Suryaa.co.in

Editorial

జగన్ గడప దాటారంటే.. జనం గడప దాటరంతే!

-సీఎం వస్తే అన్నీ మూసేయాలా?
-షాపులు మూసేస్తే నష్టం ఎవరికి?
-మీడియాలో విమర్శలను పట్టించుకోరా?
-అసలు ఇవి జగన్ దృష్టికి వెళుతున్నాయా? లేవా?
-ఇవన్నీ సీఎం ఆదేశాలా? పోలీసు అత్యుత్సాహమా?
-పబ్లిక్‌మూడ్‌ను పట్టించుకోకపోతే ఎలా?
-నగుబాటు పాలవుతున్నామంటున్న వైసీపీ నేతలు
-ఇళ్ళ దగ్గర బారికేడ్లు పెట్టడమేమిటి?
-ఏ సీఎం పర్యటనలోనయినా ఇలా జరిగిందా?
-మరి వైన్‌షాపులు మూసేయరేం?
-సీఎం వస్తే బస్సు- రైలు- విమాన ప్రయాణాలు చేయవద్దా?
-సీఎం వచ్చే వరకూ అవి ఆగుతాయా?
-స్థానికుల ప్రశ్నలతో ఎమ్మెల్యేల ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏ ప్రజల కోసమయితే వేల కోట్ల రూపాయల బటను నొక్కుతున్నారో.. అదే బటను నొక్కే తమ అధినేత పర్యటనలు, ప్రజలను ప్రతిసారీ ఇబ్బంది పెట్టి వారిలో వ్యతిరేకత పెంచితే.. ఇక నొక్కే ఆ బటన్ల వలన ఉపయోగమేమిటన్న అంతర్మథనం, వైసీపీ నేతలలో అంతకంతకూ పెరుగుతోంది.

ప్రధానంగా సీఎం జగనన్న పర్యటనలు ప్రజలకు శాపంగా మారి, అది పార్టీకి పెనుశాపంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది. జగనన్న పర్యటనల సందర్భంగా, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను మీడియా-సోషల్‌మీడియాలో వచ్చి.. పార్టీ అప్రతిష్టపాలవుతున్న వైనాన్ని ఆయన దృష్టికి తీసుకువెళుతున్నారో- లేదోనన్న అనుమానం జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది.

సీఎం జగనన్న చేపడుతున్న సంక్షేమ పథకాలే పార్టీని ఎన్నికల వైతరణి దాటిస్తాయన్న భరోసా, ఆయన ప్రసంగాల్లో కనిపిస్తుంటుంది. దుష్ట చతుష్టయం ఎన్ని అడ్డంకులు కల్పించినా, ప్రజలు తమవైపే ఉన్నారన్న ధీమా జగనన్న మాటల్లో తరచూ దర్శనమిస్తుంటుంది. తన వల్ల లబ్థిపొందిన ప్రతి కుటుంబం, ఎన్నికల్లో పార్టీకి ఓటు వేస్తుందన్నది జగనన్న ధీమా కూడా. జగన్ టు ఓటర్ తప్ప.. మధ్యలో మిగిలిన నాయకులు ఎవరూ అవసరం లేదన్న జగన్ వ్యూహానికీ ఇదే కారణంగా కనిపిస్తోంది.

ప్రతి కుటుంబం ఏడాదికి సగటున లక్ష రూపాయలు లబ్ధిపొందుతున్నందున, వారిని తమ ఓటు బ్యాంకుగానే వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. అసంతృప్తితో ఉన్న సొంత రెడ్డి సామాజికవర్గం, ఆర్ధికంగా ఏమాత్రం లబ్థిపొందని వైసీపీ నేతలు, నిధులు అందని పార్టీ సర్పంచులు, ఉద్యోగ వర్గాలు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ.. బటను నొక్కడంతో లబ్థిపొందుతున్న వర్గాలన్నీ, తమ పార్టీకే గంపగుత్తగా ఓటేస్తాయన్నది జగన్ సహా, ఆయనను ఆరాధించేవారి ప్రగాఢ విశ్వాసం.

అందులో కొంత నిజం ఉండవచ్చు. వారి ధీమాను పూర్తిగా కొట్టేయలేం. లబ్థిదారుల్లో జగనన్నపై ఆమేరకు విశ్వాసం, కృతజ్ఞత ఉంటే వారి ఓట్లు పడతాయన్న అంచనాను తప్పుపట్టలేం. కానీ, అదే లబ్థిదారులు.. అదే బటన్లు నొక్కే జగనన్న వల్ల ప్రతిసారీ ఇబ్బంది పడితే, అప్పుడు బటన్లు పనిచేస్తాయా? తమను ఇబ్బంది పెట్టిన వైనం పోలింగు రోజున.. ప్రత్యర్ధి పార్టీలు గుర్తు చేస్తే, ఆ ప్రభావం వారిపైన ఉండదా? అన్నది వైసీపీ శ్రేణుల ఆందోళన. ఆ మేరకు వారి విశ్లేషణ, ఆవేదన ఆలోచనాత్మకంగానే కనిపిస్తోంది.

అదెలాగంటే.. పాదయాత్రతో సీఎం అయిన జగనన్న, ముఖ్యమంత్రి అయిన తర్వాత జనంలోకి రావటం మానేశారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు జనంలోనే ఉండేవారు. ఇప్పుడు సీఎంగా ఎక్కువకాలం తాడేపల్లి క్యాంపు ఆఫీసుకే పరిమితం అవుతున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్లు దిక్కులేదు కాబట్టి, ఇక పార్టీ నాయకుల దర్శనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పార్టీ వ్యవహారాలను సమన్వయకర్తలకు వదిలేసి, తాను సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే గత కొంతకాలం నుంచీ జగనన్న అధికార కార్యక్రమాల కోసం జనంలోకి వస్తున్నారు. ఇది వైసీపీ శ్రేణులను సంతోషపరుస్తున్నా… ఆ సందర్భంలో పోలీసుల అత్యుత్సాహం, ప్రజలను పార్టీకి దూరం చేసే స్థితికి చేరిందని వైసీపీ సీనియర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఇది రాను రాను ఒక అలవాటుగా మారడంతో.. ‘జగనన్న బయటకు రాకపోవడమే మంచిద’న్న అభిప్రాయం, పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయింది.

సీఎం వస్తున్నారంటే సహజంగా ఆ పార్టీ శ్రేణులు, నాయకులకు ఆనందం కలిగించాలి. ఎందుకంటే అక్కడ తమ వ్యక్తిగత ఇమేజ్, పార్టీ విస్తృతి పెరుగుతుంది కాబట్టి! దానికోసం బోలెడంత హంగామా చేస్తుంటారు. ఫ్లెక్సీలతో ఊరిని ముంచెత్తుతారు. భారీ స్థాయిలో జనాలను తరలిస్తుంటారు. సదరు సీఎం కూడా దారిన పోయే జనాలకు ముకుళిత హస్తాలతో అభివందనం చేస్తుంటారు. సీఎం పర్యటనంటే ఊరంతా హడావిడే. పక్క ఊర్ల నుంచి వచ్చే జనాలతో ఆరోజు తమకు పండగేనని హోటల్, బార్, రెస్టారెంట్లు, కిరాణా, ఫ్యాన్సీ, బట్టల దుకాణాల యజమానులు తెగ సంతోషిస్తారు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సీఎం పర్యటనల్లో సహజంగా కనిపించే దృశ్యాలే.

కానీ వైసీపీ విషయంలోనే ఇది పూర్తి రివర్సుగా మారడం, ఆ పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. సీఎం జగనన్న వస్తున్నారంటే షాపు యజమానుల నుంచి, సామాన్యుల వరకూ తీవ్ర ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. జగనన్న వచ్చి- వెళ్లేవరకూ రోడ్లమీదకు పోకుండా, ఇళ్లవద్ద అడ్డంగా బారికేడ్లు కడుతున్నcm-tour1దురవస్థ. అప్పటివరకూ జనం ఇళ్లలో ఉండాల్సిందే. జగనన్న పర్యటన ముగిసేంతవరకూ, షాపులు తెరవకూడదన్న హుకుం. దానితో ఆరోజు వ్యాపారం హారతికర్పూరమేనన్న వ్యాపారుల ఆవేదన.

అసలు జగనన్న పర్యటనకు వచ్చేముందు- వెళ్లే సమయంలో జనం ఎవరూ అటు ఇటు, ఎదురుగా ఎవరూ రాకూడదన్న విచిత్ర నిబంధనలు, ప్రజల్లో పార్టీపై వ్యతిరేక పెంచుతున్నాయన్నది, వైసీపీ నేతల ‘ఆందోళనతో కూడిన ఆవేదన’’. అయితే సీఎం పర్యటనలో షాపులు మూయించి, ఇళ్ల వద్ద బారికేడ్లు కట్టి జనాలను రోడ్డుమీదకు రాకుండా చేస్తున్న పోలీసులు.. వైన్‌షాపులను మాత్రం అనుమతించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒంగోలులో ఒక కుటుంబం కారులో తిరుమల వెళుతుంటే, ఆర్టీఏongolecm-tourఅధికారులు ఆ కుటుంబాన్ని దింపేసి, కారును స్వాధీనం చేసుకుని జగన్ పర్యటనకు వెళ్లిన వైనం వైసీపీనే కాకుండా, జగనన్న వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసింది.

ఈ విధంగా ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. తమ అధినేత జగనన్న పర్యటన, తమ చావుకొచ్చిపడిందని వైసీపీ జిల్లాల నేతలు తలపట్టుకుంటున్నారు. లోకల్‌గా తమ ఇమేజీ దారుణంగా డామేజీ అవుతోందని వాపోతున్నారు. తాజాగా సీఎం జగనన్న యధావిధిగా.. ఒంటరిగానే బెజవాడ కనకదుర్గమ్మకు వస్త్రాలుjagan-durga-templeసమర్పించారు. సంతోషం. అమ్మవారిని దర్శించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. జంటగా కాకున్నా, ఒంటరిగానయినా వచ్చినందుకు అభినందిస్తారు. పైగా సీఎం కాబట్టి, ఆయనకు ప్రొటోకాల్ కూడా ఉంటుంది. కానీ, ఆయన వచ్చి- వెళ్లేవరకూ గంటలపాటు క్యూలైన్లలో ఉన్న భక్తులు సొమ్మసిల్లిపడిపోయారు. ఆలస్యం అయ్యేకొద్దీ సహనం నశించిన భక్తులు, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇది సహజంగానే సోషల్‌మీడియాలో పాకిపోయింది.

వీవీఐపీలు ఆలయాలకు వచ్చే సందర్భంలో.. భక్తులు ఇబ్బందులు పడటం ఎక్కడయినా సహజమే అయినప్పటికీ, సీఎం జగనన్న దుర్గగుడి తాజా పర్యటన ఆలస్యం కావడం, భక్తుల్లో ఆయనపై వ్యతిరేకతకు కారణమయింది. సహజంగా సీఎం వచ్చేంతవరకూ, ఏ ఆలయాల్లోనయినా దర్శనాలు కొనసాగిస్తారు. వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆయనకు ప్రధానాలయంలో సమయం కేటాయిస్తారు. అది కూడా పది, పదిహేను నిమిషాలకు మించదు.

కానీ ఇప్పుడు సీఎం వచ్చేంతవరకూ దర్శనాలు నిలిపివేయడమే విమర్శలకు దారితీస్తోంది. సీఎం పర్యటనల్లో కూడా వచ్చి-పోయే ముందు పది నిమిషాలు ట్రాఫిక్ ఆపేసి, వెళ్లిన తర్వాత పునరుద్ధరిస్తారు.cm-tour2అంతేగానీ జనాలను ఇళ్ళనుంచి బయటకు రాకుండా.. ఎప్పుడూ నిలిపివేసిన సందర్భాలు, షాపులు బలవంతంగా మూయించిన అనుభవాలు లేకపోవడం కూడా, జగనన్నపై విమర్శల వెల్లువకు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనిపై సీఎం పునరాలోచించాలన్నది వారి మనోగతం.

జగన్‌కు సీఎం హోదాలో భద్రతకు కొదువలేదు. పైగా రాష్ట్రంలో నక్సలైట్లు-ఉగ్రవాదుల ఉనికి లేనందున, ఆ కోణంలో కూడా భయపడాల్సిన పనిలేదు. ఫ్యాక్షనిజం కూడా అంతరించినందువల్ల, వారి నుంచి కూడా భయం లేదు. విపక్షాల నుంచి నిరసనలు సహజం. వారిని ఎలాగూ గృహనిర్బంధాలు చేస్తున్నారు కాబట్టి, వారి నుంచే భయం కూడా లేదు. యువకుల్లో చైతన్యం చచ్చిపోయి చాలా దశాబ్ధాలయిపోయింది కాబట్టి వారిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఏ కోణంలో జగనన్న పర్యటనలకు, ఇంత హడావిడి చేస్తున్నారన్నది వైసీపీ నేతలకూ అంతబట్టకుండా ఉంది.

అంతకుముందు సీఎం జగనన్న.. తిరుపతిలో గంగమ్మ ఆలయాన్ని దర్శించిన సందర్భంగా కూడా, పోలీసులు ఆయన వచ్చే వరకూ ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. దానితో భక్తులు కొన్ని గంటలపాటు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆలయ పరిసరాల్లోని దుకాణాలన్నీ, ఉదయం నుంచే మూసివేయించారు. ఫలితంగా వారి ఆదాయాన్ని దెబ్బతీసినట్లయింది. శ్రీకాళహస్తి దేవాలయంలో కూడా దేవదాయ శాఖమంత్రి వచ్చే వరకూ, దర్శనాలు నిలిపివేయడంతో.. భక్తులు తిరగబడి, మంత్రిగారికి క్లాసు పీకిన వైనం సోషల్ మీడియాలో చూసినవే.

వైజాగ్‌లో సీఎం జగనన్న పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహంతో, ఎయిర్‌పోర్టుకు చేరాల్సిన ప్రయాణికులు.. బ్యాగులతో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వైనం, సోషల్‌మీడియాలో అంతాVizag-airport-Jagan-visit దర్శించినదే. పక్కనే ఉన్న గుంటూరు పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, అక్కడ రోడ్డుకు ఒకవైపు బారికేడ్లు కడుతున్న ఇబ్బందికర పరిస్థితిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గుంటూరులో సీఎం పర్యటన ముగిసిన తర్వాత వ్యాపారులు, స్థానికులు తమను చుట్టుముట్టి నిరసన ప్రకటిస్తుంటే.. మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ ఎమ్మెల్యే తన నిస్సహాయత వ్యక్తం చేశారు. నిత్యం జనసమ్మర్ధం, వ్యాపారాలతో బిజీగా ఉండే గుంటూరు లాంటి నగరంలో, ప్రజాప్రతినిధులు సీఎం పర్యటనతో ఎదుర్కొంటున్న విమర్శలకు ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఇవన్నీ అప్పటికప్పుడు న్యూస్‌చానెళ్లు, సోషల్‌మీడియా, ఉదయం పత్రికల్లో ఫొటోలతో సహా వస్తున్నా ఎవరూ స్పందించకపోవడమే వైసీపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. సహజంగా మీడియాలో వచ్చే విమర్శలపై సీఎంలు స్పందిస్తారు. ఆ విమర్శలు వ్యక్తిగతంగా తమపైనే అయితే తర్వాత జాగ్రత్త పడుతుంటారు. తరువాతి పర్యటనలో ఆ లోపాలు జరగకుండా చూసుకుంటారు. ఆ మేరకు సీఎంఓ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఆదేశాలిస్తుంటారు. డీజీపీని పిలిచి, పోలీసులను సంయమనం పాటించాలని సూచిస్తుంటారు. ఒకవేళ అవి అబద్ధాలయితే ఖండన ప్రకటనలు పంపిస్తుంటారు. ఇది ఎక్కడైనా, ప్రభుత్వంలోనయినా జరిగేదే.

కానీ సీఎం జగనన్న ప్రతి పర్యటనలో, ‘ఇదొక అలవాటు’గా మారుతుండటం.. వైసీపీ నేతలకు స్థానికంగా ఇబ్బందికరంగా మారింది. ఇదంతా సీఎం జగనన్నకు తెలిసే జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? జగనన్న ఆదేశాల ప్రకారమే పోలీసులు ప్రజలను ఇబ్బందిపెడుతున్నారా? లేక పోలీసులే అత్యుత్సాహంతో, సీఎం భద్రత పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? అన్న అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఒకవేళ సీఎంకు తెలియకుండా జరిగితే.. న్యూస్‌చానెళ్లు, పొద్దునే పేపర్లు చదివే సీఎంకు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? ఒకవేళ తనకు సంబంధం లేకపోతే, పోలీసులు ఇకపై తన పర్యటనలకుcm-tour హడావిడి చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలి కదా? అంటే ఇదంతా సీఎంకు తెలిసే జరుగుతున్నట్లు అర్ధం చేసుకోవాలన్నమాట. మరి అలాగేయితే దానివల్ల పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని, సీఎం ఆ మాత్రం ఊహించలేదా? అన్న ప్రశ్నలు వైసీపీ నేతల మస్తిష్కాన్ని తినేస్తున్నాయి.

అటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా.. స్థానికులంతా సీఎం పర్యటనలో పడ్డ ఇబ్బందులను గుర్తుచేసి తమను విమర్శిస్తుండటం, విపక్షాలు కూడా దానిని ఆయుధంగా మార్చుకుని తమపై ఎదురుదాడి చేయడాన్ని, అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానితో అసలు సీఎం పర్యటన.. తమ నియోజకవర్గంలో జరగకపోతే బాగుండని కోరుకుంటున్న వైచిత్రి ఏపీలో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE