Suryaa.co.in

Andhra Pradesh

మల్లేశ్ లేఖలోని అంశాలపై జగన్ రెడ్డి నోరు విప్పాలి

• మల్లేశ్ ను కాపాడి, అతని కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత వైసీపీప్రభుత్వంపై ఉంది
• సాటి ఉపాధ్యాయులు, ఉద్యోగులందరి సంతోషం, సంక్షేమానికి సంబంధించిన అంశాలనే మల్లేశ్ లేఖలో ప్రస్తావించాడు
• ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి ముఖ్యమంత్రే కారణం.
• జగన్ కు, వై.ఎస్.కుటుంబానికి వీరాభిమాని అయిన మల్లేశే ఇలాంటి పనిచేశాడంటే, మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు
• మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి కారకుడైన ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ఆ దిశగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి.
• ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది 3 నెలలు ఓపిక పట్టాలి.
•టీడీపీప్రభుత్వం రాగానే వారి న్యాయబద్దమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కరిస్తుంది.
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చినముష్టురు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయ త్నం చేయడానికి కారణం జగన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడమేనని, సీపీఎస్ రద్దు చేస్తాననిచెప్పి.. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చడంతో మల్లేశ్ లాంటి ఎందరో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని, జగన్ రెడ్డి బాధితుల్లో ప్రజలతో పాటు ఉపాధ్యా యులు కూడా చేరారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“ 2019లో జగన్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ నాలుగేళ్లలో బాగా జ్ఞానోదయం అయ్యింది. మల్లేశ్ ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు ముఖ్యమంత్రికి 5 పేజీల లేఖ రాశాడు. ఆ లేఖలో జగన్ రెడ్డిని నమ్మి తాను ఎలా మోసపోయింది.. తాను వై.ఎస్.కుటుంబానికి ఎంత వీరాభిమానో తెలియచేస్తూ అనేక అంశాలు తెలియచేశాడు. సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ రెడ్డి హా మీని మల్లేశ్ బాగా నమ్మాడు. అది ఒక సంవత్సరంలో అవ్వడమే గొప్ప అని సాటి ఉపాధ్యాయులు అన్నప్పుడు.. జగన్ పై తనకున్న వెర్రి అభిమానంతో లేదు వారంలో చేస్తాడని మల్లేశ్ బెట్టింగ్ కట్టాడు. ఆ విధంగా కూడా మల్లేశ్ తీవ్రంగా నష్టపోయాడు.

జగన్ రెడ్డిని నమ్మి మోసపోయిన జాబితాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా చేరడం నిజంగా బాధాకరం
జగన్ రెడ్డి హామీలను నమ్మి మోసపోయిన జాబితాలో ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరడం నిజంగా బాధాకరం. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక దాని గురించి పూర్తిగా తెలియక హామీ ఇచ్చామని నాలుక మడతేశాడు. సీపీఎస్ కంటే జీపీఎస్ బాగుంటుంది అంటూ బలవంతంగా ప్రభుత్వం ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. 27 శాతం ఐఆర్ ఇచ్చి.. 23 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ద్వారా దేశంలోనే జగన్ రెడ్డి రివర్స్ పీఆర్సీని రాష్ట్రంలో అమలుచేశాడు. జీతాలు.. పెన్షన్లు తగ్గేలా మోసం చేశాడు.

ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ దాదాపు 185 ఇన్ స్టాల్ మెంట్స్ బకాయి పెట్టింది. రిటైర్మెంట్ సమయంలో ఇస్తాముంటున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంచి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏలను తరువాత వచ్చే ప్రభుత్వంపై నెట్టే ప్రయ త్నం చేస్తోంది. ఈ ప్రభుత్వం పెట్టిన డీఏ బకాయిల్ని వచ్చే ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం ఏమిటి? సీపీఎస్ కాంట్రిబ్యూషన్ ను 7 నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా కచ్చితంగా తనకు 1వ తేదీన జీతం వస్తుందని చెప్పలేకపోతున్నాడు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి.

గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని బదిలీచేసినప్పు డు మూడు, నాలుగు నెలల పాటు జీతాలు ఆపేసింది. తామే అధికారంలోకి వస్తాం.. ఉద్యోగులకు న్యాయంచేస్తామని జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఎట్టిపరిస్థితుల్లో మరలా జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముంది టీడీపీప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని బాధ్య తాయుతంగా పనిచేయమన్నది తప్ప, వారితో చేయకూడని పనులు చేయించలేదు
మల్లేశ్ ఒక్కడే కాదు.. ప్రభుత్వ ఉపాధ్యాయులందరి పరిస్థితి అలానే ఉంది. ఈ ప్రభుత్వంలో వారు విద్యాబోధన కంటే ఎక్కువగా ఇతర కార్యక్రమాలకు పరిమిత మవ్వాల్సిన పరిస్థితి. ఉద్యోగుల్ని.. ఉపాధ్యాయుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని దుస్థితిలో జగన్ రెడ్డి సర్కార్ ఉంది. ఉద్యమాలు చేయడం అనేది ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కు. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం వారు గొంతెత్తితే.. ఆయా సంఘాల నేతల్ని ప్రభుత్వం కేసులతో భయపెడు తోంది. జగన్ రెడ్డిని నమ్మిన ఉద్యోగులకు నాలుగేళ్ల ఆయన పాలన చూశాక కనువిప్పు కలిగిందనే అనుకుంటున్నాం.

ఉపాధ్యాయుడు మల్లేశ్ తన లేఖలో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబునాయుడు చాలా నయం అని రాశాడు. కాబట్టి ఉపాధ్యాయులు.. ఉద్యోగులకు తాము ఒకటే చెబుతున్నాం. ఎవరూ తొందరపడి జీవితాలు పాడుచేసుకోవద్దని సూచిస్తున్నాం. 3 నెలలు ఓపికపడితే టీడీపీ ప్రభుత్వం రాగానే బాగుంటుందని చెబుతున్నాం.

టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులు.. ఉద్యోగుల్ని బాధ్యతాయుతంగా పనిచేయమన్నది తప్ప… జగన్ రెడ్డిలాగా చేయకూడని పనులు చేయించి..నిర్దాక్షణ్యంగా వేధించలేదు. దుర్మార్గపు చర్యలకు పాల్పడలేదు. ఉద్యోగుల విషయంలో టీడీపీ ఎప్పుడూ సానుభూతితోనే ఉంది. కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఎప్పుడూ ప్రధానంగా జీతాలు పెంచమని కోరలేదు. తమ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఇప్పించాలని కోరుతున్నారు. అదేమీ తప్పుకాదు.

మల్లేశ్ లేఖలోని అంశాలపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే. సాటి ఉపాధ్యాయులు, ఉద్యోగులందరి సంతోషం, సంక్షేమానికి సంబంధించిన అంశాలనే మల్లేశ్ లేఖలో ప్రస్తావించాడు
సీపీఎస్ రద్దు హామీ యొక్క సాధ్యాసాధ్యాల పరిశీలనకు గతంలో ఠక్కర్ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ అభిప్రాయాలు..సూచనలు పక్కన పెట్టి మరలా జీపీఎస్ విధానం తెరపైకి తెచ్చింది. ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది, కాంట్రాక్ట్- ఔట్ సోర్సింగ్ సిబ్బంది, చిన్నచితకా ఉద్యోగుల కుటుంబాల రేషన్ కార్డులు తీసేశారు.

ఈ అంశంపై టీడీపీ కచ్చితంగా ఉద్యోగులకు మేలుజరిగే నిర్ణయమే తీసుకుంటుంది. నిరాశానిస్పృహలతో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సూచిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, ప్రతినిధులతో చర్చించి, వారికి అనుకూలమైన, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. మల్లేశ్ కు జరిగంది ఇకపై జరక్కూడదని కోరుతున్నాం. మల్లేశ్ లేఖపై ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిందే.

తన లేఖలో మల్లేశ్ వెల్లడించిన అంశాలు.. సాటి ఉద్యోగులు, ఉపా ధ్యాయులందరి సంక్షేమం, సంతోషానికి సంబంధించినవే. కాబట్టి జగన్ రెడ్డి మల్లే శ్ లేఖపై తక్షణమే నోరు విప్పాలి. మల్లేశ్ విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరుతో, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టవచ్చేమో అనే దిశగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి.” అని అశోక్ బాబు సూచించారు.

LEAVE A RESPONSE