Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలి

-మాజీమంత్రి కెఎస్ జవహర్

జగన్మోహన్ రెడ్డి అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ఏ వ్యక్తి అయినా సరే రాజీనామా చేయాలి అని జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. గతంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం ప్రతి యేటా క్రమం తప్పకుండా డిఎస్సీలు నిర్వహిస్తామన్నారు..దీన్ని బట్టి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలి. ఇచ్చిన హామీలు మూడు సంవత్సరాలుగా పడకేశాయి. ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేదు. పైగా ఉన్న పోస్టులను పీకేస్తున్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనీ భర్తీ చేస్తాం.. ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఇచ్చిన ఉపన్యాసాలు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలి.

9,10 తరగతుల్లో మాత్రమే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అమలు చేస్తున్నారు. 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. తెలుగు మాధ్యమం కూడా ఉంటే రెండింటికీ ఉపాధ్యాయులను కేటాయించాల్సి వస్తుందనే కారణంతో ఒకేదాన్నే కొనసాగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. తెలుగు మాధ్యమంలోని సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. ఉన్న పోస్టులను సర్దుబాటు చేస్తారు గాని కొత్త నియామకాల అవసరం ఉండదు. ప్రతి ప్రాధమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పి నేడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ ను కేటాయించడం మోసం.

ఏకోపాధ్యాయ పాఠశాలలు 11 వేలు ఉన్నాయి. ఏకోపాధ్యాయ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాల్సివుంది. ప్రధానోపాధ్యాయ పోస్టులు పీకేస్తామనడం అర్థరహితం. పీఈటీ పోస్టులు ఉండవనడం తప్పు. మానసిక వికాసంతోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం కావున పీఈటీ పోస్టులుండాలి. జగన్ కు దేహదారుఢ్యంకు సంబంధించిన అవగాహన లేదు. అందుకే పీఈటీ పోస్టులు తీసేస్తామంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు లేని పాఠశాలలను పెడతామనడం అన్యాయం. ఇలా పెట్టడం వల్ల పాఠశాలల నిర్వహణ కుంటుపడుతుంది. ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయడం అన్యాయం. డిఎస్సీ నిర్వహించరా? కాలేజీలన్నీ మూసేస్తారా? బీఈడీ కాలేజిలతోపాటు సెకండరీగ్రేడ్ టీచర్ స్కూళ్లు మూసేస్తారా? ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారిని అన్యాయం చేయొద్దు. వారికి రిక్త హస్తాలు చూపొద్దు.

డీఈడీ, బీఈడీ కాలేజీలు ఎవరూ చేరక మూతపడుతున్నాయి. డీఎస్సీ లేనందున తెలంగాణలో డీఎస్సీ పెడితే దానిపై పరుగులు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల పట్ల ఆగ్రహం, కోపం ఉంది. జూన్ 20వ తేది నుంచి పాఠశాలలను తెరుస్తానన్నావు. మే నెల 20 వరకు కూడా పాఠశాలలు కొనసాగించావు. ఒక అకడమిక్ కేలెండర్ను ఏ విధంగా రూపొందించాలి అనే విధి విధానం లేదు. భవిష్యత్తు తరం పాడైతే ఏ విధంగా సమాధానం చెప్పగలవు? కొఠారి చెప్పినట్లు విద్యార్థుల భవిష్యత్తు నాలుగు గోడల మధ్య నిర్మాణం జరుగుతుంది. కానీ నేడు జగన్ ఆ నాలుగు గోడలను కూల్చే పనిలో ఉన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేస్తు్న్నారు. విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. వీటన్నింటిని సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే భవిష్యత్ తరాన్ని పాడుచేసినవారవుతారు. కావున జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని మాజీ మంత్రి కె ఎస్ జవహర్ అన్నారు.

LEAVE A RESPONSE