– ఎన్డీయేకు జైకొట్టిన జగన్
– బెయిళ్లు, కేసుల భయమే కారణమా?
– తాజాగా సుప్రీంలో వివేకా కేసు విచారణ
– సునీత దంపతులు, రాంసింగ్‌కు విముక్తి
– నిందితులపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
– ఓ వైపు ఏపీలో ఎన్డీయే కూటమిపై విమర్శలు
– ఉపరాష్ట్రపతి ఎన్నికలో అదే ఎన్డీయేకు మద్దతు
– గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సింహం సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి.. అన్న ఎవరికీ భయపడడు.. తలవంచడం అన్న చరిత్రలోనే లేదు.. సోనియాకే తలవంచని వీరుడు..అసలు అన్న పుట్టిన తర్వాతనే విలువలు-విశ్వసనీయత అనే పదాలు పుట్టాయి.. కేంద్రం మెడలువంచాలంటే అన్ననే గెలిపించాలి.. ఇలాంటి భుజకీర్తులన్నీ జగనాభిమానుల నోటి వెంట తరచూ వినిపించేవే. అంటే జగనన్న ఎవరికీ భయపడరన్నది వారి కవిహృదయమన్నమాట.
కానీ వాస్తవంలో అది పూర్తిగా రివర్సని ఉప రాష్ట్రపతి ఎన్నిక మరోసారి నిరూపించింది. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే ఎంపిక చేసిన రాధాకృష్ణన్ అభ్యర్ధిత్వాన్ని వైసీపీ తాదాత్మ్య హృదయంతో బలపరిచింది. కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, జగన్‌బాబుకు ఫోన్ చేయడమే ఆలస్యం.. ఓస్ అదెంత పని? మీకు మద్దతునివ్వడం మాకు మహద్భాగ్యమని సుబ్బారెడ్డి బాబాయ్‌తో మద్దతు ప్రకటి ం చేశారు.
కాకపోతే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాజ్‌నాధ్‌సింగ్‌తో అన్నట్లు మీడియాకు లీకులిచ్చారు. మరి జగన్‌బాబు ఏ పార్టీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నదే ప్రశ్న. ఎందుకంటే సొంత పార్టీ ఎంపీలతో చర్చించినట్లు వైసీపీ ప్రకటన, ఫొటోలేమీ విడుదల చేయలేదు. కాబట్టి సొంత పార్టీలో చర్చించలేదని అర్ధమవుతూనే ఉంది. బహుశా బీజేపీతో చర్చించి, తుది నిర్ణయం తీసుకుని ఉండాలి.బాబాయ్ సుబ్బారెడ్డి ప్రకటన చూసిన మెడపై తల ఉన్న ఎవరికయినా ఇదే అర్ధమవుతుంది మరి!
నిజానికి గతంలో రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి వింత పరిస్థితి ఉండేది. రాజకీయంగా వైసీపీ-టీడీపీ ప్రత్యర్ధులు. కానీ రెండు పార్టీలూ ఎన్డీయేకు మద్దతునిచ్చిన వైచిత్రి. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్ధులకు వైసీపీ నిర్భయంగా మద్దతు ప్రకటించింది. నిజానికి వైసీపీ అప్పుడు, ఇప్పుడూ ఎన్డీఏ భాగస్వామి కాదు.
అదే సమయంలో ఎన్డీయే భాగస్వామి కాని టీడీపీ కూడా, ఇప్పటి వైసీపీ మాదిరిగా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతునిచ్చింది. ఆ సందర్భంలో కేసుల భయానికే టీడీపీ నాయకత్వం ఎన్డీయేకు మద్దతునిచ్చిందని, వైసీపేయులు విమర్శించారు. సరే..మొత్తానికి బీజేపీ అప్పుడు తెలివిగా ఇద్దరి ఓట్లూ వేయించుకుని, రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకుంది. ఇప్పుడూ అదే పరిస్థితి అనుకోండి. అది వేరే వ్యవహారం.
మరి టీడీపీపై నాటి వైసీపీ విమర్శలే నిజమైతే.. ఇప్పుడు వైసీపీ కూడా బెయిళ్లు, కేసులకు భయపడే బీజేపీకి సాగిలపడిందనుకోవాలి కదా? బీజేపీతో ఏ బాదరాయణ బంధం లేకపోతే, ఆ పార్టీ అభ్యర్ధికి ఓటేయాల్సిన అవసరం జగనన్న పార్టీకి ఏం వచ్చింది? సరే షెల్లెమ్మ షర్మిల కాంగ్రెస్‌లో ఉంది కాబట్టి, షెలెమ్మ పార్టీకి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. తాను రెండు పార్టీలకూ దూరమని ఎన్నికలకు దూరంగా ఉంటే వైసీపీ పాతివ్ర త్యానికి కితాబులు దక్కేవి.
కానీ సరిగ్గా వివేకా హత్య కేసు కూడా ఉప రాష్ట్రపతి ఎన్నిక ముందు విచారణకు రావడం.. సునీత దంపతులతోపాటు, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను కూడా సుప్రీంకోర్టు కేసుల నుంచి విముక్తులను చేయడం.. విచారణపై చేసిన తీవ్ర వ్యాఖ్యల తీరు కూడా, పులివెందుల పులన్న ఢిల్లీకి సాగిలపడేందుకు ప్రధాన కారణాలన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. మరి జగనన్న సింహం, పులి, ఏనుగు ఎట్లవుతారప్పా?
నిజానికి ఇది రాష్ట్రంలో తన పార్టీకి కొంతవరకూ దూరమైన ముస్లిములు, వామపక్షాలకు పూర్తిగా దగ్గరయ్యేందుకు వచ్చిన అనుకోని అవకాశం. కాంగ్రెస్-బీజేపీకి దూరంగా ఉండటం ద్వారా, తాను ఎవరికీ భయపడని హీరోనన్న సంకేతం ఇచ్చేందుకు సరైన సమయం. దానితో ఎస్టీ ఎస్టీ మైనారిటీల దన్ను పూర్తి స్థాయిలో సంపాదించుకునే మహత్తర అవకాశం. ఒకేసారి వచ్చిన ఇన్ని అవకాశాలను కాదనుకుని.. కమలం పార్టీకి మద్దతునిచ్చారంటే, జగన్ బీజేపీకి జంకుతున్నారనుకోవడంలో తప్పేమిటన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
అసలు జగన్ పార్టీ ఎన్డీయే అభ్యర్థికి ఏ ప్రాతిపదికన మద్దతునిచ్చిందన్నది ప్రశ్న. టీడీపీ-జనసేన అంటే ఎన్డీయే భాగస్వామ్యపార్టీలు కాబట్టి, రాధాకృష్ణన్‌కు మద్దతునిచ్చాయనుకోవచ్చు. అది పొత్తు ధర్మం కూడా! మరి వైసీపీతో ఎన్డీయేకు ఎలాంటి బీరకాయపీచు- వేలువిడిచిన బంధం కూడా లేదాయె?! పైగా ఏపీలో ఆ మూడు పార్టీలు కలిసే అధికారంలో ఉన్నాయి. ఆ ప్రకారంగా.. మరి ఏపీలో కూటమి సర్కారు నిర్ణయాలను కూడా అదే విధంగా బలపరచాలి కదా?
మరి కూటమి నిర్ణయాలకు ఎందుకు మద్దతునివ్వడం లేదు? అందుకు విరుద్ధంగా రోజూ కూటమికి చావురేవు పెడుతూ, మళ్లీ అదే కూటమి నిలబెట్టిన అభ్యర్ధికి మద్దతునివ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అంటే కూటమిలో బీజేపీ-టీడీపీ వేర్వేరని జగన్ కవి హృదయమా?
లేక ‘ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి’ సామెత మాదిరిగా, ఏ లెక్కకాలెక్క అన్నది జగన్ భావమా? పోనీ ఇవన్నీ కాకపోతే.. తెలుగుతమ్ముళ్లు అనుమానిస్తున్నట్లు, తనతో బీజేపీ పాత తెరచాటుబంధం ఇంకా కొనసాగుతుందన్న సంకేతమా? అందుకే తన కేసులు తెమల్చకుండా విజయవంతంగా నాన్చుతూ, తమ్ముడు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలేస్తున్నారని చెప్పకనే చెప్పడమా? నిజం ‘జగన్నాధు’డి కెరుక.