పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్ధుల భవిష్యత్తుల్లో వెలుగులు నింపే పాఠశాలలు మూసేయటం సిగ్గుచేటు
ఎయిడెడ్ విద్యాసంస్ధల ఆస్తులు కాజేందుకు జగన్ కుట్ర పన్నారు
– టీ.ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధ్యక్ష్యులు,ఎం.వి ప్రణవ్ గోపాల్
రాష్ట్రంలో వైసీపీ పాలన తీరు వింతగా ఉంది. కుటుంబాల్లో చిచ్చు బెడుతున్న మద్యం దుకాణాలు, యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న గంజాయి స్ధావరాల్ని మూసేయమని ప్రజలు కోరుతుంటే వాటి గురించి పట్టించుకోని జగన్ రెడ్డి పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లు, పేద విధ్యార్ధుల భవిష్యత్తులో వెలుగులు నింపే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేయటం సిగ్గుచేటు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్ ని నాశనం చేసే వాటిని ప్రోత్సహించటం బాధాకరం. జగన్ రెడ్డి… మూసేయాల్సింది పాఠశాలలు కాదు, మీకు చేతనైతే రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, గంజాయి స్ధావరాలు, పేకాట క్లబ్బులు మూసేయాలి.
విద్యా రంగంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో ఏళ్ల క్రితమే సమాజంలో విధ్యకున్న ప్రాముఖ్యతను గ్రహించి ఎంతోమంది దర్మకర్తలు, దాతలు స్ఠలాలు, ఆస్తులు ఇచ్చి ఎయిడెడ్ పాఠశాలల స్ధాపనకు కృషి చేశారు. కానీ నేడు ఆధునిక యగంలో ఉన్నా..ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం విధ్యార్ధుల భవిష్యత్ ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటూ విధ్యా రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పునరుజ్జీవింపజేయొచ్చో పరిశీలించకుండా, వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణం. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్య దూరమవుతుంది, రూ.వేల కోట్ల విలువైన భూములు కైంకర్యం అవుతాయి. సంపద సృష్టించటం చేతకాక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతున్న జగన్ రెడ్డికి ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్ధల ఆస్తులపై కన్నుపడింది. ఎయిడెడ్ పాఠశాలలు మూసి వేసి వాటి ఆస్తుల్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తేవాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. అందుకే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేందుకు కుట్ర పన్నారు.
మాకు అమ్మఒడి వద్దు మా స్కూలు మాకు కావాలని విధ్యార్ధులు నినదిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం విద్యార్ధుల జీవితాల్ని బలి చేయకుండా ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకోవాలి. ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఎలా నడుస్తున్నాయో ప్రభుత్వం పరిశీలించాలి. ఎయిడెడ్ విద్యా సంస్థల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని నూతన జాతీయ విద్యా విధానం స్పష్టంగా చెప్పింది, కేరళ ప్రభుత్వం ఆ విధంగానే చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని మన రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు నిలదొక్కుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి. లేకుంటే విద్యార్ధుల తరపున పోరాటం చేస్తాం.