Suryaa.co.in

Telangana

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా

-ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
-పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్
-8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి
-వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
-మా పోరాటానికి మద్ధతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాయాలి
-ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి
-భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
-రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీలు, కుల సంఘాల నేతలు, మేధావులు
-రౌండ్ టేబుల్ సమావేశంలో 9 తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు హాజరయ్యి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అనంతరం 9 తీర్మానాలను ఆమోదించారు. ప్రధానంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి తదుపరి కార్యాచరణలో చేర్చుతామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం తాము చేస్తున్న ఈ పోరాటానికి మద్ధతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10-15 పోస్టు కార్టులు పంపించడం వంటి సూచనలు వచ్చాయని, వాటిపై కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేస్తామని చెప్పారు. అలాగే, దేశం ఎటు వైపు వెళ్తుందన్న చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించామని గుర్తు చేశారు.

బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ అవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు వినతి పత్రం అందించామని, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖ అందించామని చెప్పారు. విగ్రహం పెట్టడంతోనే విగ్రహం వస్తుందా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, కానీ బీసీల అభ్యున్నతి కోసం భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని ప్రకటించారు.

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాని అన్నారు. అనేక సంఘసంస్కర్తల జయంతులను తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా నిర్వహించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయని, గత పదేళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తామని, అందులో భఆగంగా తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ కవిత గారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ నిఖార్సయిన ఎర్రజెండా స్పూర్తిని నిరూపించుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సీపీఐ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆమోదించిన తీర్మానాలు
ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్
కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ప్రకటించినందుకు హర్షం వ్యక్తం
పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్
కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
త్వరితగతిన బీసీ జనగణన చేపట్టాలి
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి
బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి
ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి

అన్ని వర్గాలకు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి: వీ ప్రకాశ్
కేవలం బీసీలు, దళితులకే కాకుండా అన్ని వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. అటువంటి పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తే భావితరాలకు స్పూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా, కులాల వివక్ష పారద్రోలడానికి పూలే ఎంతగానో కృషి చేశారని, బీసీ, దళితులకు కాకుండా అన్ని వర్గాలకు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని స్పష్టం చేశారు.

పూలేను కేవలం బీసీగా చూడవద్దని, అన్ని వర్గాలకు పూలే ఆరాధ్యుడన్నారు. తెలంగాణ సాధనలో బతుకమ్మ ప్రజల చేతుల్లో సాంస్కృతిక ఆయుధం అయిందని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ సాధన ఉద్యమం బీసీలకు ఐక్యతకు పునాది అవ్వాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత చేపట్టబోయే ఈ ఉద్యమంలో తాను కలిసి వస్తానని ప్రకటించారు.

అందరూ కలిసి రావాలి: గట్టు రామచందర్ రావు
భారత జాగృతి చేస్తున్న ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచందర్ రావు పిలుపునిచ్చారు. పూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, బీసీల కొసం గొంతెత్తుతున్నారని అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఇతర రాష్ట్రాల ఓబీసీ సంఘాలు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిచండానికి ఉద్యమించి సాధించిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కుతుందని, అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఎజెండాలు పక్కనబెట్టి విగ్రహం సాధనకు పనిచేయాలని కోరారు.

పూలే ఆశయాలకు ప్రతిరూపం బీఆర్ఎస్: ఆంజనేయ గౌడ్
ముక్కలు ముక్కలు చేస్తాం, పాతాళంలోకి తొక్కేస్తామంటూ పాలకులు అడ్డగోలు భాష మాట్లాడుతున్నారని, పూలే, అంబేడ్కర్ ఆశయాలు కలిగిన బీఆర్ఎస్ ను పాతిపెడుతామని అనడం సరికాదని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్ సూచించారు. పూలే ఆశయాలను, అంబేడ్కర్ ఆకాంక్షలకు ప్రతిరూపం బీఆర్ఎస్ పార్టీ అని, గులాబీ జెండా పుట్టుకలోనే పూలే ఆశయాలు ఉన్నాయని చెప్పారు. వివక్ష లేని సమాజాన్ని బీఆర్ఎస్ కోరుకుందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే ఆశయాలను అమలు చేసి తమ పార్టీ అధినేత కేసీఆర్ చూపించారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత అలుపెరగని పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని సాధించారని కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత జాగృతి చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. కవిత నాయతకత్వానికి, ప్రతి అడుగులో బీఆర్ఎస్ పార్టీ తోడుగా నిలుస్తుందని తెలిపారు. పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

అలాగే, బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ… కార్పొరేషన్ చైర్మన్లలో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. ముఖ్యమైన పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి కేటాయించారని విమర్శించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేస్తున్నదని ఆరోపించారు. బీసీల అభ్యున్నత కోసం కృషి చేసిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్ధతు ఉంటుందని, అసెంబ్లీలోనే కాకుండా ట్యాంక్ బండ్ పై కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించాలని స్పష్టం చేశారు.

సీపీఐ(ఎంఎల్) నాయకుడు సుభాష్ మాట్లాడుతూ… సమాజానికి వెలుగునిచ్చి జీవితాన్ని మొత్తం అట్టడుగు వర్గాల కోసం ధారబోసిన వ్యక్తి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కవిత చొరువ స్పూర్తిదాయకమన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయి కార్యాచరణ రూపకల్పన చేయాలని, గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సూచన చేశారు. కొన్ని వర్గాలకు పూలేను పరిమితం చేయడం సరికాదని సూచించారు. తన చుట్టూ ఈడీ, మోడీలు మూగినా కూడా మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేశారని చెప్పారు. ఈ పోరాటాన్ని కూడా కూడా ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసం ఉందని అన్నారు.

రచయిత సంఘిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాల రూపంలో ప్రతిబడిలో ఆయన రాసిన రచనలు అందుబాటులో ఉండాలని, పాఠ్యపుస్తకాల్లో జీవిత చరిత్ర చేర్చాలని ప్రతిపాదించారు. ప్రతి విశ్వవిద్యాలయాల్లో పూలే పేరిట ఓబీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని పూలే చెప్పిన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణకు పూలేకి ఎంతో అనుబంధం ఉందని వివరించారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో పద్మశాలి సంఘం నాయకుడు శివశంకర్, ప్రోఫెసర్ తాటికొండ రాజయ్య, ఓయూ జేఏసీ నేత రాజారామ్ యాదవ్, సంచార జాతుల సంఘం ప్రో. కోలా శ్రీనివాస్, సీపీఐ నేత బాలమల్లేశ్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, వడ్డెర సంఘం నాయకులు మురళీ, బీఎస్పీ నాయకురాలు అనితా రెడ్డి, ఓబీసీ అధ్యయన కన్వీనర్ ఎర్రోజు శ్రీనివాస్ , బీసీ విద్యార్ధి సంఘాల చైర్మన్ ఏల్చల దత్తాత్రేయ, రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి, సీపీఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ నాయకుడు రాజేశ్, తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాచమల్ల బాలకృష్ణ, బీసీ సంఘం నాయకులు ఓరుగంటి వెంకటేష్, బాలమణి, మున్నూరు కాపు సంఘ: నాయకుడు మహేందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం అద్యక్షులు గంధం రాములు, గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు రేణుకా, గౌడ సంఘం ఉపాధ్యక్షురాలు కీర్తి లతా గౌడ్, టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, అఖిల భారత సగర మహా సంఘం అధ్యక్షుడు విజయేంద్ర సాగర్, నాయిబ్రాహ్మణ సంఘం నేత దేవరకోండ నాగరాజు, బీసీ సంఘం నాయకుడు సీహెచ్ కుమారస్వామి, వాల్మికీ బోయ సంఘం నాయకుడు మాండ్ల కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుడు వెంకన్న, ఎఫ్ ఎల్ వై అధ్యక్షులు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE