షర్మిల భద్రత తగ్గించిన జగన్ సర్కార్

– 4+4 భద్రత కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
– పీసీసీ చీఫ్ అయిన తర్వాత 1+1 సెక్యూరిటీ తగ్గించిన ఏపీ సర్కార్
– ఇదేం న్యాయమని ప్రశ్నించిన కాంగ్రెస్
– కడపలో జగన్ బంధుమిత్రులకు ఎలా ఇచ్చారని ప్రశ్న
– డీజీపీకి షర్మిల ఎప్పుడో లేఖ రాశారన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ
– షర్మిలకు ఎస్కార్టు వాహనంతో భద్రత పెంచాల్సిందేనని డిమాండ్
– షర్మిలను మంత్రులు, వైసీపీ నేతలు బెదిస్తున్నా పోలీసులకు పట్టదా?
– పోలీసులపై పద్మశ్రీ ఫైర్
(మార్తి సుబ్రహ్మణ్యం)

సీఎం జగన్ చెల్లెలు, ఏపీసీసీ చీఫ్ షర్మిల భద్రత వ్యవహారం వివాదంగా మారింది. ప్రస్తుతం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 4+4 గన్‌మెన్లు కేటాయించింది. వీరు షిప్టుల ప్రకారం పనిచేస్తుంటారు. అయితే షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంతో, జగన్ ప్రభుత్వం ఆమెకు కేవలం 1+1 గన్‌మెన్లు మాత్రమే కేటాయించడం వివాదంగా మారింది.

జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని సీడబ్ల్యుసి సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి హితవు పలికారు. కాగా షర్మిల భద్రతపై జగన్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి పద్మశ్రీ విమర్శించారు. షర్మిలకు ఎస్కార్టు వాహనంతోపాటు, 4+4 గన్‌మెన్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.

‘‘ షర్మిల తనకు భద్రత కల్పించాలని ఈనెల 22న డీజీపీకి లేఖ రాశారు. అయినా ఇప్పటిదాకా స్పందన లేదు. 4+4 నుంచి 1+1కు భద్రత తగ్గించడంపై మాకు ఆందోళన, అనుమానం కలుగుతోంది. అయితే పోలీసులు థ్రెట్ పరప్షన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, లెక్కలేనితనంగా చెప్పడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

‘‘ షర్మిల తన అన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ నేతలు, రోజాలాంటి మంత్రులు షర్మిలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని పోలీసులు దృష్టిలో ఉంచుకోవాలి. షర్మిల పర్యటనలు, బహిరంగసభలకు జనం భారీ సంఖ్యలో వస్తున్నందున, ఆమెకు భద్రత పెంచాల్సిన అవసరం పోలీసులపై ఉంది. ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే మేం ఉద్యమించక తప్పదు’’ అని సుంకర పద్మశ్రీ ఘాటుగా హెచ్చరించారు.

కడపలో జగన్-భారతి బంధువులకు ఎంతమంది నిబంధనలకు విరుద్ధంగా గన్‌మెన్లు కేటాయించారో వెల్లడించాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు. జగన్ స్నేహితులు-బంధువులకు మాత్రమే కాకుండా, వారు సిఫార్సు చేసిన అనేక మంది కాంట్రాక్టర్లకు, వైసీపీ నేతలకు లెక్కలేనంతమందికి.. గన్‌మెన్లు ఇచ్చారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. వారికంటే పీసీసీ అధ్యక్షురాలి హోదా చిన్నదా? అని పద్మశ్రీ ప్రశ్నించారు.

కాగా షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లే.. జగన్ ప్రభుత్వం కూడా 4+4 గన్‌మెన్లు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే పోలీసు శాఖ ఆమెకు నేరుగా అంతమంది గన్‌మెన్లను కేటాయిస్తుందా? లేక నిబంధనలు, థ్రెట్ పరెప్షన్ పేరుతో కమిటీ పరిశీలన అని కాలయాపన చేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply