Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌.. అంగన్వాడీ సమస్యలు పట్టవా?

– అడుగడుగునా సమస్యలే
– కుళ్లిపోయిన గుడ్ల సరఫరా
– పిల్లలకు కల్తీపాలు ఇస్తారా?
– పాలిథిన్‌ కవర్లలో పాలు సరఫరా చేస్తారా?
– సీఎంకు తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత లేఖ

ఏపీలోని అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలతో సతమవుతున్నా సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. పౌష్టికాహారం లేక పిల్లలు అనారోగ్యాలతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆమె సీఎం జగన్‌కు ఒక లేఖ రాశారు.

30.09.2022
బహిరంగ లేఖ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,
అమరావతి

విషయం: అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం దూరం, పిల్లలకు కల్తీ పాల సరఫరా, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మందుసీసాలు, కొరవడిన పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై ఉక్కుపాదం , ఆదాయ పరిమితి నిబంధనతో సంక్షేమ పథకాల్లో కోత వంటి అంశాల గురించి…

చిన్నారులకు పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్య అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు నాలుగేళ్లగా తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం, సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా పసిపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం? మొన్నటివరకూ అంగన్వాడీ సెంటర్లకు కుళ్లిపోయిన గుడ్లు సరఫరా చేశారు.

ఇప్పుడేమో నాణ్యతలేని పాలు సరఫరా చేస్తున్నారు. చిన్నపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలు కూడా కల్తీ చేయడం అమానుషం కాదా? టెట్రా ప్యాకెట్లను పక్కనపెట్టి మరీ పాలిథీన్ సంచుల్లో పాలు సరఫరా చేయడమేంటి ? పైగా అవేమో సరఫరా చేసిన రెండురోజులకే పేలిపోతున్నాయి. సంచులపై మీ బొమ్మ ముద్రించి ఉన్న శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయడంపై పెడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వ పథకాలను మీ ప్రచార పిచ్చికి వాడుకోవడం ఎంతవరకూ సమంజసం?

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ కొరవడింది. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో మందుసీసాలు దర్శనమిస్తున్నాయి? ఇలాంటి ఘటనలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అలాగే జీతాలు పెంచమని నాలుగేళ్లుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై లాఠీచార్జ్ చేసి గృహ నిర్బంధాలు చేస్తున్నారు.

అంగన్వాడీలు చేసిన తప్పేంటి? క్షేత్రస్థాయిలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే వారు చేసిన తప్పా? జీతాలు పెంచక,నెలవారీ జీతాలు సరిగా ఇవ్వక, ఆదాయ పరిమితి నిబంధన సాకు చూపించి సంక్షేమ పథకాలు అందనివ్వకపోతే అంగన్వాడీలు ఎలా బతకాలి? ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రచార పిచ్చి పక్కనపెట్టి నాణ్యమైన ఆహారం పిల్లలు, బాలింతలకు అందించాలి. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలి.

ఆచంట సునీత,
తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు

LEAVE A RESPONSE