• ఎన్నికల్లో లబ్ధికోసమేనని పసిగట్టిన పశ్చిమ ప్రకాశం జిల్లా రైతులు
• గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో 3 గేట్లు పెట్టని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రారంభిస్తుంటే పశ్చిమ ప్రకాశం వాసులు ఫక్కున నవ్వుకున్నారు
• ప్రాజెక్ట్ పరిధిలో 11 ముంపు గ్రామాలుంటే, 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది
• ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పూర్తికాలేదు
• డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంతో పాటు, వాటిపై వంతెనలు నిర్మించాల్సి ఉంది
• యుద్ధప్రాతిపదికన పనులు చేసినా ప్రాజెక్ట్ పూర్తికావడానికి ఏడాదిన్నరకు పైగా పడుతుంది
– టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో జగన్ రెడ్డి అతిపెద్ద డ్రామా నడిపాడని, మొత్తం నిర్మాణం పూర్తికాకుండా, ఇంకా రూ.2వేల కోట్ల విలువైన పనులు పెండింగ్ లో ఉండగానే హడావుడిగా ప్రాజెక్ట్ ప్రారంభిం చడం, 11ముంపు గ్రామాలు ఖాళీ చేయించడం, 7వేల మంది ముంపు రైతుల కు రూ1500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండటం లాంటి ఘట్టాలన్నీ జగన్ ఆడిన డ్రామా వెనుక దాగిన ప్రధాన ఘట్టాలని టీడీపీ శాసనసభ్యుల ఏలూరి సాంబశివ రావు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రబడ్జెట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి 100రూ.లు కూడా ఖర్చుపెట్టకుండానే సదరు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం పేరుతో నేడు జగన్ రెడ్డి ఆడిన డ్రామాలు చూశాక ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులు నయవంచనకు, మోసానికి, నమ్మకద్రోహానికి ముఖ్యమంత్రి నిలువెత్తు నిదర్శమని చెప్పుకుంటున్నారు.
పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని, 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల ప్రజలకు తాగునీరు అందించే గొప్ప ప్రాజెక్ట్… చంద్రబాబు మానసపుత్రిక వెలిగొం డ ప్రాజెక్ట్. 2014 నుంచి 2019వరకు నిరంతరాయంగా ప్రాజెక్ట్ పనులు జరిగేలా చంద్రబాబు ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే వెలిగొండ 2020 నాటికే పూర్తయ్యేది, ప్రకాశంజిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండేవి.
జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లకాలం వృథా చేసి, చివరకు ఎన్నికల ముందు పూర్తికాని ప్రాజెక్ట్ ను ప్రారంభించడం నిజంగా ఆయన సిగ్గు పడాల్సిన విషయం. కుప్పంలో కూడా హంద్రీనీవా బ్రాంచ్ కాలువకు నీళ్లువదిలే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఇలానే డ్రామాలు ఆడాడు. మరో 45రోజుల్లో జగన్ రెడ్డి…అతని ప్రభుత్వ డ్రామాలకు తెరపడుతుంది.
11 ముంపు గ్రామాల్లోని 7వేల మంది నిర్వాసిత రైతులకు రూ.1500కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ముతో పాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ4వేల కోట్లు ఖర్చు అవుతుంది
పెద్దారవీడు, ఆర్థవీడు, మార్కాపురం మండలాల్లో 11ముంపు గ్రామాలున్నాయి. ఒక్కోరైతుకి రూ.12.50లక్షల చొప్పున 7,000 మంది రైతులకు రూ. 1500 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. జగన్ రెడ్డి హాయాంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.10వేలకోట్లకు పెరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా రూ.4వేలకోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వలెక్కలే చెబుతున్నాయి.
రెండో సొరంగం వ్యాసార్థం తగ్గిం చిన జగన్ ప్రభుత్వం, ఫీడర్ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయలేదు. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పూర్తికాలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మా ణంతో పాటు, వాటిపై నిర్మించాల్సిన వంతెనల పనులు ప్రారంభం కాలేదు. సొరంగం లోపల లైనింగ్ పని చేయడానికే ఇంకా ఏడాది సమయం పడుతుంది. యుద్థప్రాతిపదికన పనులు చేస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తికావడానికి సంవత్స రంన్నరకు పైగా సమయం పడుతుంది.
నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.1500 కోట్లతో పాటు నిర్మాణానికే రూ.2,500కోట్లవరకు ఖర్చు అవుతుంది. ఈ రకంగా అసమగ్రంగా ఉన్న ప్రాజెక్ట్ ని అట్టహాసంగా ప్రారంభించడం జగన్ రెడ్డికే చెల్లింది.
4 ఏళ్ల 9నెలల పాటు వెలిగొండ ప్రాజెక్ట్ ముఖం చూడని జగన్ రెడ్డి, ఇప్పుడు హడావుడిగా పనులు పూర్తికాకుండానే ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎన్నికల్లో లబ్ధి కోసమేనని ప్రజలకు అర్థమైంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్టు కొట్టుకుపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రారంభిస్తుంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఫక్కున నవ్వుతున్నారు
గతంలో టీడీపీప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. తొలి సొరంగం తవ్వకం పనులు 2014 నాటికే 11 కిలోమీటర్లు పూర్తికాగా, కేవలం ఐదేళ్లలో అతిక్లిష్టమైన తవ్వకం పనుల్ని చంద్రబాబు 17 కిలోమీటర్లవరకు పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ ను పూర్తిస్థాయిలో చేయించారు.
రెండో సొరంగం తవ్వకం పనుల్ని కూడా 3 కిలోమీటర్లవరకు పూర్తిచేయించారు. తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడటం… ఎక్కడి పనులు అక్కడి నిలిచిపోవడం జరిగింది. 4 ఏళ్ల 9నెలలపాటు ప్రాజెక్ట్ ముఖం చూడని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధికోసం ప్రకాశంజిల్లా ప్రజల్ని వంచించడానికి తూతూమంత్రంగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో 3గేట్లు కొట్టుకుపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదం.
వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రకాశం జిల్లాకు నీరుఅందించే నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని 4.50లక్షల ఎకరాలు బీడుపడింది. పట్టిసీమ నీటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో కొమ్మమూరు కాలువ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 3.50లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
జగన్ రెడ్డి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ప్రారంభించలేదు. మెట్టప్రాంత రైతులకు ఎంతగానో ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని జగన్ పూర్తిగా రద్దుచేశాడు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లా రైతాంగానికి జరిగిన నష్టం జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టడం జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే వ్యవసాయరంగంపై జగన్ రెడ్డికి ఉన్న చిన్నచూపు దేశంలో మరే నాయకుడికి లేదు..భవిష్యత్ లో కూడా ఉండబోదు. రైతుల ప్రయోజనాలు పూర్తిగా విస్మరించిన జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి అదే రైతులు గట్టిగా బుద్ధిచెబుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసి, పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చి, 4.50లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు అందిస్తారు.” అని సాంబశివరావు చెప్పారు.