Suryaa.co.in

Editorial

ఏబీవీ ఓటూ తీసేశారు!

– డిసెంబరు వరకూ ఓటర్ల జాబితాలో
– జనవరి తర్వాతనే మాయం
– దంపతులిద్దరి పేర్లూ గాయబ్
– నోటీసులు ఇవ్వలేదన్న ఏబీ
– తేల్చుకుంటానని స్పష్టీకరణ
– గ తంలో నిమ్మగడ్డ ఓటునే తొలగించిన జగన్ సర్కారు
– ఇప్పుడు ఆ జాబితాలో ఏబీవీ
– ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కారు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వేధించిన జగన్ సర్కారు.. చివరకు ఆయన ఓటు కూడా తీసేసి, వికృతానందం పొందిన వైనమిది. వినడానికి వింతగానే ఉన్నా ఇది నూరుకునూరు పాళ్లు నిజం. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోని పంటకాలువ రోడ్‌లో నివసిస్తున్నారు. ఆ మేరకు ఆయనకు అక్కడ ఓటు కూడా ఉంది. డిసెంబరు వరకూ ఆయన, భార్య ఓట్లూ భద్రంగానే ఉన్నాయి. కానీ జనవరిలోనే ఆయన ఓటు మాయమయింది.

తన ఓటు ఎక్కడికీ పోదన్న ధీమాతో.. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లిన భార్యాభర్తలు, ‘మీ ఓటు లేదన్న’ సమాధానంతో ఖంగుతినాల్సి వచ్చింది. అయితే ఆయన సస్పెండ్ అయినప్పటికీ, ఏబీ కార్యస్థానం విజయవాడనే అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఏబీవీ స్థానికుడే.

‘‘ఒకవేళ నేను అక్కడ నివసించడం లేదని అధికారులు భావించి ఓటు తొలగించాలనుకుంటే ముందుగా నాకు నోటీసులు ఇవ్వాలి కదా? కనీసం అందులో ఉన్న నా ఫోన్‌నెంబరుకయినా ఫోన్ చేసి మాట్లాడాలి కదా? ఇవేమీ చేయలేదంటే, ఇదంతా కావాలని చేసినదే నని అర్ధమవుతుంది. దీనిని నేను తేలిగ్గా విడిచిపెట్టను. నా ఓటు ఎందుకు తొలగించారన్నది తేలుస్తా’’నని ఏబీ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ఏబీ అప్రమత్తంగా ఉండకపోవడమే ఆశ్చర్యం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓగా పనిచేసిన, నిమ్మగడ్డ రమేష్ అంతటి అధికారి ఓటునే జగన్ సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించింది. దానితో ఆయన న్యాయపోరాటం చేసి, తన ఓటును తిరిగి సాధించుకోవలసి వచ్చింది.

అలాంటిది ఐదేళ్లపాటు పోస్టింగ్ ఇవ్వకుండా, ఊస్టింగ్ చేసి, కోర్టు చెప్పినా జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ సర్కారు.. తన ఓటును మాత్రం ఉంచుతుందని, ఏబీవీ ఆశించడమే అత్యాశ. జగన్ సర్కారు మనస్తత్వం అనుభవంలో బాగా తెలిసి కూడా.. ఆయన ఈగోకు బలైపోయిన తర్వాత కూడా.. తన ఓటును ఉంచారా? లేదా అని, ఏబీవీ తనిఖీ చేసుకోకపోవడం ఆశ్చర్యం!

రాజ్యహింస అని ఒకప్పుడు పోలీసులను, వామపక్ష పార్టీలు విమర్శించేవి. ఇప్పుడు చివరకు పోలీసులే, ప్రభుత్వాన్ని రాజ్యహింస అని విమర్శించే రోజులొచ్చినట్లున్నయన్నది మేధావుల ఉవాచ.

LEAVE A RESPONSE