-శరవేగంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం
-ఎంపీ విజయసాయి రెడ్డి
జనవరి 11: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా బుధవారం ఆయన పలు అంశాలపై స్పందించారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు చేపట్టిన ఉద్దానం తాగునీటి ప్రాజక్టు పనులు త్వరలో పూర్తికానున్నాయని తెలిపారు.
జగనన్న తోడు చిరు వ్యాపారుల పెట్టుబడికి భరోసా
“జగనన్న తోడు” పథకం ద్వారా అందించే ఆర్థిక సహకారం ( వడ్డీ లేని రుణం) చిరువ్యాపారుల పెట్టుబడికి భరోసా, వారి జీవనోపాధికి అండ అని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే రూ. 10,000 వడ్డీ లేని రుణం చిరువ్యాపారులకు వడ్డీ రక్కసి కోరల నుండి విముక్తి కలిగిస్తుందని అన్నారు. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం రూ.395 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
స్వదేశీ ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలి
పెద్ద పెద్ద మల్టీ నేషనల్ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు సైతం సిబ్బందిని సామూహికంగా తొలగించడం, సిబ్బందిని తగ్గించుకోవడం చేస్తుంటే, ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రం 2024 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల నుండి 1.50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. ఇది భారతీయ ఐటీ కంపెనీల సత్తాను తెలియజేస్తోందని అన్నారు. స్వదేశీ ఐటీ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపైనా ఉందని ఆయన అన్నారు.
గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలి
సొంత ఇల్లు కలిగి ఉండడం అన్నది ఇప్పటికే దేశంలో చాలా మందికి జీవితకాల స్వప్నమని విజయసాయి రెడ్డి అన్నారు. గృహ రుణాలకు సంబంధించి నెలసరి వాయిదాల చెల్లింపు మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోందని అన్నారు. ఈ మేరకు 2023-24 బడ్జెట్ లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ప్రజలపై భారం తగ్గించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కోరుతున్నట్లు తెలిపారు.