Suryaa.co.in

Andhra Pradesh

విద్యా వ్యవస్థ సర్వనాశనానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి

ఐబీ సిలబస్ లో చదివితే పనికిరాకుండా పోనున్న విద్యార్థుల భవిష్యత్తు
దేశంలో జరిగే ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వారు రాయలేరు
ఫైబర్ గ్రిడ్ కేసులో నవంబర్ 9వ తేదీ వరకు ముందస్తు బెయిలు ఇచ్చినట్టే లెక్క
ఆడపిల్లలు ఉన్న తండ్రులు, ఆడపిల్లలను గౌరవించే ప్రతి ఒక్కరూ భగవంత్ కేసరి సినిమా చూడాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

విద్యా వ్యవస్థ ద్వారా వందలాది కోట్ల రూపాయలను తినేయడానికి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యావ్యవస్థ సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడితే విద్యార్థులు ఎందుకు పనికిరాకుండా పోతారు. దేశంలో జరిగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వారు రాయలేరు. ఐఏఎస్ పరీక్షల్లోనూ గుప్తుల చరిత్ర గురించే అడిగే అవకాశం ఉంది. ఐబీ సిలబస్ లో గుప్తుల గురించి బోధించే అవకాశం లేదు. ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించాలి. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనను కోరుకుంటే, వారు ఆ మాధ్యమంలో చదువుకోవచ్చు.

గుజరాతి భాషలో మెట్రిక్ వరకు చదువుకున్న గౌతం అదాని సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరూ గేటు వద్ద వెయిట్ చేయడం లేదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అతి తెలివితేటలతో ప్రజలను మోసం చేస్తూ… విద్యావ్యవస్థలో సొమ్ములు కొట్టేయడానికి ఈ టెక్నిక్ వాడుతున్నారు.

తొలుత విద్యార్థులందరికీ ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన అని వాదించిన జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతానని చెప్పారు. రాష్ట్రంలోని 49 వేల పాఠశాలలను సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడతానని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటే, స్కూళ్లను పరిశీలించిన సీబీఎస్ఈ ప్రతినిధులు కేవలం 1000 స్కూళ్లలోనే వసతులు ఉన్నాయని చెప్పారు. 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడితే, ఒక్క విద్యార్థి కూడా పాస్ అయ్యే అవకాశం ఉండదు. కాపీలు కొట్టించి వారిని పాస్ చేయించాల్సిన దుస్థితి నెలకొంటుంది.

ఒకటవ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాభ్యాసం చేసిన వారికే ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. ఈ విషయాన్ని తాను సొంతంగా చెప్పడం లేదు. సీబీఎస్ఈ వ్యవస్థాపక సభ్యులతో మాట్లాడి, తీవ్ర అధ్యయనం చేసిన తర్వాతే చెబుతున్నాను. కేవలం 1000 పాఠశాలలలోనే సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతామంటే, ఆగ్రహించిన జగన్ మోహన్ రెడ్డి… రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టవలసిందేనని వాదించారు పాఠశాలలలో మౌలిక వసతులు లేవని సీబీఎస్ఈ ప్రతినిధులు పేర్కొనగా, ముఖ్యమంత్రిగా నేను చెప్పింది వినాలని జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేశారు.

విద్యార్థులకు ఆన్లైన్ లోనే విద్యా బోధన అంటూ ఎటువంటి టెండర్లు లేకుండానే విదేశాల్లో డీల్ వేసుకొని బైజుస్ కు కాంట్రాక్టు కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వం సాల్ట్ అనే పథకం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మంజూరు చేసింది. సాల్ట్ పథకాన్ని అడ్డం పెట్టుకొని బైజూస్ ద్వారా ప్రభుత్వ పెద్దలు వందల కోట్లు తినేశారు. ప్రభుత్వమే నోటు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. నోటు, పాఠ్యపుస్తకాల పంపిణీ లోను సంవత్సరానికి 350 కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దలు లాగేస్తున్నారు.

సాధారణంగా పేపర్ టన్ను 80000 కాగా, ఐ టి సి భద్రాచలం 83 వేల రూపాయలకు విక్రయిస్తుంది. ఐటీసీ భద్రాచలం విక్రయించే పేపర్ ను ప్రభుత్వం కొనుగోలు చేసి నోటు, పాఠ్యపుస్తకాలను ముద్రించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను లక్షా 20 వేల రూపాయలు గా చూపించి అడ్డంగా దోచుకుంటున్నారు. దీనితో ఏటా 350 కోట్ల రూపాయలను స్వాహా చేస్తున్నారు.ఈ విషయం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కు తెలియదు. బెంగళూరుకు చెందిన బఫనా అనే సంస్థకు నోటు, పాఠ్యపుస్తకాల పంపిణీ బాధ్యతను అప్పగించారు.

బఫనా తో పాటు, రాష్ట్రంలోని అస్మదీయులకు చెందిన ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కూడా నోట్, పాఠ్య పుస్తకాల సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టారు. అయితే, వీరంతా 83 వేల రూపాయలకే టన్ను పేపర్ సరఫరా చేస్తున్నట్లు ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నారు. కేజీ వెనుక ఒక్క రూపాయి తినడం సబబుగా ఉంటుందేమో కానీ 45 రూపాయలు తినేయడం దారుణం. పుస్తకాలలోని ఇంత కొట్టేస్తున్నారంటే వీరి నీచ ప్రవృత్తి ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

కాసుల కక్కుర్తి కోసం లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చర్యల వల్ల రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా అభ్యర్థులు 100 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిన నెగ్గె పరిస్థితి లేదు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం వేరు… సీబీఎస్ఈ సిలబస్ వేరు
రాష్ట్ర విద్యా విధానం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఎస్ ఈ విద్యా విధానం వేరు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా, విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న పెడ ధోరణిలను చూసి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోని ఉందో అర్థం కావడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, దేశంలోని రాష్ట్రాలన్నీ వేరువేరు సంస్కృతి కలిగి ఉన్నాయి. ఒకటే సిలబస్ కాకుండా వేరు వేరు సిలబస్ లను ప్రవేశపెట్టడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన సంస్కృతికి విలువ ఇచ్చినట్లు అవుతుందని భావించారన్నారు.

సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడానికి సౌకర్యాలు లేని పాఠశాలల్లో ఐబీ సిలబస్ అవసరమా?
సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడానికి సౌకర్యాలు లేని పాఠశాలల్లో, ఐ బి సిలబస్ ప్రవేశపెట్టడం అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఐబి సిలబస్ ను బోధించడానికి ఉపాధ్యాయులు ఉన్నారా?? అని నిలదీశారు. లేని ఉపాధ్యాయులను ఎక్కడ నుంచి తీసుకువస్తారన్న ఆయన, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలకు టోఫెల్ పరీక్షలు నిర్వహించడానికి అసలు బుద్ధుందా? అంటూ మండిపడ్డారు.

విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి, ఆ భాషలో ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి మాత్రమే టోఫెల్ పరీక్ష నిర్వహిస్తారు. టోఫెల్ పరీక్షలు నిర్వహించడం వెనుక 1500 కోట్ల రూపాయలను తినేయడానికి స్కెచ్ వేశారు. ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఐబీ పాఠశాలలు ఉంటే, రాష్ట్రంలోని 49 వేల పాఠశాలలో ఐబి సిలబస్ ప్రవేశపెడతానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఐబి సిలబస్ ప్రవేశపెట్టగానే సరిపోదు. ప్రతి సబ్జెక్టుకు ఇంత అని విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. బాత్రూంలను కడగడానికే డబ్బులు వసూలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… ఐ బి సబ్జెక్టులకు విద్యార్థుల తరఫున ఫీజులు చెల్లిస్తుందా అంటూ నిలదీశారు.

ఐబీ విద్యా విధానాన్ని బోధించడానికి టీచర్లు ఎక్కడ?
ఐబీ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే విద్యార్థులకు బోధించడానికి టీచర్లు ఎక్కడ ఉన్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. నూతనంగా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేపట్టలేదు. గతంలో రిక్రూట్ అయిన ఉపాధ్యాయులు ఐబీ సిలబస్ ను బోధించలేరు. ఐబీ టీచర్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. మన ఉద్యోగ నియామక వ్యవస్థలో రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది. ఐబీ సిలబస్ ను ప్రవేశపెడితే టంగుటూరి ప్రకాశం పంతులు గురించి విద్యార్థులకు బోధించడానికి ఉండదు.

అసలు మన నాగరికత, సంస్కృతి వారు నేర్చుకునే అవకాశమే లేదు. ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టి విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు. ఈ సిలబస్ చదువుకొని ఎంతమంది విద్యార్థులు అమెరికాకు వెళ్తారు. అమెరికాలోనే ఐబీ సిలబస్ ను ఎందుకు ప్రవేశపెట్టలేదన్న కామన్ సెన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను ఏనాడు ప్రశ్నించలేదు. కానీ ప్రజలు ప్రశ్నిస్తున్న దాన్ని ఒక వారధిగా మాత్రమే మీకు చెబుతున్నాను.

మనదేశంలో ఉద్యోగాలు చేయడానికి ఐబీ సిలబస్ పనికిరాదు. ఐ బి సిలబస్ ప్రవేశపెట్టి, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చేస్తామంటే ఆ రామోజీరావు, పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని, వెంకయ్య నాయుడు మనవడు ఇంగ్లీష్ మీడియం లో ఎందుకు చదివారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం సిగ్గుచేటు. 49 వేల పాఠశాలలలో ఐబీ సిలబస్ ప్రవేశపెడితే ఇక్కడ పనికిరాకుండా, అమెరికాకు వెళ్లలేక విద్యార్థుల భవిష్యత్తు అదోగతి పాలవుతుందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

ఐబీ సిలబస్ పేరిట 1500 కోట్ల రూపాయలను తినేయడానికే ఈ స్కెచ్ వేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఉత్తమ విద్యా విధానాన్ని తక్కువ ఖర్చుతో అందజేస్తుందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. టోఫెల్, బైజూస్, ఐ బి సిలబస్ పేరిట విద్యా దోపిడిని కొనసాగనివ్వమని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.

నవంబర్ 7వ తేదీలోగా స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామనడం శుభసూచకం
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబర్ ఏడవ తేదీలోగా వెల్లడిస్తామని న్యాయమూర్తులు చెప్పడం శుభసూచకమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ చంద్రబాబు నాయుడుని విచారించమని ఆదేశిస్తే, విచారించుకుంటామని పేర్కొనగా, చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకొని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడుని విచారించడం అంటే ఆయన్ని అరెస్టు చేయడమేనని అన్నారు.

ఫైబర్ గ్రిడ్ కేసులో 8వ తేదీకి వాయిదా వేయడం అంటే అప్పటివరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కేసులో వాదనలు వినిపించే సిద్ధార్థ లూత్ర 9వ తేదీకి కేసును వాయిదా వేయమని కోరడంతో న్యాయమూర్తులు అంగీకరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి నిరోధక చట్టంలో 17A నిబంధన ప్రకారం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే తీర్పు వెలువడుతుందన్న రఘురామ కృష్ణంరాజు, సుప్రీం కోర్ట్ ఆదేశాలను ఏ సి బి కోర్టు, హైకోర్టు కాదనలేదని చెప్పారు.

దసరా సెలవుల అనంతరం సుప్రీం కోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్ట్ స్వాష్ పిటిషన్ పై ఎప్పుడైనా తీర్పును వెలువరించవచ్చు . చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, వెకేషన్ బెంచ్ ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సిఐడి చీఫ్ సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వీధి బాగోతంపై సత్యనారాయణ అనే వ్యక్తి గవర్నర్ కు లేఖ రాయడంతో ఆయన గట్టిగానే మందలించినట్లు తెలిసింది.

గవర్నర్ ఆదేశాల మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సత్యనారాయణ కోరాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. అలాగే, కోర్టును కూడా ఆశ్రయించాలన్నారు.. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు, ఆడపిల్లలను గౌరవించే ప్రతి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా చూడాలన్నారు.. సమకాలీన రాజకీయాలను చూపిస్తూనే, చక్కటి సెంటిమెంటల్ చిత్రాన్ని దర్శక నిర్మాతలు రూపొందించారని రఘురామకృష్ణం రాజు అభినందించారు.

LEAVE A RESPONSE