Suryaa.co.in

Andhra Pradesh

పార్టీని కాపాడుకోవడానికే జగన్​ ఈ వర్క్ షాపు, ప్లీనరీలు నిర్వహించారు

-తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్

మహానాడుకు వచ్చిన స్పందన, వైకాపాపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి భయపడి.. సీఎం జగన్​ పార్టీ నేతలతో వర్క్ షాపు నిర్వహించారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకోవడానికే ఈ వర్క్ షాపు, ప్లీనరీలని మండిపడ్డారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆ పార్టీ శాసనసభ్యులు ప్రజలపై దాడులు చేశారన్నారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు, సమస్యలకు సమాధానాలు చెప్పలేక పోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వర్క్ షాపులో శాసనసభ్యులు లేవనెత్తిన సందేహాలకు.. సీఎం జగన్ సమాధానాలు చెప్పలేక పోయారని విమర్శించారు. ప్రజల మీద తిరగబడమని.. శాసనసభ్యులను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని.. ప్రజల సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కార మార్గాలు చెప్పలేకపోయారని ధ్వజమెత్తారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన వైకాపా నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని వాదిస్తున్నారని విమర్శించారు . ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న గంగాధర్ అనుమానాస్పదంగా మృతి చెందారన్నారని.. పరిటాల హత్యకేసులో సాక్షులు చనిపోయారని వెల్లడించారు. అదే పంథా వివేకానంద రెడ్డి కేసులో జరుగుతుందనే అనుమానం ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5.18శాతం భౌతిక దాడులు పెరిగాయని.. సెంట్రల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు. గంజాయి సరఫరాలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలలో ఒక పోస్టు పెడితే.. ఒక మహిళా నేతను 8 గంటలు ప్రశ్నిస్తారు.. అదే ఒక దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి తీసుకువచ్చి శవాన్ని తీసుకోవాలని బలవంతపెట్టిన నాయకుడిపై కేసు నమోదు చేయడానికి రెండు రోజులు తీసుకుంటారా అని మండిపడ్డారు. చట్టం చుట్టమై వైకాపా నేతలను రక్షిస్తుందని.. తెదేపా నేతలను శిక్షిస్తుందని ఆగ్రహించారు. తెదేపా నేతలు, మాజీ మంత్రులు చేసిన ఒక్క ఫిర్యాదుపై కూడా పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు.

కేంద్రం దయతలిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించలేదని భాజపా నేతలు ప్రకటించిన తర్వాత కూడా వైకాపా నేతలు స్పందించలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించినట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి దిల్లీకి పోయి వచ్చిన తర్వాత ప్రధాని, కేంద్ర హోం మంత్రులతో ఏం మాట్లాడారో ఎందుకు బహిరంగ పరచలేదని విమర్శించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. అమ్మఒడి పథకం అమలుపరచడం ఇష్టం లేకనే.. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్లో చాలా మందిని ఫెయిల్ చేసారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అస్తవ్యస్థ, అరాచక విధానాల వల్ల పదో తరగతి ఫలితాలు ఈ విధంగా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పని తీరు ఘోరంగా ఉందని ఆగ్రహించారు. విద్యా వ్యవస్థపై మంత్రికి కనీస అవగాహన లేదని ఆరోపించారు.

అమరావతి రాజధానికి కోర్టు విధించిన కాలపరిమితి ఎత్తివేయాలని కోర్టును కోరుతున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క భవనం అయినా కట్టారా? అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో నిర్మించిన భవనాల్లో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోర వైఫల్యం చెందాయని విమర్శించారు. వీటి గురించి వైకాపా నేతలు ఎప్పుడేనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE