– అనంతబాబు లాంటి హంతకులతో దళితుల్ని అడ్డుతొలగించుకోవాలన్నదే జగన్ రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తోంది
• రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం వేదికగా అనంతబాబు చేసిన నేరాలుఘోరాలు చెప్పనలవికానివి
• అనంతబాబు లాంటి నొటోరియస్ క్రిమినల్ కి, జగన్ రెడ్డి ఆయన పార్టీ అండగా ఉండటంపై దళితులు ఆలోచించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
దళితుల రక్షణ విషయంలో జగన్ రెడ్డి వైఖరి పాము తనపిల్లల్ని తానే మింగిన విధంగా ఉంద ని, ఎస్సీ, ఎస్టీల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం వారిని బలితీసుకునే వారిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అనడానికి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారమే నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అతిదారుణంగా చంపి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని రక్షించడంకోసం, అతన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడంకోసం, అతని బెయిల్ కోసం జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆదినుంచి ఎక్కడాలేని ఉత్సుకత చూపించింది. తనవద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని, అనంతబాబు దారుణంగా చంపినప్పుడు యావత్ రాష్ట్రమే నివ్వెరపోయింది.
అనంతబాబు ఒక్కడే కాదు, తమవద్ద పనిచేసేదళితుల విషయంలో వైసీపీనేతల వైఖరి చాలాచాలా దారుణంగా ఉంటోంది. పాము తన పిల్లల్ని తానే మింగేసినట్టుగా జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం దళితుల్ని పొట్టనపెట్టుకుంటోంది. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడా నికి ముఖ్యమంత్రి ఆదినుంచీ దళితవర్గాలనే ఇబ్బంది పెడుతున్నాడు. దళితుల్ని చంపేవా రికి, వారిపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడేవారికి జగన్ రెడ్డి సహకరించడం క్షమించరాని నేరం.
అనంతబాబు లాంటి నొటోరియస్ క్రిమినల్ని కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నించడమేంటి?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పెద్ద నొటోరియస్ క్రిమినల్. అనంతబాబు క్రైమ్ రికార్డ్ చూస్తే, ఎవరూ అతన్ని సమర్థించరు. సుబ్రహ్మణ్యాన్ని బలితీసుకున్న ఘటనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, టీడీపీ ఇతరప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలుచేస్తే, ముఖ్యమంత్రి తూతూమంత్రంగా అతన్ని అధికారపార్టీనుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అనంతబాబు జైలుకు వెళ్లినా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అతనితో రాజమహేం ద్రవరం జైల్లో పోటీలు పడి ములాఖత్ లు జరిపి, తామంతా అండగా ఉంటామంటూ అతనికి ధైర్యంచెప్పి, భరోసాఇచ్చారు. వైసీపీ నుంచి అనంతబాబుని సస్పెండ్ చేసినప్పుడు, మరలా సిగ్గులేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీవారే అతని ప్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు నిర్వహించడం ఏమిటి?
అంతకంటే సిగ్గుమాలిన తనం మరోటి ఉంటుందా? సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కూడా స్థానిక ఎస్పీ అనంతబాబుని గారు అని సంబోధిస్తూ, అతని తప్పేలేదనట్లు మాట్లాడిన తీరే ప్రభుత్వ వైఖరిని తేటతెల్లంచేసింది. హత్యకేసు తాలూకా సీడీఫైల్ లో కూడా పోలీసులు అనంతబాబుకి క్లీన్ చిట్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్యకేసు విచారణపై పోలీసులు అనంతబాబుకి తొత్తులుగా మారి, ఆదినుంచీ అతనికి అనుకూలంగా వ్యవహరించారు. విచారణను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి ప్రయత్నించి, అతనికి బెయిల్ వచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
సుబ్రహ్మణ్యం హత్యను పక్కదారి పట్టించడానికే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టే నెపంతో ప్రభుత్వం పచ్చనిప్రాంతంలో చిచ్చురాజేసింది. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని హత్యచేసేవారిని, వారిని హింసించి, అవమా నించే వారిని కాపాడటానికి దేనికైనా తెగిస్తాడని చెప్పడానికి అనంతబాబు వ్యవహారమే పెద్దనిదర్శనం. సుబ్రహ్మణ్యం హత్యకేసుపై దళితసంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు ఆలోచన చేయాలి.
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం వేదికగా అనంతబాబు చేసిన నేరాలుఘోరాలు చెప్పనలవికానివి. అలాంటి వ్యక్తికి, జగన్ రెడ్డి ఆయన పార్టీ అండగా ఉండటంపై దళితులు ఆలోచించాలి సుబ్రహ్మణ్యాన్ని చంపడమేకాదు… డాక్టర్ సుధాకర్ మొదలు, కిరణ్, విక్రమ్, ఓం ప్రతాప్ లాంటి ఎందరో జగన్ రెడ్డి దుర్మార్గపాలనకు బలయ్యారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణ జైలుకు వెళ్లింది ఈ ప్రభుత్వ వల్లకాదా? అనంతబాబు లాంటి సంఘవిద్రోహశక్తిని జగన్ రెడ్డి మరలా దళితులపైకి వదలబోతున్నాడు.
అనంతబాబు బెయిల్ పై ప్రభుత్వానికి ఆసక్తిలేకుంటే, అతని కేస్ సీడీఫైల్ లో పోలీసులు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? అనంతబాబు బెయిల్ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ ప్రమేయం లేకుంటే, సుబ్రహ్మణ్యం హత్యకేసు విచారణను సీబీఐకి ఎందుకివ్వలేదు? ఏ దళితులు అయితే జగన్ రెడ్డిని గద్దెనెక్కించారో, అదే దళితులు ఆయన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని ఆనంద్ బాబు తెలిపారు.