Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లుగా సర్పంచులను జీరో చేసిన జగన్

– ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి
– రాష్ట్ర సర్పంచుల సంఘ నాయకులతో పెమ్మసాని

గుంటూరు: ‘గ్రామాభివృద్ధికి సర్పంచులే కీలకం. అలాంటి సర్పంచ్ లను గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం జీరో చేసింది. ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించి గ్రామాభివృద్ధిని నిర్వీర్యం చేసింది.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర సర్పంచుల సంఘం అసోసియేషన్ నాయకులతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం అయ్యారు. సర్పంచుల ఇబ్బందులు, గ్రామాల్లోని సమస్యలు, దారి మళ్లిన నిధులు తదితర వివరాలపై ఈ సమావేశంలో చర్చించారు. పక్కదారి పట్టిన న.రె.గా(నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం) నిధుల వివరాలు, గ్రీన్ అంబాసిడర్ల జీతాల భారం, స్థానికంగా చెరువులు కూడా బాగు చేసుకోలేని పలు సమస్యలను ఈ సందర్భంగా సర్పంచులు పెమ్మసాని దృష్టికి తీసుకువచ్చారు. అధికారం చేతిలో ఉన్నా అభివృద్ధి చేసుకో లేకపోయామంటూ పలువురు సర్పంచులు వాపోయారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇక నుంచి అయినా నిధులను సమకూర్చాలని ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు కోరారు.

అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ నరేగా నిధులను ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను, మ్యాచింగ్ ఫండ్స్ ను అందిపుచ్చుకునేలా తీవ్రంగా కృషి చేస్తున్నామని వివరించారు. అలాగే పంచాయతీల్లో పనిచేసిన గ్రీన్ అంబాసిడర్ల జీతాలను పంచాయతీలపైనే భారం మోపిన జగన్ ప్రభుత్వం తీరును ఈ సందర్భంగా ఆయన తప్పు పట్టారు.

జగన్ ప్రభుత్వంలో పంచాయతీలు కనీస సౌకర్యాలకు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలోకి వెళ్లాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో పంచాయతీలను అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవిబి రాజేంద్రప్రసాద్ తోపాటు అన్ని జిల్లాల నుంచి సర్పంచులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE