Suryaa.co.in

Andhra Pradesh

మూడున్నరేళ్లలో 3లక్షలకోట్ల ప్రజాధనం లూఠీచేసిన జగన్ రెడ్డి

• మూడుతరాలకు సరిపడా పోగేసుకున్న జే గ్యాంగ్
• జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ సకుటుంబ సపరివారంగా రాష్ట్రాన్ని దోపిడీచేస్తోంది
• సహజవనరులు, ప్రజాసంపద లూఠీలో సలహాదారులు, అమాత్యులు, వైసీపీఎమ్మెల్యేలు పోటీలు పడుతున్నారు
• గ్రీన్ ఎనర్జీ పేరుతో రూ.60వేలకోట్లు, ఉత్తరాంధ్రలో విజయసాయి చేసిన రూ.40వేలకోట్ల భూదోపిడీ, మద్యం అమ్మకాలతో రూ.25వేలుకోట్లు, మైనింగ్ ద్వారా రూ.25వేలకోట్లు, ఇసుక, ఎర్రచందనం, రేషన్ బియ్యం ఇలా జగన్ రెడ్డి దోపిడీ జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుంది
-బొండా ఉమామహేశ్వరరావు

మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి, అతనిపరివారం సకుటుంబ సపరివారసమేతంగా రూ.3లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూఠీచేశారని, ప్రజలప్రాణాలుపోతున్నా, రాష్ట్రం నామరూపాలు లేకుండా పోతున్నా ముఖ్యమంత్రి, మంత్రివర్గం, వైసీపీనేతలు అవినీతి, అక్రమార్జన వదలడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

కేబినెట్ సమావేశంలో జగన్ రెడ్డి ఉపదేశాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి….
“మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో 3లక్షలకోట్ల ప్రజాధనం లూఠీ. జగన్ రెడ్డి, అతని పరివారం సకుటుంబసపరివారంగా దోపిడీలో మునిగి తేలుతోంది. వైసీపీ అలీబాబా దొంగలముఠా ఇప్పటివరకు దోచుకుందిచాలు, ఇకనుంచి జాగ్రత్త పడండి అని కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. కేబినెట్ సమావేశంలో జగన్ రెడ్డి ఉపదేశం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. జగన్ రెడ్డి అవినీతి తెలిసిన ప్రజలంతా ఆవుచేలో మేస్తుంటే, దూడలు గట్టున మేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలోని సహజవన రులు, ప్రజలసంపద లూఠీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు పోటీలు పడుతు న్నారు. మూడున్నరేళ్లలోనే మూడుతరాలకు సరిపడినంత దోచేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో వై.వీ.సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి బంధువు వై.ఎస్.అనిల్ రెడ్డి రూ.15 వేలకోట్ల విలువైన లాటరైట్ ఖనిజాన్ని అడ్డగోలుగా దోచేశారు. విజయసాయి రెడ్డి , జేగ్యాంగ్ కలిసి ఉత్తరాంధ్రలో రూ.40వేలకోట్ల విలువైన భూముల్ని కాజేసింది వాస్తవంకాదా? రాష్ట్రవ్యాప్తంగా రూ.25వేలకోట్ల విలువైనభూముల్ని ఇతర వైసీపీనేతలు స్వాహాచేశారు. దానికి సంబంధించిన సర్వేనంబర్లు, ఇతరవివరాలను తాము ఇదివరకే ప్రజలముందు ఉంచలేదా? వైసీపీనేతల లూఠీపై మూడేళ్లుగా ప్రజలు, పత్రికలు ఘోషించినా తాడేపల్లి ప్యాలెస్ లో ఉలుకూ, పలుకూ లేదు. ఏ2 కొట్టేసిన భూముల జాబితాలో 22-ఏలోని భూములు, రుషికొండభూములు, దసపల్లాల్యాండ్స్, చర్చిభూములు, వృద్ధాశ్రమభూములు, దేవాలయ, మాజీ సైనికులు భూములు, ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ తాము బయటపెడితే, అవి కొట్టేసింది తాను కాదు, తనకూతురు అల్లుడని విజయసాయే బయటపడ్డాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, లాంటి వాళ్లంతా రాష్ట్రాన్ని జోన్లుగా మార్చి దోపిడీకి తెగబడుతున్నారు. దోచినదాన్ని సమానంగా పంచుకుంటూ, తాడేపల్లి ప్యాలెస్ కు ఇవ్వాల్సిన దాన్ని లెక్కతప్పకుండా సక్రమంగా అప్పగిస్తున్నారు.

ఇసుక, మద్యం, మైనింగ్, మాదకద్రవ్యాలు… కాదేదీ జగన్ దోపిడీకి అనర్హం
ఇసుకదోపిడీకోసం చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి, జేపీ వెంచర్స్ సంస్థను తెరపైకి తెచ్చిన జగన్ రెడ్డి, మూడేళ్లలో రూ.10వేలకోట్లు దిగమింగాడు. మైనింగ్ లో రూ.25వేలకోట్లు, మద్యం అమ్మకాల్లో రూ.25వేలకోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బేవరేజెస్ అన్నీ వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. రూ.50లు విలువచేసే చీప్ లిక్కర్ బాటిల్ ను రూ.250కు అమ్ముతూ, ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు. వైసీపీప్రభుత్వం అమ్మేదంతా కల్తీమద్యమని, ప్రాణాంతకమైనదని తామే ప్రయోగశాలల్లో పరీక్షించి మరీ నిరూపించాం. మద్యం అమ్మకాలతో ఆగకుండా, అదనంగా రాష్ట్రానికి డ్రగ్స్, గంజాయిని పరిచయంచేసిన ముఖ్య మంత్రి, అతని జేగ్యాంగ్ వాటి అమ్మకాలతో రూ.25వేలకోట్లు కొల్లగొట్టింది. ఎర్రచందనం అమ్మకాలతో రూ.25వేలకోట్లు, రేషన్ బియ్యం మాఫియాద్వారా రూ.7వేల కోట్లు, సిమెంట్ ధరలపెంపుతో రూ.15వేలకోట్లు దిగమింగారు. పేదలకు ఇళ్లునిర్మిస్తామని స్థలాలకొనుగోలు పేరుతో రూ.7వేలకోట్లు కాజేశారు. ఇళ్లుకాదు గ్రామాలునిర్మిస్తున్నానని ప్రజల్ని నమ్మించిన జగన్ రెడ్డి బాగోతాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రగృహనిర్మాణశాఖ మంత్రే బయటపెట్టాడు. మూడున్నరేళ్లలో ఈ ముఖ్యమంత్రి కట్టింది కేవలం 5ఇళ్లేనని కుండబద్ధలుకొట్టి, వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారంపై నీళ్లుకుమ్మరించాడు. సంకల్ప సిద్ధి కుంభకోణం కింద వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు రూ.1100కోట్లు కొట్టేశారు. స్కామ్ పై విచారించాల్సిన సీఐడీ అధికారులు, అవినీతిపరులతో చేతులుకలిపి, మోసపోయిన పేదలకు అన్యాయంచేశారు.

కారుచౌకగా లేపాక్షి భూముల్ని కాజేశారు…
లేపాక్షి భూముల వ్యవహారంలో గతంలో జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ జైలుకువెళ్లింది. ఇప్పుడు అధికారంచేతిలో ఉందని కంపెనీస్ యాక్ట్ పేరుతో కొత్తనిబంధనలు తెచ్చి రూ.25వేలకోట్ల విలువైన లేపాక్షి భూముల్ని కారుచౌకగా దక్కించుకున్నారు. లేపాక్షి భూముల కుంభ కోణంలో జగన్ మేనమామ రవీందర్ రెడ్డి కొడుకు ఉన్నది వాస్తవంకాదా? 108, 104 అంబు లెన్సులు, ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతోవాహనాల కొనుగోలు పేరుతో రూ.1000కోట్లు కొట్టేశారు. విద్యుత్ కొనుగోళ్ల ముసుగులో గ్రీన్ ఎనర్జీ కింద రూ.65వేలకోట్లు దోచేశారు. రూ.లక్షకోట్ల విలువైన పవర్ ప్రాజెక్ట్ లను, నామినేషన్ పద్ధతిలో సొంత బంధువులకు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. లక్షకోట్లలో ఎన్నివేలకోట్లు ముఖ్యమంత్రికి వచ్చాయో చెప్పలేం. రాష్ట్రంలోని హైడ్రోపవర్, సోలార్, విండ్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లను గాలికొదిలేసి, బయటనుంచి అధికధరకు విద్యుత్ కొంటూ, వైసీపీప్రభుత్వం ప్రజలపై మోయ లేని భారం వేసింది. జగన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల టెండర్లను, అడ్డగోలుగా తనవాళ్లకు అప్పగించబట్టే, ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో మూడున్నరేళ్లలో రూ.46వేలకోట్ల భారం పడింది.

మూడున్నరేళ్లలో ఏ కేబినెట్ మీటింగ్ లోనైనా తాను, తనప్రభుత్వం అవినీతి చేయలేదని జగన్ రెడ్డి చెప్పగలిగాడా?
మూడున్నరేళ్లలో లక్షలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టి, పేదలకు మాత్రం పేలాలు పంచాడు. మూడున్నరేళ్లలో ఏ కేబినెట్ సమావేశంలో అయినా జగన్ రెడ్డి, తనప్రభుత్వం, మంత్రులు అవినీతి చేయలేదని చెప్పగలిగాడా? చెప్పలేడు..ఎందుకంటే అవినీతి బురదలో పొర్లుతున్నాడుకాబట్టి. నిన్నటి కేబినెట్ సమావేశమే తనచివరి సమావేశమన్నట్లుగా ముఖ్యమంత్రి తీవ్ర నిరాశానిస్పృహలతో మాట్లాడాడు. అధికారం దక్కిందే దోపిడీకోసం అన్నట్టుగా ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మూడున్నరేళ్లలో పేట్రేగిపోయాడు. ఇవన్నీ ప్రజలకు తెలియవన్నట్లు నిన్న కేబినెట్ మీటింగ్ లో జగన్ రెడ్డి, తన జేగ్యాంగ్ కు జాగ్రత్తలు చెబుతున్నాడు.

15మందిని హతమార్చి వేలఎకరాలు కొల్లగొట్టిన పిన్నెల్లి, జగన్ రెడ్డికి ఎంతిచ్చాడు?
పల్నాడు ప్రాంతంలో వేలఎకరాల పేదలభూములు కబ్జాచేసిన వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తనకు అడ్డొచ్చారు, ప్రశ్నించారన్న అక్కసుతో 15మందిని దారుణంగా హతమార్చాడు. పిన్నెల్లి దోపిడీ ముఖ్యమంత్రికి తెలియదంటే నమ్మాలా? వైసీపీ ఎమ్మెల్యే దోచుకున్న భూముల్లో జగన్ రెడ్డికి అందిన వాటా ఎంతో ఆయనే చెప్పాలి. జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వ అవినీతి వల్ల అంతిమంగా ప్రజలు బలవుతున్నారు. ఒక్క ఛాన్స్ అని నమ్మించి, అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తనదోపిడీతో చివరి ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏరాజకీయపార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి జగన్ రెడ్డి చేశాడు. కొండలు, గుట్టలు, అడవులు, ఊళ్లకు ఊళ్లే వైసీపీనేతల అవినీతికి కనుమరుగయ్యాయి. జగన్ రెడ్డి దోపిడీదెబ్బతో నామరూపాల్లేకుండా పోయిన రాష్ట్రాన్ని, దిక్కుతోచని స్థితిలోఉన్న ప్రజల్ని కాపాడే శక్తి, ఒక్క చంద్రబాబుకే ఉంది. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా చంద్రబాబుతో, తెలుగుదేశంతో కలిసి నడవాలి” అని బొండా పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE