Suryaa.co.in

Andhra Pradesh

జగన్ గారూ.. దళిత ద్రోహిగా మిగులుతారు జాగ్రత్త

– సీఎంకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకోలేకపోతే ఏపీ సీఎం జగన్ చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోక తప్పదని టీడీపీ పొలిట్‌బ్యూరూ సభ్యుడు వర్ల రామయ్య హెచ్చరించారు. ఆ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. లేఖ పాఠం ఇదీ..
4-1-2022
బహిరంగ లేఖ
గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్రాయు బహిరంగ లేఖ

అయ్యా!
భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు ముగిస్తున్నా, కొన్ని చోట్ల దళిత అట్టడుగు వర్గాల పరిస్థితి ఆనాటి పరిస్తితులనే స్ఫురింప చేస్తున్నవి. కుల వివక్షత, అంటరానితనం లాంటి సామాజిక రుగ్మతలు భారతదేశం నుంచి తరిమికొట్టాలన్న ఉద్దేశంతో అనాదిగా ఎందరో సంఘ సేవకులు పరితపించి, పాటుపడి వారి జీవితాలు అంకితం చేశారు. చివరిగా, ఈ సామాజిక రుగ్మతలు పాటించడం చట్టరీత్యా నేరమని భారతదేశ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ మన దేశ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆనాటి నుండి కాలక్రమేణా వస్తున్న మార్పులతో మన దేశంలో ఈ సామాజిక రుగ్మతలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.

ముఖ్యంగా అంటరాని వర్గాలుగా పరిగణించబడే దళితులకు పార్లమెంటు, శాసనసభలో కూడా పోటీ చేసే అవకాశాన్ని రిజర్వేషన్ల ద్వారా కల్పించడంతో ఈ సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టినట్లైంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కుల వివక్షత, అంటరానితనం, దళితులకు ఆలయప్రవేశ నిరాకరణ, కొన్ని హోటళ్లలో రెండు గ్లాసుల విధానం లాంటి సామాజిక రుగ్మతలు కూకటివేళ్లతో పెకలించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అధికారంలో ఉండగా జస్టిస్ పున్నయ్య కమీషన్ వేయడం, వారి సూచనల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను ఏర్పాటు చేయడం తద్వారా పీడిత వర్గాల హక్కుల పరిరక్షణ సజావుగా సాగింది.

కానీ, అదృష్టమో, దురదృష్టమో మీరు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన చేపట్టిన నాటి నుంచి దళితుల పట్ల పూర్వస్థితులు పునరావృతమై, ఈ వర్గాలపై దాడులు గణనీయంగా పెరిగినవి. మాస్కులివ్వండీ అని అడిగిన దళిత వర్గానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు చావు చూశాడు. ఇసుక మాఫియా ఆగడాలను ప్రశ్నించిన దళిత ‍యువకుడికి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారు. మద్యంమత్తులో అధిక రేట్లను ప్రశ్నించిన దళిత యువకుడు చనిపోయాడు. మాస్క్ పెట్టలేదన్న కారణంతో పోలీసులు ఓ దళిత యువకుడిని చచ్చేంత వరకు కొట్టారు. దళిత మహిళలపై దాడుల పెరిగాయి. దళిత బాలికను సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందే పడేశారు. ఈ రకంగా వేల సంఖ్యలో దళిత వర్గాలపై దాడులు పెరిగి ఈ వర్గాలకు పాత కాలాలను గుర్తు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలంలో బ్రహ్మపురి గ్రామంలో మనువాద స్మృతులను గుర్తు చేస్తూ దళిత వర్గాల విద్యార్ధులను, అగ్రవర్గాల విద్యార్ధులను వేరు చేస్తూ కుల వివక్షత పాటించడం క్షమింపరాని నేరం. ఆ జిల్లా కలెక్టర్ తో సహా పాలన యంత్రాగం కులవివక్షతను, అంటరానితనాన్ని పాటించినట్లే లెక్క. వారి చర్య చట్టరీత్య శిక్షార్హం.

ముఖ్యమంత్రిగా మీకు ఏ మాత్రం అంటరానితనాన్ని, కుల విక్షతను దూరం చేయాలన్న ఉద్దేశం ఉంటే, మనువాదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన లేకపోతే వెంటనే ఈ బ్రహ్మపురి పాఠశాలలో జరుగుతున్న ఈ ఘోరమైన చర్యపై, ఈ నీతిమాలిన చర్యపై, ఈ చట్ట వ్యతిరేక చర్యపై ఒక కమీషన్ వేసి బాధ్యులందరినీ క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అరెస్టు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు దళిత వర్గాల నమ్మకాన్ని కోల్పోయారు. ఈ బ్రహ్మపురి పాఠశాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే మీరు చరిత్రలో “దళిత ద్రోహి”గా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను

ఇట్లు
వర్ల రామయ్య
జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు
తెలుగుదేశం పార్టీ

LEAVE A RESPONSE