Suryaa.co.in

Andhra Pradesh

రైతాంగాన్ని నష్టాల ఊబిలోని నెట్టారు

– పంటలకు మద్ధతు ధర లేక రైతు విలవిల
– రైతులపై 30శాతం పెరిగిన అదనమైన పెట్టుబడి
– ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నా రైతులకు ఇవ్వడానికి మనసు ఒప్పడంలేదా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతాంగం కష్టాల కడలిలో మగ్గిపోతోంది. పండిన పంటలకు మద్ధతు ధర లేక రోడ్ల పక్కన పడేసే దుస్థితికి తీసుకొచ్చారు. మొన్న ప్రకాశం జిల్లా గిద్దలూరులో పర్చిమిర్చి, నిన్న సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో టమోటాకు మద్ధతు ధర లేక రూ.50పైసలకు పడిపోయి రైతులు రోడ్ల పక్కన పడేశారు. ఉల్లి ధర నెల కిందట ఒక 50కిలోల బస్తా రూ.1000 నుండి రూ.1500 ధర పలికితే ఇప్పుడు రూ.100 నుండి రూ.300 వుంటుంది. కనీసం కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదు. రైతు బతుకు ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యమంత్రి వైసీపీ నేతలకు అద్దెల రూపంలో దోచిపెట్టేందుకు ఆర్భాటంగా తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లో పంటల వివరాలు నమోదు చేయడంగానీ, కొనుగోలు చేయడంగానీ చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులపై పెట్టుబడి భారం 30 శాతం పెరిగింది. జగన్ రెడ్డి వచ్చాక దళారుల బెడద ఎక్కువై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు మార్కెట్ దోపిడీల రూపంలో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. అధికారంలోకి రాగానే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది.? రూ.4 వేల కోట్లను ఏం చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? లేదా? రైతులకు సమాధానం చెప్పాలి. మరోవైపు 28 నెలలుగా వ్యవసాయ పనిముట్లకు అందించే సబ్సీడీని పూర్తిగా పక్కనబెట్టారు.
డ్రిప్ ఇరిగేషన్ ఎత్తి వేయడంతో రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రిప్, వ్యవసాయ పనిముట్లపై 90 శాతం సబ్సీడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకున్నారు. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు వాటి ద్వారా లబ్ధి పొందారు. కానీ వీటన్నింటిని నేడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు వ్యవసాయాన్ని భారంగా చేశారు. రాష్ట్రంలో సాగు శాతం పడిపోయింది. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్న రైతులకు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ. వందల టీఎంసీల నీళ్లు సముద్రాల్లోకి వదలడానికైనా ఇష్టపడతున్నారు కానీ, పంటకాలువల్లోకి వదలడానికి మాత్రం చేతులు రావడం లేదు. ఈ విధంగా రైతాంగాన్ని అన్ని విధాలా నిర్లక్ష్యం చేయడం ముఖ్యమంత్రికి తగదు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి.

LEAVE A RESPONSE