తాజాగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ..
తేదీః07-05-2022
బహిరంగ లేఖ
గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
అమరావతి
విషయం- అకాల వర్షాలకు అపార పంట నష్టం – ఈదురుగాలులు, వడగండ్ల వానలతో మామిడి, సపోటా, నిమ్మ తోటలకు నష్టం – నష్టపోయిన రైతులను ఆదుకోవడం – త్వరితగతిన పంట నష్టం అంచనా – పరిహారం చెల్లింపు గురించి
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురు గాలులతో రైతులు నష్టపోయిన విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. గత పది రోజులుగా కురిసిన వర్షాలతో పండ్ల తోటలు, వరి, మిర్చి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఇప్పటికే వరుస విపత్తులతో పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు ఈ అకాల వర్షాలు మనోవేదనకు గురిచేశాయి.
గుంటూరు, చిత్తూరు, నెల్లూరుతో పాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, మిర్చి, రాగి పంటలకు, మామిడి, నిమ్మ, సపోటాతోపాటు ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబెట్టారు. వర్షానికి ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పల్నాడు జిల్లాలో కళ్లాల్లో ఉన్న చివరి కోత మిరప తడిసింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో కోతకొచ్చిన మామిడి నేలరాలింది. గాలివానకు అరటిచెట్లు పడిపోయాయి. చిత్తూరు జిల్లా కుప్పం, తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ మామిడికి నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీచిన బలమైన ఈదురుగాలులకు పలు ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. కొత్తగా వచ్చిన పంటలు నేలరాలిపోయాయి. బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు ప్రాంతాల్లో వర్షం ధాటికి శనగ పంటకు నష్ట వాటిల్లింది. చేతికొచ్చిన పంట మట్టిపాలవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గత మూడేళ్లుగా అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ఓ వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా.. మరోవైపు ప్రకృతి విపత్తులకు పెద్దఎత్తున పంట నష్టం జరిగి బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు మాటలకే పరిమితమైంది. గత మూడేళ్లలో 9 తుఫాన్ల ధాటికి సుమారు 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 20వేల కోట్ల పంట నష్టం జరగగా.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదు.
ఇప్పటికైనా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకోవాలి. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
(కింజారపు అచ్చెన్నాయుడు)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు