– మత్స్యకారుల పరిహారం 6నెలలుగా తొక్కిపట్టింది మీరు కాదా..?
– ఇవ్వాల్సిన దానిలో సగం పెండింగ్ పెట్టింది మీరు కాదా..?
– దుష్టబుద్ది, వక్రబుద్ది జగన్ రెడ్డిదే
– టిడిపి పోలిట్ బ్యూరో మెంబరు యనమల రామకృష్ణుడు
ముమ్మడివరం నియోజకవర్గం మురుముళ్లలో సిఎం జగన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సొమ్మొకడిది సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి. ఓఎన్ జిసి పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం కేంద్రం ఇచ్చేది. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. కేంద్రనిధులు కేంద్రానికి చెందినవారిని పిలవకుండా అదేదో తన ఘనకార్యంగా చెప్పడం విడ్డూరం. మత్స్యకారులకు ఈ పరిహారాన్ని 6నెలలుగా తొక్కిపట్టారు. ఇప్పుడిచ్చింది కూడా ఇవ్వాల్సిందానిలో సగమే.
6నెలలుగా పరిహారం ఇవ్వకుండా తొక్కిపట్టడం మత్స్యకారులను జగన్మోసం కాదా..? సగం మాత్రమే ఇచ్చి మిగిలిన సగం పెండింగ్ పెట్టడం జగన్మోసం కాదా..? సాక్షి మీడియా యాడ్స్ చెల్లింపుల్లో సగం ఇలాగే పెండింగ్ పెట్టారా..? సొంత మీడియాకో న్యాయం, మత్స్యకారులకో న్యాయమా..? మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత మీకుందా..? ఎంఎస్ ఎన్ ట్రస్ట్ ఆస్తులు కూడా కబ్జా చేయాలని మీరు చూడలేదా..? టిడిపి అడ్డుకోవడంతో వెనక్కి తగ్గడం నిజం కాదా..?
మత్స్యకారులను కాల్చి చంపిన చరిత్ర వైసిపిదైతే, వారిని ఆదుకున్న ఘనత టిడిపిది..వేట నిషేధ సమయంలో పరిహారం రెట్టింపు చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. డీజిల్ రాయితీ బకాయిల్లేకుండా చెల్లించింది మేమే..మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసింది, ఫిష్ మార్కెట్లు నెలకొల్పింది, పట్టాలిచ్చింది, ఇళ్లు నిర్మించింది మేమే.. జగన్ రెడ్డి మాటలు తేనెపూసిన కత్తులు.. మాయమాటలతో ఎన్నాళ్లు మోసం చేస్తారు మీరు..?
మీకు, మాకూ తేడా ఏంటో చెప్పాలా..? రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించింది మేమైతే విధ్వంసం చేసింది మీరు.. ఆస్తుల కల్పన చేసింది మేమైతే అప్పుల్లో ముంచింది మీరు.. రెండంకెల వృద్ధి సాధించింది మేమైతే, మైనస్ గ్రోత్ తెచ్చింది మీరు..మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసింది మేమైతే, పవర్ కట్స్ రాష్ట్రంగా చేసింది మీరు.. మీటర్లు లేకుండా రైతుల మోటార్లకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మేమైతే, మీటర్లు పెట్టి ఉరితాళ్లు తగిలిస్తోంది మీరు…ప్రాజెక్టులు నిర్మించింది మేమైతే, వాటిని దిష్టిబొమ్మలు చేసింది మీరు..ప్రజావేదిక నిర్మించింది మేమైతే, కూలగొట్టింది మీరు.. పేదలకు లక్షలాది ఇళ్లు కట్టింది మేమైతే వాటిని పాడుబెట్టింది మీరు.
తల్లి గర్భం నుంచి జీవితాంతం వరకు సంక్షేమం ఇచ్చింది మేమైతే పేదరికం పెంచింది మీరు.. అన్నా కేంటిన్లు పెట్టింది మేమైతే మూతేసింది మీరు.. పండుగ(రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి) కానుకలు ఇచ్చింది మేమైతే, రద్దు చేసింది మీరు..ఆదరణ పనిముట్లు ఇచ్చింది మేమైతే, తుప్పుపట్టేలా చేసింది మీరు. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించింది మేమైతే, పోగొట్టింది మీరు.. పెట్టుబడులు రాబట్టింది మేమైతే, పోగొట్టింది మీరు.. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది మేమైతే, బెదిరించి తరిమేసింది మీరు.. ఇలా చెప్పుకుంటూ పోతే మీ ఘోరాలు- నేరాలకు అంతేలేదు. మూడేళ్ల మీ నిర్వాకాలను ప్రజలే నిలదీస్తున్నారు…గడపగడపకూ మీవాళ్ల శృంగభంగాలు కనబడటం లేదా..? ఎన్నాళ్లని ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారు..? మూడేళ్లలో మీరేం చేశారో చెప్పే ధైర్యం లేదా..?
ఈడీ, సీబీఐ జప్తు చేసిన రూ 5వేల కోట్ల జగన్ అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడు జమచేస్తారు..? జగన్ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు జమచేస్తే ఇంత ఆర్ధిక సంక్షోభం ఉండేదా..? పేదల సంక్షేమ పథకాల్లో కోతలు పడేవా..? ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగేదా..? మీ దోపిడీకి, మీవాళ్ల నేరాలు-ఘోరాలకు ప్రజలే బుద్ది చెబుతారు. శ్రీలంకలో పాలకుల పట్టిన గతే ఇక్కడ మీకూ పడుతుంది. తరిమితరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.