Suryaa.co.in

Andhra Pradesh

కార్యరూపం దాల్చని ప్రాజెక్ట్ పై కట్టుకథలు అల్లుతున్న జగన్ రెడ్డి సర్కార్

– అసలు వేయని రోడ్డులో రూ.2,400కోట్ల లబ్ధి జరిగిందనడం రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్న దుష్ప్రచారం కాక మరేమిటి?
– టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో సహా టీడీపీ సభ్యులు, విలేకరుల ముందు ఉంచిన పంచుమర్తి అనురాధ

రాజధాని లేని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని భావించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల ప్రకారం నీటి వసతి, రవాణా సౌకర్యం ఉండి, రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని రాజధాని నిర్మాణా నికి ఎంపిక చేశారని, అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి కూడా టీడీపీప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో స్వాగతించారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.

రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతి ప్రాంతంలో నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని నేడు జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచన నాటి ప్రభుత్వం చేసింది తప్ప, ఎక్కడా ఒక్క ఎకరం భూసేకరణగానీ, ప్రభుత్వం తరుపున నిధులు కేటాయించ డం గానీ, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం గానీ ఏమీ జరగలేదని, ఏమీ లేని దానిలో అవినీతి జరిగిందని చెప్పడం పిచ్చివాగుడేనని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఇలాంటి పిచ్చి అంశాల ను తెరపైకి తెస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి అనురాధ వెల్లడించిన వివరాలు..ఆమె మాటల్లోనే …

ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ – వాస్తవాలు
రూపాయి అవినీతికి ఆస్కారం లేని ప్రాజెక్ట్… ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై టీడీపీ ప్రభుత్వంలో కేవలం చర్చ మాత్రమే జరిగింది. అదికూడా ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. రాజధాని అమరావతి ప్రాంతానికి ఇతర ప్రాంతాలను అనుసంధానిస్తూ ఉన్న రోడ్లను కలుపుతూ ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కోసం నాటి రాష్ట్రప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై చర్చించింది. దానిలో భాగంగా సింగపూర్ కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ సుర్భానా జూరాంగ్ వారు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను అనుసరించి స్టుప్ (STUP) కన్సల్ టెంట్ సంస్థ దీనిని తయారు చేసింది.

సుర్భానా జూరాంగ్ ప్రపంచ స్థాయి సంస్థ కాగా స్టుప్ సంస్థ దేశంలో ముంబై, పూణే హైవేతో సహా అనేక ప్రాజెక్టులను చేపట్టిన నేపథ్యం ఉన్న సంస్థ. స్టుప్ తయారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు ముసాయిదాలో మూడు ఆప్షన్ లు ఇవ్వగా ఏపీ సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో 08.02.2017న (101/2017) తీర్మానంలో ఒక ఆప్షన్ ఎంచుకుని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన తరువాత 12.02.2018న (202/2018) సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ముసాయిదాను ఆమోదించారు.

ఈ ముసాయిదాను 17.02.2018న ప్రముఖ దినపత్రికలలో ప్రచురించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 30 రోజుల లోపున ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. వచ్చిన 1185 అభ్యంతరాలు మరియు సూచనలను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేయించి వాటికి అనుగుణంగా మార్పులు చేశారు. 10 రోజుల పాటు వీరితో చర్చలు కూడా జరిపారు. ఈ విధంగా తయారైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ తుది ప్రణాళికను ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు 10.09.2018న సిఫారసు చేయగా దానిని సీఆర్డీఏ అథారిటీ వారు 19.09.2018న ఆమోదించారు. ఈ తుది నమూనా ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు 75 మీటర్ల వెడల్పుతో 96.25 కిలోమీటర్ల మేరకు, అమరావతిలోని 27 రోడ్లను కలుపుతూ 87.19 కిలోమీటర్ల రోడ్డును ప్రతిపాదించారు.

ఈ రోడ్డు నిర్మాణంలో 41 గ్రామాలలో 3521.76 ఎకరాల భూమి అవసరం అవుతుందని అమరావతిని కలిపే 27 రోడ్లకు గాను 109.88 ఎకరాల భూమి అవసరం అవుతుందని నిర్థారించారు. ఈ 41 గ్రామాలలో ఏయే సర్వే నెంబర్ల నుండి రోడ్డు వెళుతుందో సర్వే నెంబర్లతో సహా బహిరంగంగా ప్రచురించారు. మే 2023లో సమాచార హక్కు చట్టం క్రింద ఏపీ సీఆర్డీఏ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు. ఆ పనిని మొదలు పెట్టలేదు. ఏ రకమైన బడ్జెట్ ను కేటాయించలేదు. 2018 సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడంతోనే ఆగిపోయింది.

కార్యరూపం దాల్చని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై వైసీపీ కట్టుకథలు .. వాస్తవాలు
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 27.04.2022న ఏపీ సీఐడీ వారికి ఈ రోడ్డును ప్రతిపాదించడంలో చంద్రబాబునాయుడు, నారాయణ కుట్ర చేసి హెరిటేజ్, రామకృష్ణా హౌసింగ్ మరియు లింగమనేని సంస్థలకు వేల కోట్ల రూపాయలు లబ్ధి కలిగే విధంగా అవకతవకలకు పాల్పడి అధికార దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు.

వెంటనే ఏపీ సీఐడీ వారు 06.05.2022 న రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే కేవలం వారం రోజుల్లో ఇంత పెద్ద వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు ముగించడం, రామకృష్ణారెడ్డి ఆరోపణలను దృవీకరించడం సీఐడీ విభాగం 16/2022 నెంబర్ తో 09.05.2022న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం అంతా ఆఘ మేఘాలపై జరిగిపోయింది. ఇది జరిగాక గత 16 నెలల్లో నారాయణ, లింగమనేని రమేష్, రామకృష్ణ సంస్థలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడానికి, వారి ఆస్థులను జప్తు చేయడానికి సీఐడీ చేయని ప్రయత్నం లేదు. సీఐడీ ఎవరిపై అయితే తప్పుడు ఆరోపణలు చేసి, విచారణ పేరుతో వేధించిందో వారందరూ కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. దాంతో ఆ కథ అప్పుడే ముగిసింది.

దాన్ని మరలా బయటకు తీసి ఇప్పుడు చంద్రబాబుని, లోకేశ్ ను అదే కేసులో విచారిం చడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబుని ఎలాగైనా జైల్లోనే ఉంచాలనే, ఆధారాల్లేని… అసలే మాత్రం అవినీతి జరగని వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని సుస్పష్టంగా అర్థమవు తోంది. కాగితాల్లో తప్ప కనిపించని ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.2400 కోట్లు అక్రమంగా లబ్ది పొందారని జగన్ రెడ్డి జేబు సంస్థ సీఐడీ.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

ఆరోపణ -1 : నామినేషన్ పద్దతిపై సుర్భానా జూరాంగ్ కు చంద్రబాబు మరియు నారాయణ కలిసి మాస్టర్ ప్లాన్ లు తయారు చేసే పనిని అప్పగించి తమకు నచ్చిన విధంగా తయారు చేయించి దానికి గాను ఆ సంస్థకు ప్రజల సొమ్ము దోచిపెట్టారు.
సమాధానం : 2015లో ఏపీ సీఆర్డీఏ వారు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం టెండర్లు పిలిస్తే, రెండు సంస్థలు దరఖాస్తు చేసినా అవి రెండు అర్హత పొందలేదు. రెండవ సారి టెండర్లు పిలిచినా అదే జరిగింది. సింగపూర్ ప్రభుత్వం సిఫారసు చేసిన సుర్భానా జూరాంగ్ అనే సంస్థ వారికి సింగపూర్ తో సహా అనేక దేశాలలో ప్లానింగ్ మీద అనుభవం ఉంది.. అందువల్ల మరియు రెండు సార్లు అర్హత ఉన్న కంపెనీలు టెండర్లద్వారా రానందున ఈ సంస్థకు అప్పగించారు. మాస్టర్ ప్లాన్ తయారీలో వందల కిలోమీటర్ల మేరకు ప్రణాళికను తయారు చేస్తారు. అందులో దురుద్దేశాలు ఉన్నాయని అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ చెప్పిన విధంగా జరిగిందని చెప్పడం హాస్యాస్పదం. ఈ మాస్టర్ ప్లాన్ తయారీకి గాను ఈ సంస్థకు మొత్తం చెల్లించినది రూ.14.80 కోట్లు. ఒక అంతర్జాతీయ సంస్థకు ఒక నగర నిర్మాణం కోసం ప్రణాళిక తయారు చేయడానికి ఇచ్చిన మొత్తం ఇది. ఈ సొమ్ములో కూడా కుంభకోణం ఉందంటున్నారంటే జగన్ అండ్ కో మానసిక స్థితినిచూసి నిజంగా జాలి పడాలి.

ఆరోపణ – 2 : స్టుప్ కన్సల్టెంట్ సంస్థ వారు తమ ముసాయిదాలో ఇచ్చిన 3 ఆప్షన్ లలో 1వ ఆప్షన్ ను ఎంపిక చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. దీనిలో సొంత వారికి లబ్ది చేకూర్చా లనే కుట్ర ఉంది.
సమాధానం : ఏ ఆప్షన్ ఎంపిక చేసినా దానిపై లాభనష్టాల గురించి ఎడతెరిపి లేకుండా విమర్శలు చేయడం సహజం. ఈ ఆప్షన్ ను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గాని, మంత్రి గాని చేయలేదు. 15 సీనియర్ అధికారులతో ఉన్న కమిటీలో పలు దఫాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ అధికారులు ఎవరూ దీనిపై డిసెంట్ నోట్ రాయలేదు. అంటే వారు కూడా బాధ్యులే కదా? మరి వారిని ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదో ఏపీ సీఐడీ చెప్పాలి. సమావేశంలో తీసుకున్న తీర్మానానికి అందరూ బాధ్యులవుతారు. ఇది సహజ న్యాయ సూత్రం… అదే సూత్రం సీఐడీకి వర్తించదా?

ఆరోపణ – 3 : హెరిటేజ్ సంస్థ భూములకు విలువ పెరగడానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను తయారు చేశారు.
వాస్తవం : హెరిటేజ్ సంస్థ మార్కెట్ విలువ రూ.2171 కోట్లు (21.71 బిలియన్ రూపాయలు) అని, వారికి అమరావతిలో ఉన్న భూమి 8 ఎకరాలని రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఉన్నది 9 ఎకరాలు. అది కూడా తుళ్లూరుకు 20 కిలోమీటర్లు, అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా జూలై 2014లోనే రిజిస్టర్ అయింది. భూమి విలువ పెరిగినా ఆ లాభం సంస్థకు, వాటాదారులకు చెందుతుంది. ఈ 9 ఎకరాల విలువ ఒక కోటి పెరిగిందని వాదించినా… దీని కోసమే మాస్టర్ ప్లాన్ ని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ని సింగపూర్ సంస్థతో కుట్ర చేసి తయారు చేయించారని చెబుతుంటే ప్రజలను ఎలా నమ్మించాలనే ఆరాటం తప్ప ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని అర్థమవుతోంది. అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా ఎవరు ప్రశ్నిస్తారులే అన్న ధైర్యంతో అడ్డగోలుగా వాదిస్తున్నట్టు ఉంది.

ఆరోపణ – 4 : లింగమనేని సంస్ధల వారికి లబ్ధి చేకూర్చడానికి మాస్టర్ ప్లాన్ ను, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను అనుకూలంగా తయారు చేయించారు.
వాస్తవం : లింగమనేని సంస్థ వారికి 1980 నుంచి 355.34ఎకరాలు కాజా, కంతేరు, నంబూరు గ్రామాలలో ఉన్నాయని తన ఫిర్యాదులో రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఆ తరువాత కూడా 10 ఎకరాల భూమి కొన్నారని తన ఫిర్యాదులో ఆయన చెప్పారు. తన భూములకు లబ్ధి చేకూరలేదని ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల తన భూమి 14 ఎకరాలు పోతుందని లింగమనేని సంస్థ వారు హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో తెలియజేశారు.

వందల ఎకరాల భూమి దశాబ్దాల క్రితం కొనుక్కున్న వారికి రోడ్డు ఎటునుండి వేసినా కొంత లబ్ది, కొంత నష్టము జరుగడం సహజం. దీని కోసం సింగపూర్ సంస్థలతో కుట్ర చేసి మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ ను మార్చారని చేస్తున్న వాదన నిరాధారం.. పూర్తి అసంబద్ధం. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది 319 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు సౌకర్యం కల్పించడానికి 3560 ఎకరాల భూమిని సేకరించి వేసే మహత్తర ప్రణాళిక. ఈ పిట్టకథలు.. కట్టుకథలు దాని ముందు నిలబడతాయా?

ఆరోపణ – 5 : రామకృష్ణ హౌసింగ్ సంస్థలో అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకి వాటాలు ఉన్నప్పటికి ఆయన ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా ఆ సంస్థకు లబ్ది చేకూరేలా మాస్టర్ ప్లాన్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేశారు.
వాస్తవం : ఏపి సీఐడీ వారు రామకృష్ణా హౌసింగ్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసినప్పుడు వారు కోర్టుకు ఇచ్చిన వివరణలో మురుగన్ హోటల్ పక్క నుండి ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వెళుతుండగా, దానికి 5.7 కిలోమీటర్ల దూరంలో తమ భూములు ఉన్నాయని తమకు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు వారి బ్యాంక్ ఖాతాలను విడుదల చేయించింది.

ఆరోపణ – 6 : రామకృష్ణ హౌసింగ్ వారి భూములు నిషిద్ద జాబితాలో ఉన్నా, వారి కోసం జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ లు మార్చి వారి బిల్డింగ్ ప్లాన్ లకు అనుమతి ఇచ్చారు. వారి భూముల తరువాత కట్టడాలు రాకుండా గ్రీన్ జోన్ గా ప్రకటించి అక్కడి రైతులకు అన్యాయం చేసి వీరికి మేలు చేకూర్చారు.
వాస్తవం : రామకృష్ణ హౌసింగ్ వారి బిల్డింగ్ ప్లాన్ లకు రాష్ట్రం ఏర్పడక ముందు 2013లోనే అప్పటి విజిటిఎం ఉడా వారు అనుమతులు ఇచ్చారు. జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ లు కూడా 2013లో ఆమోదించబడ్డాయి. సీఆర్డీఏ చట్టం ప్రకారం అప్పటికే ఆమోదం పొందిన జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ లలో ఏ మార్పులు చేయవలసిన అవసరం లేదు. ఇంత నిస్సిగ్గుగా కోర్టులు.. ప్రజలను తప్పుదారి పట్టించడం ఆళ్ల గొప్పతనం అనుకోవాలా?

రామకృష్ణా హౌసింగ్ వారికి తమ విద్యా సంస్థల తరఫున రెండు బిల్డింగ్ లు కట్టించి (1.50 లక్షల చదరపు అడుగులు మరియు 1.75 లక్షల చదరపు అడుగులు) దీర్ఘకాలిక పద్దతిపై అద్దెకు తీసుకోవడానికి నారాయణ సంస్థల వారు బ్యాంకు ఖాతాల ద్వారా దఫాదఫాలుగా రూ.12 కోట్లు బదిలీ చేశారు. ఈ ప్రాజెక్టు అమలుకాకపోవడం వల్ల వాటిని వెనక్కి కూడా తీసుకున్నారు. అంతే కానీ నారాయణ గారికి రామకృష్ణా హౌసింగ్ ఎప్పుడు, ఎక్కడా భాగస్వామ్యం లేదు… ఉన్నట్టు జరుగుతున్నది అంతా ఉత్తుత్తి ప్రచారం మాత్రమే.

ఆరోపణ – 7 : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన ఆస్థుల విలువను పెంచుకోవడానికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ ను ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను తయారు చేయించారు.
వాస్తవం : సమాచార హక్కు చట్టం క్రింద ఏపి సీఆర్డీయే వారు 2022లో ఇచ్చిన సమాచారం ప్రకారం పోరంకిలోని సర్వే నెం. 488లో నారాయణ గారికి ఉన్న భూమి ప్రతిపాదించిన రింగ్ రోడ్డు లో కలిసిపోతుందని అందువల్ల భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేమని సీఆర్డీఏ తెలియ జేసింది.

ఆరోపణ – 8 : నామినేషన్ పద్దతిపై సుర్భానా జూరాంగ్ కు మాస్టర్ ప్లాన్ తయారీని అప్పగించడం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్దం.
వాస్తవం : 05.12.2014 నుండి 27.07.2016 వరకు ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాం త్ స్పెషల్ కమిషనర్ హోదాలో మరియు కమిషనర్ సి.ఆర్.డి.ఏ హోదాలో ఈ నిర్ణయాలలో ప్రధాన భూమి వహించారు. కమిషనర్ గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు నేరపూరితమైతే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదో సీఐడీ చెప్పాలి. సీవీసీ మార్గదర్శకాలకు ఇది విరుద్దమని ఆయన బోర్డుకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి. తెలియజేయనప్పుడు ఆయన్ని ప్రాసిక్యూట్ చేయకుండా అర్థంపర్థంలేని ఆరోపణలు తమపార్టీపై చేయడం సిగ్గుచేటు. శ్రీకాంత్ పై కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృ ష్ణారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

ఈ వ్యవహారంలో లోకేశ్ పేరు చెప్పడం చూస్తే, ఈ అవినీతి ప్రభుత్వ తీరు రష్యా ఉక్రెయిన్ యద్ధం కూడా లోకేశ్ చెబితేనే జరిగిందని చెప్పినట్టు ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలా.. జగన్ రెడ్డి పాలన ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమైనా కావాలా?

పుట్టని బిడ్డకు పెళ్లిచూపులన్నట్టు.. అసలు వేయని రోడ్డులో రూ.2400 కోట్ల లబ్ధి అంటున్నారు
పుట్టని బిడ్డకు పెళ్ళి చూపులు అన్నట్లు వేయని రోడ్డుకు రూ.2400కోట్ల లబ్ది అట. వేల కోట్లు విలువ ఉన్న హెరిటేజ్ కు రూ.8 కోట్ల లాభమట. 350 ఎకరాలు ఉన్న లింగమనేనికి ఆయనకు చెందిన 15 ఎకరాల పక్కగా రోడ్డు వెళుతుందట. 6 కిలోమీటర్ల అవతల ఉన్న రామకృష్ణా హౌసింగ్ వారికి లబ్ది చేకూరిందట. 2013లో తీసుకున్న రామకృష్ణా హౌసింగ్ భవన నిర్మాణ అనుమతులకు సింగపూర్ సంస్థతో కుట్ర చేశారట.

ఇలా చెప్పేవాటిలో ఏ ఒక్క ఆరోపణకు సరైన ఆధారం లేదు, అలా ఆరోపించేవారికి మెదడు ఉన్నట్టు అనిపించడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై వైసీపీనేతలు, మంత్రులు, జగన్ రెడ్డి ఆడమన్నట్లు ఆడుతున్న విచారణ సంస్థలు చేస్తున్నవి కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు మాత్రమే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు టోల్ గేట్ లను వేలం వేస్తే రూ.7380 కోట్లు వచ్చింది. అభివృద్ధి అంటే అర్ధమయ్యే వారికి ఈ ప్రణాళికల విలువ తెలుస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో చంద్రబాబుపై పెట్టిన కేసు అయినా.. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో లోకేశ్ పేరు చేర్చడమైనా టీడీపీలో అలజడిరేపి, ప్రజల్నిగందరగోళ పరచాలన్న ప్రభుత్వ కుట్రల్లో భాగమే
నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు సృష్టిస్తూ, అవినీతి.. దోపిడీ యే ధ్యేయంగా పాలన సాగించింది. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నే విజయం సాధిస్తుందని ఇప్పటికే అన్ని సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఏదో రకంగా తెలు గుదేశాన్ని దెబ్బతీయాలి… ఆ పార్టీ అధినేతను మానసికంగా దెబ్బకొట్టాలన్న దురాలోచనలో భాగమే మొన్నటి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్… నేడు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై చేస్తున్న దుష్ప్రచారం. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ ఏ 14గా లోకేశ్ పేరు చేర్చడం రాజకీయ కక్షసాధింపులో భాగమే.

హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చ డానికి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చారనడం కూడా అసత్యప్రచారమే. లింగమనేని సంస్థ ఇన్నర్ రింగ్ రోడ్ వేయడం వల్ల తమకు నష్టమని, 14 ఎకరా ల భూములు పోతాయని హైకోర్టులో చెప్పి, ఆధారాలతోసహా నిరూపించింది. అలానే రామకృష్ణ సంస్థ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలో పేర్కొన్న విధం గా పూర్తయితే, దానికి మా భూములకు 6కిలోమీటర్లకు పైగా దూరముందని కూడా హైకోర్టుకి చెప్పింది. ఏ సంస్థ .. ఏవ్యక్తికి ఎక్కడా లబ్ధి కలిగే అవకాశం లేద ని స్పష్టంగా తేలాకే హైకోర్ట్ ఇంతకు ముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఎప్పుడో బెయిల్ మంజూరు చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ డిజై న్ కోసం చెల్లించిన సొమ్ము కూడా అధికారులు నిబంధనప్రకారమే చెల్లించారు. నిజంగా ఈ వ్యవహారంలో తప్పు జరిగితే అసలు మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజె క్ట్ లో కీలకంగా వ్యవహరించిన ఐ.ఏఎస్ అధికారి శ్రీకాంత్ ను ఈ ప్రభుత్వం, సీఐడీ ఎందుకు విచారించలేదు? క్విడ్ ప్రోకో.. ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదాలు.. వాటి అర్థాలు జగన్ రెడ్డికి తెలిసినంతగా మరెవరికీ తెలియవు.

చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తప్పుడు కేసు అయినా.. ఇప్పుడు లోకేశ్ పేరు చేర్చిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అయినా తెలుదేశం పార్టీలో అలజడి సృష్టిం చి, ప్రజల్ని గందరగోళపరచడానికి చేస్తున్నవే తప్ప మరోటి కావు. రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్ని ఎవరైనా అన్యాక్రాంతం చేస్తుంటే, వారు చూస్తూ ఊరుకుంటారా? ఈ నీతిమాలిన ప్రభుత్వానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు.” అని అనురాధ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE