Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హంతకులను కాపాడుతున్న జగన్ రెడ్డి రాజీనామా చేయాలి

వివేకా హంతకులను కాపాడుతున్న జగన్ రెడ్డి, నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి
– చంద్రబాబు కుటుంబంపై చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– హంతకులతో ప్రభుత్వం కుమ్మక్కవడం పోలీస్ శాఖకే మాయనిమచ్చ.
– టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

వైఎస్ వివేకానందరెడ్డి ని చంపిన హంతకులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందని సుప్రీం కోర్టులో దాఖలైన అఫిడవిట్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిచెప్పి, ఆ నెపాన్ని నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రజలకు అబద్దాలు ప్రచారం చేసింనందుకు గాను రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా జగన్ క్షమాపణలు చెప్పా ‘‘వివేకాహత్యకేసు నిందితులతో రాష్ట్రప్రభుత్వం కుమ్మక్కైంది అనడానికి ముఖ్యమంత్రి వైఖరి, సీబీఐ అఫిడవిట్ లోని అంశాలే నిదర్శనం.

సొంత బాబాయ్ హత్యపై గతంలో అసెంబ్లీలో రెండుకళ్ల సిద్ధాంతాన్ని వల్లెవేసిన జగన్ రెడ్డి, తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్ పై ఏ సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి నేత్రత్వంలో రాక్షసపాలన సాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివేకానందరెడ్డి హత్యజరిగిన నాడు చంద్రబాబు, ఆయన కుటుంబంపై, టీడీపీప్రభుత్వంపై నారాసురరక్తచరిత్ర అంటూ హత్యారోపణలు చేసిన జగన్ రెడ్డి, నేడు ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు?

నైతికవిలువలకు తిలోదకాలిచ్చి, నవ్విపోదురుగాక నాకేంటిసిగ్గు అనే తీరుతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఖరితో రాష్ట్రప్రతిష్ట మంటగలిసింది. జగన్ రెడ్డి తన తల్లి విజయమ్మ కుటుంబం పక్షాన ఉన్నాడా…లేక భార్య భారతి కుటుంబం పక్షాన ఉన్నాడో తేల్చిచెప్పాలి. వివేకాహత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలంచూస్తే, ఏపీప్రభుత్వం హత్యకేసు నిందితులను కాపాడటానికి ప్రయత్నిస్తోందని రూఢి అవుతోంది. విచారణ సంస్థ సీబీఐ కూడా ఏపీ పోలీసులు, హత్యకేసు నిందితులను రక్షించడానికి పాటుపడుతున్నారనడం దేనికి సంకేతమో జగన్ రెడ్డి చెప్పాలి. సొంత బాబాయ్ హత్యకేసుపై మీడియా, ప్రజలు కోడైకూస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టుకూడా లేదు.

బాబాయ్ తనకు ఒకకన్ను అని, అవినాశ్ రెడ్డి రెండోకన్ను అని గతంలో అసెంబ్లీలో హితోక్తులు చెప్పిన జగన్ రెడ్డి, సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్ పై ఏంసమాధానం చెబుతాడు? తన రెండుకళ్లసిద్ధాంతంతో, పరోక్షంగా సీబీఐని కట్టడిచేసి, ఎవరిని కాపాడటానికి జగన్ ప్రయత్నించాడని ప్రశ్నిస్తున్నాం. వివేకాహత్యజరిగిన నాడు ఘటనాస్థలానికి వెళ్లి, అక్కడి ఆధారాలను మాయంచేయడానికి ప్రయత్నించిన సీఐ శంకరయ్య సీబీఐకి 164 సీఆర్పీసీ స్టేట్ మెంట్ ఇస్తానని చెప్పగానే అతన్ని ప్రలోభపెట్టడానికి ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నించారు? తూతూమంత్రంగా అతన్ని విధులనుంచి తప్పించి, తరువాత ఆనాడున్న డీజీపీని అతనివద్దకు రాయబారానికి పంపి మంతనాలుజరపలేదా?

అటుపిమ్మట శంకరయ్యకు మరలా పోస్టింగ్ ఇచ్చి, అతనిపై ఈగ వాలకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది? వివేకాహత్యకేసు విచారణపై వై.ఎస్.సునీత దాఖలు చేసిన పిల్ లోని అంశాలతో సీబీఐ ఏకీభవించడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం మూకుమ్మడిగా హంతకులతో చేయికలిపింది అనడానికి నిదర్శనంకాదా? వివేకాహత్యకేసు విచారణ వేరేరాష్ట్రానికి బదిలీకావడం, ముఖ్యమంత్రి స్థానానికి, స్థాయికి అవమానం కాదా? ఏపీ పోలీస్ వ్యవస్థ పరువుప్రతిష్టలకు మాయనిమచ్చకాదా?

వివేకా హత్య ఉదంతాన్ని చంద్రబాబుకి, ఆయనకుటుంబానికి ఆపాదించి.. చేయరాని తప్పులు చేసినజగన్, నేడు వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. తన తప్పుఒప్పుకొని, టీడీపీఅధినేత చంద్రబాబుకి, ఆయనకుటుంబానికి, తెలుగుప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. సొంత బాబాయ్ హత్య కేసును తేల్చలేని జగన్..రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. తక్షణమే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి” అని అర్జునుడు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE