-వైసీపీ ప్రభుత్వ అసమర్ధ విధానాలతో సంక్షోభంలో ఆక్వా రంగం
– మంతెన సత్యనారాయణరాజు
జగన్ రెడ్డి అసమర్ద విధానాలతో మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఆక్వారంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా రైతులరక్తాన్ని వైసీపీ నేతలు పీల్చి పిప్పిచేస్తున్నారు. ఫీడ్ ధరలు, సీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రొయ్యల ధరలు మాత్రం పతనమవుతున్నాయి. భారతీ సిమెంట్ , సాక్షి పేపర్ ఒక రూపాయి నష్టానికి అమ్ముతారా? ఆక్వా రైతు మాత్రం ఉత్పత్తులను ఎందుకు నష్టానికి అమ్ముకోవాలి?ఆక్వా రైతులపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది.
రైతు సంక్షేమమే దేశ సంక్షేమంగా భావించి పాలించాల్సిన ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకుంటోంది. ఆక్వా రైతులను ముప్ప, తిప్పలు పెడుతున్నారు. జగన్ రెడ్డి చర్యలతో ఆక్వా రైతులు,ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లు / ఎగుమతిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఆక్వా రంగం అభి వృద్ధికి చంద్రబాబు పాలనలో చర్యలు తీసుకుంటే ఇప్పుడు జగన్ అసమర్ధ విధానాల వల్ల ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ యాక్ట్ (యాక్ట్ ఆఫ్ 29/2020), సీడ్ యాక్ట్ నం.36/2020 లను జే టాక్స్ కోసం తీసుకొచ్చి ఆక్వా రైతులకు వేదింపులకు గురిచేస్తున్నారు. కిలో రొయ్యల ఉత్పాదనకు రూ.300 వ్యయం అవు తుంటే రూ.180కు అమ్ముకోవలసి రావడం ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఆక్వా రైతు క్రాప్ హాలిడే ప్రకటిస్తే జరగబోయే చర్యలకు వైసీపీ ప్రభుత్వం మే బాధ్యత వహించాలి.
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని నాడు జగన్ రెడ్డి చెప్పి, నేడు యూనిట్ చార్జీలు రూ.5.30 వరకు వసూలు చేస్తున్నారు. ఫీడ్ పరిశ్రమల నుంచి కేజీకి రూ.5 చొప్పున టన్నుకు రూ.5 వేలు జే టాక్స్ వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వారైతులకు ద్రోహం చేయడమే. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీ ఆక్వా రైతుకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తాం.