Suryaa.co.in

Andhra Pradesh

షర్మిల మాటలకు చంద్రబాబుకి ఏంటి సంబంధం?

-బాబాయ్ హత్య తర్వాత తల్లి..చెల్లితో జగన్ కు దూరం పెరిగింది నిజం కాదా?
• 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాకు తెరలేపాడు
• ఎన్ని పిచ్చిపిచ్చివేషాలేసినా ప్రజలు జగన్ ను నమ్మరు.
• షర్మిల రాజకీయంగానే కాదు.. అన్న అవినీతి, బాబాయ్ హత్యకేసుపై కూడా పోరాడాలి
• తన స్వార్థంకోసం.. రాజకీయాలకోసం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది జగన్ రెడ్డి, వైసీపీనేతలే
• షర్మిల వ్యాఖ్యలపై సజ్జల.. వైసీపీ నేతల మాటలు జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
• అభివృద్ధి చేసిన చంద్రబాబుని, అవినీతిపరుడైన తన అన్నను షర్మిల ఒకే గాటన కడితే ఎలా?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ తరుపున రాజకీయ పోరాటం చేస్తుంటే సజ్జల రామకృష్ణా రెడ్డి.. వైసీపీనేతలు ఆమెను చంద్రబాబే జగన్ పైకి ప్రయోగించాడని చెప్పడం చూస్తుంటే వాళ్లకు పూర్తిగా మతిపోయిందనే సందేహం కలుగుతోందని, ముఖ్యమంత్రికి.. అతని చెల్లి తల్లికి మధ్య ఉన్న విబేధాలకు చంద్రబాబుకి సంబంధం ఏమిటో వారే చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఇంటిగుట్టు రచ్చకు ఎక్కకుండా చూసుకోవాల్సిన వారు అది చేయకుండా అయిన దానికీ కానిదానికీ చంద్రబాబుపై నిందలేయడం ఏమిటి? నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ జైల్లో ఉన్నప్పుడు, 2014 ఎన్నికలకు ముందు షర్మిల పాదయాత్ర చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా తిరిగి జగనన్నను గెలిపించండి అని ప్రచారం చేసింది.

షర్మిల తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా బైబిల్ చేతపట్టుకొని మరీ జగన్ రెడ్డికోసం ప్రచారం చేశారు. అంత చేసిన షర్మిలను ఎందుకు పక్కన పెట్టారో, ఆఖరికి సొంతతల్లిని కూడా ఎందుకు వదిలేశాడో జగన్ రెడ్డే చెప్పాలి. షర్మిల ఏ ఎంపీ స్థానం అడిగిందో..లేక ఏం ఆస్తులు అడిగిందో మాకెలా తెలుస్తుంది? అన్నీ తెలిసిన జగనే నోరువిప్పాలి.

తన స్వార్థంకోసం.. రాజకీయాలకోసం కుటుంబాలు చీల్చేది జగన్ రెడ్డే. నందమూరి ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయం చేసింది ఎవరు? బాబాయ్ హత్య తర్వాతే జగన్ రెడ్డికి తల్లితో..చెల్లితో దూరం పెరిగింది

షర్మిల మాటలకు.. మాకు ఏమిటి సంబంధం? ప్రతిదానికీ చంద్రబాబుపై, టీడీపీ పై పడి ఏడవడం జగన్ రెడ్డికి, అతని తాబేదార్లకు, అతని నీలిమీడియాకు అలవాటుగా మారింది. తన ఇంట్లో జరిగిన విషయాలకు మమ్మల్ని సమాధానం చెప్పండి అనడానికి సజ్జలకు, వైసీపీనేతలకు సిగ్గుందా? కుటుంబాలను చీల్చేది, కుటుంబసభ్యుల మధ్య తగాదాలు పెట్టేది జగన్ రెడ్డి, అతని పరివారమే. నంద మూరి ఉమామహేశ్వరి అనారోగ్యంతో చనిపోతే, ఆమె మరణాన్ని తన రాజకీయ దుష్ప్రచారాలకు వాడుకుంది వైసీపీ కాదా?

పిచ్చిపిచ్చిరాతలతో ఆనాడు కుటుంబసభ్యుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసింది మీరుకాదా? సొంత బాబాయ్ ఏమయ్యాడో జగన్ కు తెలియదా? తాను ముఖ్యమంత్రి అయ్యాక కడప ఎంపీ స్థానం తనతల్లి విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని జగన్ బాబాయ్ అనుకున్నాడు. ఆయన ఆలోచనకు విరద్ధంగా జగన్ ఆ సీటుని తన భార్య తరుపు వ్యక్తి అయిన అవినాశ్ రెడ్డికి ఇచ్చాడు. అప్పుడే వైసీపీ గౌరవాధ్యక్షురాలి గా ఉన్న తనతల్లి విజయమ్మను జగన్ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. జగన్ కుటుం బంలో కుంపటి అప్పుడే మొదలైంది.

బాబాయ్ హత్య తర్వాత తల్లితో..చెల్లితో జగన్ రెడ్డికి దూరం పెరిగింది. ఆ విషయాలతో పాటు ఆస్తి పంపకాల వద్ద కూడా అన్నాచెల్లికి మధ్య గొడవలు జరిగాయేమో? ఇవన్నీ జగన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వివేకానందరెడ్డి కూతురు సునీత తన తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తుంటే, ఆమె చర్యల్ని కూడాజగన్ రెడ్డి, చంద్రబాబుకి అంటగట్టాడు. ఆఖరికి సునీతను ఆమె భర్తను, వివేకానందరెడ్డి హత్యకేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల్ని కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు.

2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా..ఇప్పుడు ఫ్యామిలీ డ్రామానా జగన్ రెడ్డి?
ఎన్నికలకు ముందు కోడికత్తి కేసుతో సానుభూతి డ్రామాలాడి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి, ఇప్పుడు కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తన చెల్లితో తాను మాట్లాడితే సమస్యలు పరిష్కారమ వుతాయని జగన్ కు కూడా తెలుసు. ఆ పని చేయకుండా చంద్రబాబు చేయిస్తు న్నాడని అనడం జగన్ రెడ్డి చౌకబారు రాజకీయాలకు నిదర్శనం. జగన్ రెడ్డి పిచ్చిపిచ్చి డ్రామాలు ప్రజలకు బాగా అర్థమయ్యాయి. ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా ప్రజలు ఆయన్ని నమ్మరు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబుని, అవినీతికి పాల్పడినా జగన్ రెడ్డిని షర్మిల ఒకే గాటన కట్టడం సరైంది కాదు
షర్మిల కూడా గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టి మాట్లాడుతోంది. అభివృద్ధి చేసిన చంద్రబాబుని, అవినీతిపరుడైన జగన్ రెడ్డి ఒకటే అంటే ఎలా? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది జగన్ రెడ్డే. ప్రజలు గెలిపించిన ఎంపీలతో ఇప్పుడు తన కేసులు నుంచి బయటపడటానికి తానే కేంద్ర పెద్దల ముందు మెడలు వంచుతున్నాడని షర్మిలకు తెలియదా? ప్రత్యేకహోదా కోసం టీడీపీ చేసిన పోరాటం ఏ పార్టీ చేయలేదని షర్మిల తెలుసుకోవాలి. ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు.

ఆఖరికి టీడీపీ ఎంపీలతో, కేబినెట్ లో ఉన్న మంత్రులతో కూడా రాజీనామాలు చేయించారు. అలాంటి ఒక్క పని ఇన్నేళ్లలో జగన్ రెడ్డి చేశాడా? 12కు పైగా కేంద్రప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి తీసుకొ చ్చింది చంద్రబాబునాయుడు. పోలవరాన్ని 72శాతం పూర్తిచేసింది టీడీపీ ప్రభుత్వమే. అమరావతి నిర్మాణానికి రూ.10వేలకోట్లు ఖర్చుపెట్టి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలు చేపట్టి రోడ్లు వేయించింది చంద్రబాబు. ఎవరితో పొత్తుఉన్నా.. ఎలాంటి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకోసం టీడీపీ, చంద్రబాబు ఎప్పుడూ రాజీపడలేదని ప్రజలకు కూడా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా షర్మిల మాట్లాడితే ఆమెకే నష్టం.

షర్మిల రాజకీయ పోరాటం చేస్తే సరిపోదు… తన అన్న అవినీతి, బాబాయ్ హత్య కేసుపై కూడా పోరాడాలి
షర్మిల రాజకీయ పోరాటం చేస్తే సరిపోదు. తన అన్న అవినీతి, బాబాయ్ హత్య కేసుదోషుల్ని కాపాడటంపై, రాష్ట్రాన్ని దోచేసిన వైనంపై కూడా ఆమె పోరాడాలి. షర్మిల చెప్పే మాటలకు సమాధానం చెప్పలేని సజ్జల, టీడీపీని అంటే చూస్తూ ఊరుకోం. దళితుల్ని అవమానిస్తున్నారు.. ఊచకోత కోస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహాలు పెడితే అవన్నీ ఒప్పు అవుతాయా అని షర్మిల ఈరోజు అంటున్నారు. మా పార్టీ, మేం ఆ విషయాలు ఎప్పుటినుంచో మాట్లాడుతున్నాం.

విలేకరుల ప్రశ్నలకు ఆనంద్ బాబు స్పందన…!
సీట్లు.. పంపకాల గురించి చంద్రబాబు-పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటారు
కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రత్యేకహోదా తీసుకొస్తానని చెప్పింది జగన్ రెడ్డి. పోరాటం ఆయన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న మేం ఎలా చేస్తాం? సీట్లు.. పంపకాలు… ఇతరత్రా వ్యవహారాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటారు. పేర్నినాని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరంలేదు.

టీడీపీ-జనసేన పొత్తు పదేళ్లకు పైగా ఉంటుంది. పవన్ కల్యాణ్ తొలినుంచీ జగన్ రెడ్డిని గద్దె దించడమే ధ్యేయమంటున్నాడు. పార్టీలు వేరైనా అన్నింటి లక్ష్యం ఒక్కటే… జగన్ రెడ్డిని గద్దె దించడమే. జగన్ ఉంటే రాష్ట్రానికి భవిష్యత్ లేదు.. ప్రజలకు స్వేచ్ఛ, సుఖసంతోషాలు లేవని అన్నిపార్టీల ఏకాభిప్రాయం.” అని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE