని, ఫ్రిస్కింగ్ కూడా చేసిన ఫోటోలు మీడియాలో చూశారు. వి ఐ పి యాక్సిస్ కూడా నిరాకరించి, అందరి ప్రయాణీకులతో పాటు బస్సులో పంపించారు. దానిపై తెలుగుదేశం వర్గాలు కోర్టుకు వెళ్లడంతో, హైకోర్టు సంచలన తీర్పు ఇస్తూ.. ఆయనకు మావోయిస్టులతో వున్న రిస్కు రీత్యా, అలిపిరి ఘటన తరువాత నుండి ఇస్తున్న భద్రతను కొనసాగించాని రెండు నెలలోపే తీర్పు ఇచ్చింది.
శ్రీశైలం నుండి వచ్చిన వరదను ప్రకాశం బ్యారేజీ నుండి వదలకుండా, చంద్రబాబు నివాసం వున్న ఇంటిని ముంచాలని ప్రయత్నిస్తూ.. డ్రోన్లు ఎగరవేయడం, ఇంటి చుట్టూ వైకాపా ఎమ్మెల్యే, మూకలు తిరగడం గురించి తెలిసినా.. భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. అలాగే అప్పటి ఎమ్మెల్యే జోగి రమేశ్, రౌడీ మూకలను వెంటబెట్టుకొని చంద్రబాబు ఇంటిలోనికి వెళ్లి దాడి చేయడానికి వెళ్లినా, పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు.
సమయానికి తెలుగుదేశం శ్రేణులు చేరుకోవడంతో జోగి రమేశ్ మూకలు వెనుతిరిగాయి. మరోసారి పలనాడు ఆత్మకూరులో 127 తెలుగుదేశం అభిమానుల కుటుంబాల మీద దాడులు చేసి ఊరి నుండి వెళ్లగొడితే.. అక్కడికి వెళ్లడానికి సమాయాత్తం అవుతున్నారని, చంద్రబాబు నివాసం ఉన్న ఇంటి గేటుకు తాడులు కట్టి, తాళం వేసిన దృశ్యాలు ప్రజలకందరికీ తెలిసిందే.
విశాఖపట్నం పర్యటనకు వెళితే రౌడీ మూకలను వేసుకొచ్చి ఎయిర్పోర్టులో అడ్డుకొన్న విషయం ఎవరూ మరవలేదు. అమరావతికి వెళితే, ఆయన కాన్వాయ్ మీద రాళ్లు చెప్పులు వేయించి దాడులు చేస్తే, అప్పటి డిజిపితో అది ప్రజాస్వామ్య స్వేచ్చ అని అభివర్ణించే మాటలు మాట్లాడించారు. ఆఖరికి తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసి ధ్వంసం చేశారు. కేసు ఇచ్చినా స్వీకరించని విషయం తెలిసిందే.
మా వైకాపా వారికి బిపిలు వస్తే అలాగే చేస్తారు అని అనడం ప్రజలు గ్రహించారు. చివరికి నీటి ప్రాజక్టుల వద్దకు చంద్రబాబు వెళుతున్నాడని, పుంగునూరు ముందు అంగళ్ల వద్ద గొడవలు చేసి, ఆయన మీదే కేసులు పెట్టి.. పుంగనూరు రాకుండా చేసిన విషయం అంతా చూశారు.
అక్రమ కేసులు పెట్టి, గవర్నర్ అనుమతి కూడా లేకుండా జైలుకు పంపి, రాజమండ్రి జైల్లో దోమల గదిలో పెట్టి, ఆయనను భయపెట్టాలని, చంపాలని చూసిన ప్రభుత్వం జగనుది కాదా? ఇక లోకేశ్ పాదయాత్ర సమయంలో మైకు లాగేయడం నుండి వాహనాన్ని తీసేసుకోవడం వరకు, వాటర్ బాటిళ్లతో దాడులు చేయించడం వరకు ఒకటా రెండా.. ఎన్నో సంఘటనలు, భద్రతా వైఫల్యాలు!
ఇవాళ జడ్ ప్లస్ భద్రతను జగనుకు కల్పించి, అత్యుత్తమైన టాటా సఫారీ బీఆర్ కారును విజయనగరం నుండి తెప్పించి జగను పర్యటనకు ఎస్కార్టుతో ఏర్పాట్లు చేసినా.. ఆయన కారు మారి, వెంట వస్తున్న కారును మొరాయించింది అని అబద్దం ఆడుతూ.. భద్రత కల్పించలేదు అని అనడం హేయం. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్నా జగన్‌కే చంద్రబాబు స్థాయిలో సెక్యూరిటీ కావాలని గొంతెమ్మ కోర్కెలు కోరితే.. మరి 20 మంది ఎమ్మెల్యేలున్న డిప్యూటీ సీఎం, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఇంకెన్ని కోరికలు కోరాలి?
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో అంబాసిడర్ వాడిన చంద్రబాబు వాహనాలు మధ్యలోనే మొరాయించేవి. దానితో వాటి స్థానంలో కొత్త వాహనాలు సమకూర్చాలని టీడీపీ ఎమ్మెల్యేలు నాటి సీఎం వైఎస్‌కు వినతిపత్రం సమర్పించినా, ఖాతరు చేయలేదు. జామర్ కూడా పనిచేయనందున, దానిని మార్చమని కోరినా వైఎస్ పట్టించుకోలేదు. అయితే రోశయ్య సీఎం అయిన తర్వాత.. అంబాసిడర్ స్థానంలో సఫారీ కార్లు, జామర్లు మార్చారు.
ఇదే టాటా సఫారీ కారును చంద్రబాబునాయుడు అప్పుడు ప్రతిపక్ష హూదాలో ఇప్పుడు సీఎం హోదాలో వాడుతున్న విషయాన్ని వైకాపేయులు మర్చిపోవడమే విడ్డూరం. కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కార్లు, హెలికాప్లర్లలో తిరగడానికి అలవాటుపడ్డ జగన్‌కు సఫారీ కారులో కూర్చోవడం ఇష్టం లేకనే, ఆయన వేరే కారు ఎక్కినట్లు మొన్నటి వినుకొండ కారు కథ స్పష్టం చేసింది.
గెలుస్తూనే.. ఎవరు భద్రత కల్పించారు, ఎవరు ఫ్యాక్షన్ కక్ష చూపించారు అనేది మీకు అర్ధమవుతోందా?