Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డీ.. నీకు ఆ దమ్ము ఉందా?

– “ఒకడు ఉన్నాడు” అంటావా?
– ఎక్కడ చదువుకున్నావు నువ్వు?
– ఎవరు నేర్పారు నీకు సంస్కారం?
– నోరు, భాష అదుపులో పెట్టుకోవడం నేర్చుకో
– నువ్వు అవినీతి కోసమే పుట్టావు
– జగన్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు
(మార్తి సుబ్రహ్మణ్యం)

అమరావతి: తనను ఏకవచనంతో సంబోధిసూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌రెడ్డి చేసిన ఆరోపణపై మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అగ్గిరాముడయ్యారు. నువ్వుంత? నీ బతుకెంత? అనేంత స్థాయిలో కడిగిపారేశారు. ‘‘నువ్వు అవినీతి కోసమే పుట్టావు. మిస్టర్ జగన్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో’’ అంటూ తొలిసారిగా జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏతనకు పోస్టింగ్ ఇవ్వకుండా, వేధించినప్పుడు కూడా సంయమనం కోల్పోని ఏబీవీ.. తనపై జగన్‌రెడ్డి సంధించిన ఆరోపణలపై మాత్రం ఇంతెత్తున లేచారు. ‘నోర్మూసుకుంటే మంచిద’ంటూ ఒక ట్వీట్ చేసి, తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు.

నిజానికి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీవీకి పట్టం కడుతుందని చాలామంది ఊహించారు. గతంలో చంద్రబాబు సర్కారును మోసినందుకు.. జగన్ విధించిన శిక్షకు ప్రత్యామ్నాయంగా ఏబీకి ఉన్నత పదవి ఇస్తారని భావించారు. కానీ అదంతా భ్రమలే అని తేలింది. ఇప్పటిదాకా ఆయనకు సస్పెన్షన్ కాలంలో జీతమే రాని దిక్కుమాలిన పరిస్థితి. నిజానికి ఎక్కడ చూసినా మాజీ డీజీపీ ఠాకూర్, ఘట్టమనేని, రామారావు. ఈ మూడు పేర్లే. కానీ వైసీపీ ప్రచారం మాత్రం వేరు. ఆ బృందంలో ఏబీవీ కూడా ఉన్నారని! ఆయన కూడా కూటమి సర్కారుకు సలహా ఇస్తున్నారన్న ప్రచారం.

కానీ ఆయన ఫైలుకే ఇప్పటిదాకా మోక్షం లేని దుస్థితి. వ్రతం చెడ్డా దక్కని ఫలితం అంటే ఇదే! ఏబీనే ఇంకా తెరవెనుక వ్యవహారం నడిపిస్తూ, తమ పార్టీ నేతల వే ధింపులకు నాయకత్వం వహిస్తున్నారన్నది జగన్ భ్రమ. అనుమానం! ఆ అనుమానంతోనే ప్రెస్‌మీట్‌లో ఏబీ పేరు ప్రస్తావించారు. మరి ఏబీవీ ఊరుకుంటారా? అసలే ఇప్పుడు బాదరబందీలేని మనిషాయె. ఉద్యోగ లంపటాలు లేకపాయె. అందుకే జగన్‌రెడ్డిపై అగ్గిరాముడయ్యారు.
జగన్‌రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తూ ఏబీ ఏమన్నారంటే..

“ఎబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఉన్నాడట”. మిస్టర్ జగన్ రెడ్డీ.. నేను సర్వీసులో చాలా ఘనతలు సాధించిన ఐపిఎస్ అధికారిని. జీవితంలో ఎవరి దగ్గరా చెయ్యి చాచలేదని సగర్వంగా చెప్పగలను. జగన్ రెడ్డీ.. నీకు ఆ దమ్ము ఉందా?

నేను హత్యలు చేసిన వాళ్ళను పట్టుకుని జైలుకు పంపాను. నువ్వు హత్యలు చేసిన వాళ్ళను వెనకేసుకొస్తున్నావు. నన్ను సాధించడం కోసం అధికారం వెనక దాక్కొని అనేక ఆరోపణలు చేశావు. దేశద్రోహి అని కూడా అన్నావు. ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా నిరూపించ లేకపోయావు.

మరి నిన్ను ఇక్కడ సీబీఐ బోనులో నుంచోబెడితే, అక్కడ అమెరికాలో కూడా లంచాలు తీసుకున్నావని చెప్పి కోర్టులకు ఈడుస్తున్నారు. నేను ఐఐటిలో చదివి ఐపిఎస్ అయ్యాను. ప్రాణాలకు తెగించి దేశానికి సేవ చేశాను. మరి నువ్వో? అవినీతి కోసమే పుట్టావు.

“ఒకడు ఉన్నాడు” అంటావా! ఎక్కడ చదువుకున్నావు నువ్వు? ఎవరు నేర్పారు నీకు సంస్కారం? అదే భాషలో నిన్ను సత్కరించడం పెద్ద పని కాదు.కానీ నాది నీ స్కూలు కాదు. ప్రజా జీవనంలో ఉన్నావు. నోరు, భాష అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. నా పేరెత్తే ముందు, నా గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో నా పేరు ప్రస్తావించి నువ్వు వాడిన భాష సంస్కారహీనం.. చేసిన ఆరోపణ, ఎప్పటిలాగే పచ్చి అబద్ధం.

LEAVE A RESPONSE