- ఆయన ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి
- జగన్ మాటలకీ చేతలకీ పొంతన ఉండదు
- దళితులపై దాష్టీకాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలిపాడు
- అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టరాదు
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
- ఒక మాట అటూఇటూ అయినా పొత్తులోనే ముందుకు వెళ్తాం
- రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు
- రిపబ్లిక్ డే సందర్భంగా రెండు స్థానాల ప్రకటన
- మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
‘ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే… రానున్న సార్వత్రిక ఎన్నికల తరవాత జగన్ నడిపించే ఈ ప్రభుత్వం కనబడకూడదు. జగన్ విధానాలు, ధోరణి ప్రజల్ని ఇబ్బందిపెడుతున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిచాడు. కనీసం విమర్శను కూడా స్వీకరించలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టకూడద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం పాలనలోకి వస్తుందన్నారు. ఒక మాట అటు ఇటు అయినా టీడీపీతో పొత్తులోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోమని, స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఇరు పార్టీలు కలిసే ముందుకు వెళ్తామని అన్నారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రాజోలు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. జగన్ ప్రభుత్వంలో మాట్లాడకూడదు అంటారు? తిట్లు భరించడం, విమర్శలు స్వీకరించగలగడం నాయకుడి లక్షణం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త ఎక్కువ తీసుకోగలగాలి. తనకు ఎవరూ ఎదురు తిరగకూడదు, మాట్లాడకూడదు అంటే… ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం. జగన్ స్వామ్యం అసలే కాదు. దాష్టీకాలు మితిమీరితే ప్రజలు ఎదురుతిరుగుతారు. వినాలి… భరించాలి… ప్రజలు పద్దతులు మార్చుకోమని చెబితే మార్చుకోవాలి.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినవారిని ఊరేగిస్తారు
ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. సగటు మహిళ ఒకరు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే.. నిరసనకారులతో కలిపి అరెస్టు చేసి హత్నాయత్నం కేసు పెట్టేశారు. ఈ ప్రభుత్వంలో జరిగే దాష్టీకాలు ఎలా ఉంటాయంటే.. ఒక వైపు అంబేద్కర్ విగ్రహం పెడతారు. ఇంకో వైపు దళిత వ్యక్తిని చంపి ఇంటికి ప్యాక్ చేసిన వ్యక్తిని ఊరేగిస్తారు. చేతలకీ మాటలకీ పొంతనే ఉండదు. ఈ ప్రభుత్వంలో దళితులకు సంబంధించిన 23 పథకాలు తీసేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితుల పథకాలు తీసేయడం వల్ల ప్రయోజనం ఏంటి? డాక్టర్ సుధాకర్ కోవిడ్ సమయంలో మాస్కులు లేవని చెప్పినందుకు పిచ్చోడిని చేసి చంపేశారు. దేశంలోనే దళితులపై అత్యధిక దాడులు జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎక్కువ అట్రాసిటీ కేసులు పెట్టిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. ఇలాంటి పరిస్థితుల వల్లే బీసీల రక్షణకి ప్రత్యేక చట్టం కావాలనే అంశం తెరమీదకు వచ్చింది.
జగన్ అనే ఈ వ్యక్తి మాటిస్తాడు ఏదీ నిలబెట్టుకోడు. మద్యపాన నిషేధం విధిస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం వ్యాపారి అయిపోయాడు. ఈయన ముఖ్యమంత్రో మద్యం వ్యాపారో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో 30 వేల మంది ఆడ పిల్లలు అదృశ్యం అయిపోయారు. కనీసం ఎందుకు అదృశ్యమయ్యారన్న వివరణ కూడా ఇవ్వరు. అకారణంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించడం, బెదిరించడం మాత్రమే చేస్తారు.
ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి… అర్థం చేసుకోవాలి
నిన్న మండపేట నియోజకవర్గం నుంచి కొంత మంది నాయకులు వచ్చి నన్ను కలిశారు. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు మండపేట అసెంబ్లీ సీటును ప్రకటించేశారని బాధపడ్డారు. వారి మాటలతో నేను ఏకీభవించి, ఇలా జరిగి ఉండకూడదని క్షమాపణలు చెప్పాను. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు . ఆయనకు ప్రత్యేక పరిస్థితులు ఉండి ఉంటాయి. గబుక్కున్న ఒక మాట అనేలా చేస్తుంది. అది మనం అర్ధం చేసుకోవాలి. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. మొన్నటికి మొన్న లోకేష్ మా నాన్న ముఖ్యమంత్రి అని మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను పెద్ద మనసుతో స్పందించలేదు. ‘వాళ్లు పొత్తు ధర్మం మరిచిపోయి మాట్లాడుతున్నారు. మీరు కూడా మాట్లాడొచ్చు కదా’ అని కొంతమంది మాట్లాడుతున్నారు. పొత్తును ఇబ్బందికి గురి చేసేలా మాట్లాడం చాలా తేలిక. నిలబెట్టడం చాలా కష్టం.
జగన్ సొంత చెల్లినే వదల్లేదు
జనసేన ఎందుకు సింగిల్ గా వెళ్ల కూడదు అన్న ప్రశ్న కొంత మంది నుంచి తలెత్తింది. మనం బలాన్ని ఇచ్చేవాళ్లమవుతున్నాం, తీసుకునేవాళ్లం అవడం లేదనీ, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలని కొంత మంది చెప్పారు. ఇవాళ నాకు సలహాలు చెప్పే వారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో 153 స్థానాల్లో జనసేన అభ్యర్ధులను బరిలో నిలిపితే కనీసం 30-40 స్థానాల్లో గెలిపించలేకపోయారు. కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. ఆ రోజు గెలిపించి ఉంటే ఈ రోజు మాట్లాడడానికి సంపూర్ణంగా హక్కు ఉండేది. మనం ఒంటరిగా వెళ్తే కచ్చితంగా కొన్ని సీట్లు సాధిస్తాం. ప్రభుత్వంలో అడుగుపెడతామో లేదో తెలియదు. జగన్ అనే వ్యక్తి సొంత చెల్లినే వదలని వాడు. మనల్ని ఎలా వదులుతాడు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు కూడా నా సలహా ఏంటంటే ఊరంతా శత్రువుల్ని పెట్టుకున్న నాయకుడి వెంట మీరు నడుస్తున్నారు. వైసీపీ నాయకులు జాగ్రత్తపడాలి. రేపు మీకు కష్టం వస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరకే రావాలని గుర్తుపెట్టుకోండి. కక్షపూరితంగా ఉంటే సమాజం విడిపోతుంది. అందుకే నన్ను తిట్టినా భరించి ముందుకు వెళ్తున్నాం. ప్రజలు బాగుండాలి. కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఉద్దేశంతోనే అన్నింటినీ భరిస్తా.
రాష్ట్ర భవిష్యత్తే ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ
టీడీపీతో పొత్తు విషయానికి వస్తే ఒక మాట ఎక్కువ తక్కువ ఉండవచ్చు. పై స్థాయి నాయకులు మాట్లాడే మాటల వల్ల కింద స్థాయిలో కొంచం ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. పొత్తులో కొన్ని ఆటుపోట్లు తప్పవు.. భరించాలి. మనందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. ప్రజలకు ఎలాంటి భవిష్యత్తు చూపాలన్నదే ఉమ్మడి కార్యాచరణగా ఉంటుంది. ఉమ్మడి రాజకీయ కార్యాచరణలో స్థానిక సంస్థల నుంచి కార్పోరేషన్ల వరకు జనసేన మూడో వంతు సీట్లు తీసుకుంటుంది. కనీసం మూడో వంతు మనం వార్డు మెంబర్లుగా ఉండాలి. అన్నింటినీ ముందుకు తీసుకువెళ్తాం. ప్రత్యేక పరిస్థితుల్లో వారు రెండు సీట్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజు ఆర్ బాగుంది అనిపించింది. రాజోలు, రాజానగరం సీట్లు నేను ప్రకటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. జనసేన – టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇస్తాయని నమ్ముతున్నా. ఈ పర్యాయం నన్ను నమ్మండి. వ్యూహం నాకు వదిలేయండి. నేను విహంగ వీక్షణతో రాష్ట్రాన్ని అంతా ఒకే దృష్టితో, రాష్ట్రం బాగుండాలని చూస్తున్నాను. ఐదేళ్లు సమయం ఇవ్వండి. మీ గౌరవానికి ఏ మాత్రం భంగం కలుగకుండా గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా. కలసి పని చేద్దాం
పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు
భారత రత్న అవార్డుకి ఎంపికైన దివంగత నేత కర్పూరి ఠాకూర్ కి అంజలి ఘటిస్తున్నాను. పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి , అన్నయ్య చిరంజీవికి మనస్ఫూర్తిగా అభినందనలు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు. గతంలో పద్మ అవార్డులు సిఫార్సులతో ఇచ్చేవారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా, సమాజానికి చేసిన సేవలు, త్యాగాలను పరిశీలించి మారుమూల పల్లెల వారికి కూడా అవార్డులు ఇవ్వడం అభినందనీయం. మోదీజీకి అభినందనలు తెలియ చేస్తున్నాను. భారత దేశ భవిష్యత్తుకి మోదీజీ లాంటి నాయకుడు కావాలని ఎప్పుడో గుర్తించాను. ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులకు, కేంద్ర మంత్రి వర్గానికి, అమిత్ షా కి, జేపీ నడ్డాకి అభినందనలు” అన్నారు.