-రైతు భరోసా కింద బటన్ నొక్కగానే రైతుల అకౌంట్లలో నగదు జమ అవుతుందని చెప్పి మోసం
-ఇప్పటికీ 77 వేల మంది రైతులకు జమకాని రైతు భరోసా- నెలలు గడుస్తున్న అందని ధాన్యం డబ్బులు
-జగన్ రెడ్డి పాలనలో ఇప్పటికే 5వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు
-మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ
మోసపూరిత వాగ్దానాలతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్ రెడ్డి సంక్షేమం బూటకమని రైతు భరోసా అమలులో స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అక్టోబర్ 17న కోట్లు ఖర్చు పెట్టి మరీ రైతు భరోసా ప్రకటనలు ఇచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పటికీ 77 వేల మంది రైతులకు రైతు భరోసా అందించకుండా దగా చేశారు. జగన్ రెడ్డి బటన్ నొక్కగానే రూ.4 వేలు రైతుల ఖాతాల్లో పడిపోతాయని ఊదరగొట్టారు.
ఇందులో రూ.2వేలు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. దానికి కూడా జగన్ రెడ్డి తానే నిధులు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కి రెండు వారాలు దాటినా 77 వేల మంది రైతులకు ఇంకా జమ కాలేదు. రైతుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ధాన్యం కొంటే 15 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించేది. ప్రకృతి వైపరీత్యాలతో ధాన్యం రైతులు నష్టపోతే టీడీపీ ప్రభుత్వం రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచాం.
నేడు జగన్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేసి.. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో వ్యవసాయాన్ని వదిలేసే స్థితికి అన్నదాతలు చేరుకున్నారు. రైతు భరోసా కింద తాను బటన్ నొక్కకానే రైతుల అకౌంట్లలో నగదు జమ అవుతుందని చెప్పి జగన్ రెడ్డి మోసం చేశారు. ఇప్పటికీ 77 వేల మంది రైతులకు రైతు భరోసా నగదు జమ కాలేదు. నేడు అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతుంటే జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు అప్పులపాలవుతున్నారు.
రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే జగన్ రెడ్డి పాలనలో 5వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు న్యాయం చేయలేని జగన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదు. మోసపూరిత వాగ్దానాలతో అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు. డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థ సక్రమంగా లేదు. ఏమాత్రం వర్షం పడ్డా పొలాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది.
రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీలేని రుణాలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి హయాంలో రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే.