– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన చర్యలతో జాతీయస్థాయిలో ఏపీ పరువును గంగలో కలిపారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైద్య రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్ నోటీసులు ఇవ్వడం ఎప్పుడైనా చూశామా?
వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టడం సిగ్గుచేటు. విమానాల్లో రప్పించి మరీ బినామీ కాంట్రాక్టర్లకు వేల కోట్ల నిధులిచ్చిన జగన్ రెడ్డి రెడ్ నోటీసులపై ఏం సమాధానం చెప్తారు? కరోనా విపత్తులో సకాలంలో వైద్య పరికరాలు సరఫరా చేసిన వారికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమైన చర్య. మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీకి చెందిన రూ. 250 కోట్ల నిధులను కాజేసేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వర్సిటీ నిధులను దారి మళ్లిస్తే వాటి అనుబంధ కాలేజీలు, ఆస్పత్రులకు మౌలిక సదుపాయాల కల్పన ఎలా సాధ్యం?
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చోద్యం చూస్తే సరిపోతుందా జగన్మోహన్ రెడ్డీ? కరోనా విపత్తులో సకాలంలో వైద్యం అందక ప్రజలు పిట్టల్లా రాలిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదు. కరోనా మరణాలు బయటకు రాకుండా తప్పుడు లెక్కలు చూపించారు. శ్మశానాలు చాలనంతగా కరోనా మరణాలు సంభవిస్తే నిజాలు దాచేశారు.
కరోనా కిట్లు సరఫరా చేసిన వారికి రూ. 300 కోట్లపైన బకాయిలు పెట్టారు. కరోనా సమయంలో భోజనం సరఫరా చేసిన ఏపీటీడీపీసి రూ. 30 కోట్లపైన బిల్లులు చెల్లించడంలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాలు లేవని రోగుల మొహానే వైద్యులు చెప్పి పంపిచేస్తున్న దుస్థితికి ముఖ్యమంత్రే కారణం. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి పనికిరాని సమీక్షలు పెట్టడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. క్వారంటైన్ కే పరిమితమయ్యే వైద్యఆరోగ్యశాఖమంత్రి వల్ల ఎవరికి ఉపయోగం? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేయి దులుపుకున్న ప్రభుత్వం ఎంతమందికి పథకం కింద ఉచిత వైద్యం అందిందో పట్టించుకున్న దాఖాలాలు లేవు.
ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం చేయబోమని సీఎం సొంత జిల్లాలోనే నెట్ వర్క్ ఆస్పత్రులు బోర్డులు పెట్టింది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. వైద్య పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని వైసీపీ ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలు, 16 హెల్త్ హబ్ లు కడతాననడం విడ్డూరంగా ఉంది. మరోవైపు అంటువ్యాధులు ప్రబలి ప్రజలు పిట్టల్లా బలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.