అసలు ఆత్రేయ పాట లేని
తెలుగు సినిమా
అన్నీ ఉన్నా అంగట్లో “శని”మా
ఆ కలం శక్తిసంపన్నం
ఆయన పాటలతో సినిమా సుసంపన్నం..!
నీ భాషలో..నా భాషలో
మన మనసు ఘోషలో
పాట రాస్తే అది ఆత్రేయ
ఆయన చెయ్యి
పాటల అక్షర పాత్రేయ..!
భాషను మించి భావం..
ఆత్రేయకేనేమో సంభవం..
నువ్వు నేను అనుకునే మాటలే
పాటలైతే ఆ పాటవం
ఆత్రేయ కలానిదే..
తెలుగు సినిమా పాటలో
మూగమనసు..మంచి మనసు
ఆ మనసు సొగసు
అదంతా ఆత్రేయకే తెలుసు
ఆ కవికి మనసంటే
ఎంత అలుసు..
అప్పుడప్పుడు ఆయన దృష్టిలో విరిగిన ఇరుసు..
ఇంకోసారి గొప్ప మజా ఇచ్చే చేపల పులుసు..!
నీ పాటే కాదు కోడెనాగునే
అదుపు చేసిన
నీ మాటా సూపరే..!
మనసు గతి ఇంతే..
మనిషి బ్రతుకింతే..
మనసున్న మనిషికీ
సుఖములేదంతే..
ఏమయ్యా ఆత్రేయా..
రాసి జనాల్ని
రాయక నిర్మాతల్ని ఏడిపించావు కదయ్యా..
నీ రచన..
మహదేవుడి స్వరకల్పన..
ఘంటసాల వచన..
ఎఎన్నార్ నటన..
ఆయన గొంతులో జీర..
ఈయన కంటిలో ధార..
వాణిశ్రీలో తరగని గీర..
లేని మనసుతో
మాయ చేశారు కదయ్యా..
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది ..
వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవి..
నీ పాటలే
దసరాబుల్లోడి సందడి
అక్కినేని,ఓణిశ్రీ హడావిడి..
ఎవరి కోసం ఎవరి కోసం
ఈ ప్రేమమందిరం..
ఈ శూన్య నందనం..
ఆ గీతాలే కళ్యాణ్ బాబు
భగ్నహృదయం,అగ్నిగుండం!
ఇలాంటి పాటలెన్ని రాసినా
నీకిష్టమైన పాట..
నేనొక ప్రేమ పిపాసిని
నీవొక ఆశ్రమవాసివి
ఏదేమైనా ఇలాంటి
మధురగీతాలతో
నువ్వు మనసుల్లో
శాశ్వత నివాసివి…
నీకు ముందు..తర్వాత ఎందరు కవులున్నా
నీ పాటలే
అద్భుత రాశివి..వాసివి..!
(మనసుకవి ఆత్రేయ జయంతి సందర్భంగా నివాళి..)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286